అమ్మాయిలదే హవా

ఇంటర్‌ ఫలితాల్లో వారిదే పైచేయి
– ఫస్టియర్‌లో 61.68 శాతం, సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత
– ప్రథమ సంవత్సరంలో మేడ్చల్‌, ద్వితీయ సంవత్సరంలో ములుగు అగ్రస్థానం
– జూన్‌ 4 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ
– 16 వరకు ఫీజు చెల్లింపు గడువు

– నేటినుంచి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ దరఖాస్తులు
– ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందొద్దు : విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలితాలను మంగళవారం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించడం గమనార్హం. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 4,82,675 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,97,741 (61.68 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,41,673 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,65,994 (68.68 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,41,002 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,31,747 (54.66 శాతం) మంది పాసయ్యారు. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 14.02 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 4,33,082 మంది పరీక్షలు రాస్తే, 2,72,208 (62.85 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,17,454 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,49,723 (68.85 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,15,628 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,22,485 (56.80 శాతం) మంది పాసయ్యారు. ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌ విభాగంలో 49,593 మంది పరీక్ష రాస్తే, 25,533 (51.48 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 4,65,478 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,95,550 (63.49 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,29,958 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,64,598 (71.57 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 2,35,520 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,30,952 (55.60 శాతం) మంది పాసయ్యారు. అంటే ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు 15.97 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందడం గమనార్హం. జనరల్‌ విభాగంలో 3,80,920 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,56,241 (67.26 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 1,96,528 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 1,44,385 (73.46 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్‌ విభాగంలో 43,015 మంది పరీక్షలు రాస్తే, 28,738 (66.80 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, సీవోఈ జయప్రదబాయి, జేడీలు వై శ్రీనివాస్‌, భీంసింగ్‌, సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ప్రారంభం
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ నాలుగు నుంచి నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. బుధవారం నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఈనెల 16వ తేదీ వరకు ఉన్నది. బుధవారం నుంచి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఈనెల 16వ తేదీ వరకు ఉన్నది. రీకౌంటింగ్‌ కోసం ప్రతి పేపర్‌కూ రూ.100, రీవెరిఫికేషన్‌ కోసం ప్రతి పేపర్‌కూ రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. విద్యార్థులు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మార్కుల మెమోలను మంగళవారం సాయంత్రం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌ మెమోలను కాలేజీ లాగిన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ వెబ్‌సైట్‌ నుంచి కలర్‌ ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఫస్టియర్‌లో మేడ్చల్‌, సెకండియర్‌లో ములుగు అగ్రస్థానం
ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో మేడ్చల్‌ మల్కాజిగిరి, ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో మేడ్చల్‌ మల్కాజిగిరి నుంచి 62,553 మంది పరీక్షలు రాయగా, 47,474 (75 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 34,609 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 25,150 (72 శాతం) మంది పాసయ్యారు. 27,944 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 22,324 (79 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 73 శాతం ఉత్తీర్ణత సాధించి రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 68,289 మంది పరీక్షలు రాయగా, 50,433 (73 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 73 శాతంతో కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా మూడో స్థానంలో ఉన్నది.
ఈ జిల్లా నుంచి 4,371 మంది పరీక్షలు రాస్తే, 3,227 (73 శాతం) మంది పాసయ్యారు. 38 శాతం ఉత్తీర్ణతతో మెదక్‌ జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 6,364 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,462 (38 శాతం) ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌ విభాగంలో 73 శాతం ఉత్తీర్ణతతో నారాయణపేట జిల్లా అగ్రస్థానంలో, 40 శాతం ఉత్తీర్ణత సాధించి జగిత్యాల జిల్లా చివరిస్థానంలో నిలిచాయి. ఇంటర్‌ ద్వితీయ సంవ త్సరం జనరల్‌ విభాగం ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 1,632 మంది పరీక్షలు రాస్తే, 1,397 (85 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 844 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 692 (81 శాతం) ఉత్తీర్ణత పొందారు. 788 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 705 (89 శాతం) మంది పాసయ్యారు. 81 శాతం ఉత్తీర్ణతతో కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెండో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 4 వేల మంది పరీక్షలకు హాజరైతే, 3,249 (81 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌ విభాగం ఫలితాల్లో 52 శాతం ఉత్తీర్ణత సాధించి మెదక్‌ జిల్లా అట్టడుగున నిలి చింది. ఈ జిల్లా నుంచి 5,320 మంది పరీక్షలు రాస్తే, 2,785 (52 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌ విభాగంలో 85 శాతం ఉత్తీ ర్ణతతో నారాయణపేట జిల్లా ప్రథమ స్థానం లో ఉన్నది. 52 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా అట్టడుగున నిలిచింది.
ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందొద్దు : సబిత
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు, మార్కులు తక్కువగా వచ్చిన వారు ఆందోళన చెందొద్దని విద్యాశాఖ పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల కు వెయిటేజీని తొలగించామని అన్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించామన్నారు. ఫెయిలయ్యారని, మార్కులు తక్కువగా వచ్చాయంటూ విద్యార్థులపై తల్లిదండ్రులు కొప్పడొద్దని కోరారు. వచ్చేనెల నాలుగో తేదీ నుంచి అడ్వాన్స్‌ డ్‌ సప్లిమెంటరీ పరీక్షలున్నందున బాగా చదివి ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఇతర మిత్రులతో కలిసి ఉన్నత చదువులకు వెళ్లొచ్చని మంత్రి సూచించారు.