ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే వీడీసీ లక్ష్యం

The aim of VDC is to make it an ideal village– వీడీసీ చైర్మన్ జెట్టి ఆజాద్ చంద్రశేఖర్
నవతెలంగాణ – దంతాలపల్లి
మండలంలోని బీరీశెట్టిగూడెం గ్రామాన్ని సంపూర్ణ డిజిటల్ విలేజ్ గా మార్పు కోసం స్వచ్ఛంద సంస్థ (విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జరుపుతున్నామని వీడీసీ చైర్మన్ జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ అన్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రజలందరి కి ప్రభుత్వం కల్పిస్తున్న ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ కార్డు, కరెంట్ బిల్లు, ఇంటి నెంబర్, అన్ని రకాల గుర్తింపు కార్డులలో పూర్తి చిరునామా ఒకే విధంగా ఏకీకృతమైన చిరునామా సరళికృతం చేసే కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ డిమాండ్ బుక్కులు ఉన్న ఇంటి నెంబర్ ప్రకారం ఓటర్ గుర్తింపు కార్డుల సవరణను గత మూడు నెలల నుండి వీడిసి, గ్రామపంచాయతీ బృందం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా నిర్వహించి స్థానిక తహసిల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసిల్దార్ శ్రీలత, రెవిన్యూ ఇన్స్పెక్టర్ నజీమోద్దీన్, రెవిన్యూ సిబ్బంది సహకారంతో గ్రామంలో ఉన్న ఓటర్ గుర్తింపు కార్డులలో 50 శాతం ( 680) కార్డులను సవరణ చేశారు. ఈ ఓటర్ గుర్తింపు కార్డులో సవరణ మహాకార్యానికి సహకరించిన రెవెన్యూ అధికారులను వీడిసి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వి డి సి చైర్మన్ హైకోర్టు న్యాయవాది జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఒక్కో గ్రామంలో గ్రామ పంచాయతీలోని డిమాండ్ బుక్ లో ఉన్న ఇంటి నెంబర్ ప్రకారం ఓటర్ గుర్తింపు కార్డులో ఉండదు, ఆధార్ కార్డు ఇతర గుర్తింపు కార్డులలో కూడా డిమాండ్ బుక్కులు ఉన్న ప్రకారం ఇంటి నెంబర్ అడ్రస్ లు ఉండవు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి డోర్ మీద ఉన్న ఇంటి నెంబర్ ప్రకారం ఓటర్ గుర్తింపు కార్డులో ఉండవు. ఓటర్ గుర్తింపు కార్డులో ఉన్న ప్రకారం ఆధార్ కార్డులో ఉండవు, ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం ఇతర గుర్తింపు కార్డులలో ఉండవు. అందుకే మన గ్రామంలో ఏకీకృత ఇంటి నెంబర్ చిరునామా, సవరణ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని గుర్తింపు కార్డులను ఒకే విధంగా ఉండేలా వీడిసి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో 50 శాతం ఓటర్ గుర్తింపు కార్డులను సవరణ చేశామని. నూరు శాతం ఓటర్ గుర్తింపు కార్డుల సవరణ అయ్యేంతవరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసిల్దార్ శ్రీలత, రెవిన్యూ ఇన్స్పెక్టర్ నజీమోద్దీన్, ఉమ్మ గాని శ్రీనివాస్, మిడతపల్లి సురేందర్, ఆలేటి రవి, వెంకన్న, నరేష్, లింగరాజు, వీరాచారి, నాగన్న, యాకయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.