నవతెలంగాణ – భువనగిరి
లెనిన్ శతవర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ కార్యాలయంలో లెనిన్ చిత్రపటానికి ఆదివారం పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ.. తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసి అసువులు బాసినాడని వర్గ రహిత సమాజం కోసం కలలుకని నిర్మాణంలో పాలుపంచుకున్న మహా మేధావి శ్రామిక జన ఛాంపియన్గా జనం గుండెల్లో నిలిచిన మహోన్నతుడు అని కొనియాడారు. లెనిన్ చెప్పిన మాటలు చేసిన పోరాటం చూపిన మార్గం ఆయన రచనలు కోట్లాదిమంది మెదళ్లను ఆలోచింపజేశాయని అన్నారు. లెనిన్ ఒక ప్రేరణ ఒక ఉద్యమం ఒక ఆలోచన అన్నింటికీ మించి ఆ పేరే ఒక చోదక శక్తి అని అన్నారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపగలిగిన మార్గం మాత్రం లెనిన్ చూపిన మార్గమే అని తెలిపారు. నేడుఅధికారం చేజిక్కించుకునేందుకు వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రమాదకరమైన మతాన్ని కూడా అధికారం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. తమ అవసరాల కోసం అధికారం కోసం మత విద్వేషాలను సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల మనోభావాలను గౌరవించాలి కానీ తమకు అనుకూలంగా మార్చుకునే బలవంతపు ప్రయత్నాలు చేయడాని ఆయన ఖండించారు. ఇప్పుడు అందరూ కమ్యూనిస్టుల అవసరాన్ని గుర్తిస్తున్నారని కమ్యూనిస్టులు ఉండాలి అనే భావన రోజు రోజుకు బలపడుతుందన్నారు. సమాజ పోకడను నిర్దేశించగలిగిన శక్తి మాత్రం కమ్యూనిస్టులకే ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల అభిలాష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, చిక్క నరసయ్య పాల్గొన్నారు.