ఏజెన్సీ గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం 

– రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 
– లింగాల బంధాల ఏజెన్సీ గ్రామాలలో విస్తృత పర్యటన 
– 12 కోట్ల నిధుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు  
– యాస్ప్రిషన్  జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి..
నవతెలంగాణ -తాడ్వాయి 
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని లింగాల బంధాల ఏజెన్సీ గ్రామాలలో విస్తృతంగా పర్యటించి 12 కోట్ల తో, పలు అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. కొడిశాల నుండి పోచాపూర్ గ్రామం వరకు 4 కోట్ల 10 లక్షల నిధులతో బిటి రోడ్డు, ఆర్‌అండ్‌బి రోడ్డు లింగాల నుండి బొల్లేపల్లి గ్రామం వరకు 4 కోట్ల 10 లక్షల నిధులతో బిటి రోడ్డు, ఆర్ అండ్ బి రోడ్ పోచాపూర్ నుండి బందాల గ్రామం  వరకు 3 కోట్ల 80 లక్షల నిధులతో బిటి రోడ్డు, పోచాపూర్ లోని మిని గురుకులం లో 40 లక్షల నిధులతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు రాష్ట్ర పంచాయితి రాజ్,  గ్రామీణ అభివృద్ధి,  గ్రామీణ నీటి సరఫరా,  మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ లతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం పోచపూర్ గ్రామంలో   అధికారులతో కలసి నిర్వహించిన  ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు,  గ్రామములో కావాల్సిన సదుపాయాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. మాజీ సర్పంచ్ ఆగిబోయిన రామయ్య, ఉప సర్పంచ్ యాప మోహన్ రావు, నాయకులు మకిడి ప్రశాంత్ మరియు గ్రామస్తులు మాట్లాడుతూ బంధాల లోని అల్లిమడుగు ప్రాజెక్టు నిర్మిస్తే ఐదు గ్రామాల ప్రజలు రెండు పంటలు పండించుకుంటారని తెలిపారు. కొంతమందికి సర్వే లు నిర్వహించిన, ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు రాలేదని, అల్లిగూడెం నుండి నర్సాపూర్ (పియల్) గ్రామానికి రోడ్డు సౌకర్యం, అన్ని గ్రామాల అంతర్గత రోడ్లకు సిసి రోడ్లు నిర్మించాలని మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. మంత్రి స్పందించి వెంటనే ఎన్ని డబ్బులు అయినా మంజూరు చేసి ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ఆదివాసీలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ తో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని గ్రామాల్లో సిసి రోడ్లు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.
అదే విధంగా రానున్న రోజుల్లో అరులైన వారికి ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు పెన్షన్లు అందజేస్తామన్నారు. గతంలో బంధాల లింగాల గ్రామపంచాయతీలోని ఏజెన్సీ గ్రామాలలో ద్విచక్ర వాహనంపై వెళ్లాలంటే కూడా ఇబ్బందులు ఏర్పడేవని, అవి దృష్టిలో పెట్టుకుని, నేడు ఆయా గ్రామాల రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. గతంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో బంధాల ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లోని మంత్రులు ఆయా రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో కంటైనర్ హాస్పిటల్, పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బలరాం నాయక్, తాను (సీతక్క) కలిసి  పసర- లింగాల, పసర- మేడారం గ్రామాల గల రోడ్డును విస్తృత పరచడం జరిగిందని తెలిపారు. ఈ శంకుస్థాపన చేసిన రోడ్డు నిర్మాణ పనులను రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్ర అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు కు సానుకూలంగా స్పందించాలని అన్నారు. అడవులను కాపాడుకుంటూనే  రోడ్లను ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి  ఐటీడీఏ ల  బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
 గ్రామాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటు తో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన వారికి అందించడానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. ఏజెన్సీ గ్రామాలకు రోడ్డు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన యాస్ప్రిషన్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని అన్నారు. అనంతరం పోచాపుర్ లోని మినీ గురుకులం పాఠశాలను సందర్శించారు. విద్యార్ధులతో కలసి
నృత్యం  చేశారు. విద్యార్థుల కొరకు మధ్యాహ్నం భోజనం తయారు చేస్తుండగా వంట గదిని మంత్రి పరిశీలించి  మెనూ ప్రకారం రుచి కరమైన భోజనం పిల్లలకు అందించాలని సూచించారు. మినీ గురుకులం అభివృద్ధికి 40 లక్షలు వెంటనే మంజూరు చేశారు. వారం రోజుల్లో వంట షెడ్డు, డైనింగ్ హాల్ నిర్మించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రమ్,  పీఆర్ ఈ ఈ అజయ్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశం, డి పి ఓ దేవ్ రాజ్, ఆర్టీసీ డి ఎం  జోస్న, ప్రజా ప్రతినిధులు, ఇంచార్జ్ తహసిల్దార్ జగదీష్, ఎంపి డి ఓ సుమనవాని, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, మేడం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ లచ్చు పటేల్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, ఊకే మౌనిక, మంకిడి నరసింహస్వామి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మంకిడి ప్రశాంత్, ముద్ర కోళ్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.