”కళ్ళంటూ ఉంటే చూసి, వాక్కుంటే వ్రాసీ!” అంటాడు శ్రీశ్రీ కవిత్వాన్ని ఉద్దేశించి. దీన్నే మనం ఛాయా చిత్ర కళకు అన్వయించి చెప్పుకొంటే ”కళ్ళంటూ ఉంటే చూసి, కెమెరా ఉంటే తీసీ!!” అనాలేమో. పొయెట్రీకీ ఫొటోగ్రఫీకీ పోలికేంటిరా బాబూ అనుకొంటున్నారా… ఔను మరి, ఈ నెల అంటే ఆగష్టు 19న అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకొంటుంది కదా, అందుకన్నమాట ఈ పోలిక. ఈ మెలిక. ఈ చిన్ని వ్యాస గుళిక!
చరిత్రలోకి తొంగి చూద్దాం… మిత్రులారా, ఈ రోజు ప్రాముఖ్యత తెలియాలంటే, ఒకసారి చరిత్ర పేజీని తిరగేయాలి. మనం కంటితో చూసే దశ్యాల్ని ఉన్నదున్నట్టుగా పట్టుకొని బంధించాలనే ఆలోచన మనిషికి చాలాకాలంగా ఉంది. చిత్రకళ ద్వారా కొంతమంది ఇది సాధించారు. బాగా చేయి తిరిగిన చిత్రకారులు ఓ ప్రకృతి దృశ్యాన్నో, వ్యక్తినో చూస్తూ సాధ్యమైనంత వరకు వాస్తవికత ఉట్టిపడేలా చిత్రించే వారు. కానీ వాళ్ళు అలా ఓ చిత్రాన్ని పూర్తి చేయడానికి కొన్ని నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు పట్టేది. పైగా అలా పూర్తి చేసిన కళాఖండం చాలా ఖరీదు పలికేది. దాన్ని ఏ రాజులో, భూస్వాములో, ధనవంతులో సొంతం చేసుకోగలిగేవారు. సామాన్యులకు ఆ కళాఖండాలు ఒక్కోసారి చూడాలన్నా సాధ్యమయ్యేది కాదు. అందుకే సులభంగా, చవగ్గా ఈ పని సాధించాలని కొంత మంది శాస్త్రవేత్తలు 17వ శతాబ్దిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. అవి 1826లో కానీ ఓ కొలిక్కి రాలేదు. అందులో నైస్ఫోర్ నిప్సే (Nicephore Niepce) అనే శాస్త్రవేత్త మొట్టమొదటగా కాంతి ద్వారా ఒక దశ్యానికి నమూనా లాంటిది ప్రింట్ చేయగలిగాడు. అయితే ఇది అంత నాణ్యతతో లేకపోవడమే కాకుండా దాదాపు 8 గంటల సమయం పట్టింది ఒక ఇమేజ్ కోసం. తరువాత అతను లూయిస్ డగురే (Louis Daguerre) అనే శాస్త్రవేత్తతో కలిసి మనం ఈ రోజు పిలుచుకొనే ఫొటోగ్రఫీ లేదా ఛాయాచిత్ర ప్రక్రియ అనేదాన్ని ప్రాథమిక స్థాయిలో మొదటిసారి అభివద్ధి చేశారు. దీన్ని వాళ్ళు Chamber of Peers in Paris ముందు ప్రదర్శించి, తరువాత The Academy of Sciences and the Academy of Fine Arts in the Palace of Institute ఆగష్టు 19న రిజిస్టర్ చేయడంతో దీనికి అధికారిక ఆమోద ముద్ర పడింది. అందుకే ఈ రోజును ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవంగా అందరూ జరుపుకొంటున్నారు.
అసలు ఫొటోగ్రఫీ అంటే ఏంటి?
ఫొటోగ్రఫీ అంటే మక్కీకి మక్కీ అర్థం. ‘కాంతితో గీసే చిత్రం’ అని. అంటే కిరణమనే కుంచెతో ఫిల్మ్ లేదా సెన్సార్ అనే కాన్వాస్ మీద గీసే బొమ్మే ఫొటో. ఇక దాని అసలు వివరానికి/ నిర్వచనానికి వస్తే, కాంతి సహకారంతో కాంతికి స్పందించి ప్రతిచర్య జరిపే పదార్ధం మీద ఒక దశ్యాన్ని కళాత్మకంగా చిరస్థాయిగా ముద్రించే ప్రక్రియనే ఛాయాచిత్రకళ అంటారు.
అంటే మనకు దీన్ని బట్టి అర్థమయ్యింది ఏంటంటే, కాంతి లేకుండా ఫొటోగ్రఫీలో ఏమీ చేయలేం అని. చివరికి రాత్రుళ్ళు తీసే ఖగోళ ఛాయాచిత్రాల్లో అంటే Astrophotographyలో కూడా కాలుష్యం లేని నిర్మలమైన ఆకాశం, అందులో మిలమిల మెరిసే నక్షత్రాలూ ఉండాల్సిందే. అయితే వెలుగు కావాలి కదా అని, కళ్ళు జిగేల్ మని మెరిసే లాంటి కాంతి ఫొటోగ్రఫీకి ఏమాత్రం పనికి రాదు. ఎక్కువుగా ఫొటోగ్రాఫర్‌లు సహజ సిద్ధమైన సూర్యుడి కాంతినే ఇష్టపడతారు. అది కూడా ఉదయం సూర్యోదయం అయిన రెండు గంటల లోపు, లేదా సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు ఉండే ఎండలోని వెలుగులో తీసే ఫొటోలు అద్భుతంగా వస్తాయి. అందుకే ఈ సమయాన్ని golden hours అంటారు. ఇది వేసవి, శీతాకాలాల్లో అరగంట అటు, ఇటూ కావొచ్చు. స్టూడియోల వంటి ప్రత్యేక ప్రదేశాల్లో ఫొటోగ్రాఫర్‌లు అవసరాన్ని పట్టి, flash lights ద్వారా కత్రిమ కాంతిని ఉపయోగిస్తారు. ఫొటోగ్రఫీలో వెలుగు అవసరం అన్నామని కేవలం ఓ దశ్యాన్ని వెలుగుతో నింపడం కాదు, వెలుగు ఎంత ముఖ్యమో, అది సష్టించే నీడలు కూడా అంతే ముఖ్యం. ఫొటోలో కళాత్మకత రావాలంటే వెలుగూ నీడల్ని వడుపుగా పట్టుకొని, అందంగా బంధించినప్పుడే ఓ గొప్ప ఫొటో తీయగలం.
గొప్ప ఫొటో ఎలా తీయాలి
ప్రపంచంలో గొప్ప ఫొటోలు ఉన్నాయి కానీ, వాటిని తీసేందుకు గొప్ప సూత్రాలు మాత్రం లేవు అనేది ఫొటోగ్రఫీలో చాలా తరచుగా కనిపించే, వినిపించే కొటేషన్. అంటే ఫొటోలు ఇలానే తీయాలి, ఇలా తీస్తే తప్పకుండా గొప్ప ఫొటో వచ్చి తీరుతుంది అనే సూత్రీకరణలు లేవు. ఎందుకంటే, చిత్ర రంగం, సంగీతం, నాట్యం, కవిత్వంలాగా ఫొటోగ్రఫి కూడా ఓ కళారంగం. అయితే ప్రతి కళారంగానికీ ఉన్నట్టే, ఫొటోగ్రఫీలో కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తూ మనదైన ప్రత్యేక సజనను తోడుగా వాడుకొంటే, మనం కూడా గొప్ప ఫొటోలు తీయగలుగుతాం అనేది నిర్ద్వంం. అవసరమైన ఆ ప్రత్యేక మెళకువలు ఏమిటో ఓ సారి చూద్దాం.
Composition (కూర్పు)
ఫొటోగ్రఫీలో అత్యంత కీలకమైంది ఇదే. అంటే, మనం కెమెరా view finder లో నుంచీ చూసినప్పుడు మన ముందు ఉన్న దశ్యంలోని వస్తువులు, మనుషులు లేదా పక్షులు, చెట్లు, పిట్టలు ఏవి ఉంటే అవన్నీ ఉన్నవి ఉన్నట్టుగా కనిపిస్తాయి. మనం తీయబోయేది ఎంత అందమైన దశ్యమైనా అందులో కొన్ని అనవసరం అనిపించే అంశాలు ఉంటాయి. వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే, తినేవాడికి పంటి కింద రాయిలా, అవి చూసే వీక్షకుడి దష్టిని పక్కదోవ పట్టిస్తాయి. చిరాకు పుట్టిస్తాయి. ముఖ్యంగా wildlife photographyలో background చాలా చాలా ముఖ్యం. అందుకే కెమెరా shutter నొక్కే ముందే, కెమెరాను కాస్త పక్కలకు తిప్పడం, లేదా పైకో కిందకో జరపడం, మనం ముందుకో వెనక్కో జరగడం లేదా మనం ఉపయోగించే లెన్స్ గనుక జూమ్ లెన్స్ అయితే దాన్ని ముందుకో వెనక్కో తిప్పడం ద్వారా ఈ అనవసర వస్తువులను ఫ్రేమ్‌లో నుండి సులభంగా తొలగించు కోవచ్చు. దీన్నే ఫొటోగ్రఫీలో composition అంటారు.
Exposure:– ఫొటోగ్రఫీలో ఇది రెండో అత్యంత కీలకమైన అంశం. అంటే, మనం తీయబోయే వస్తువుపై నుండి వచ్చే కాంతిని ఎంత సేపు కెమెరాలోకి అనుమతించాలి అనే అంశం అనమాట. ఎందుకంటే, వస్తువు మీద నుండి పరావర్తనం చెంది కెమెరాలోకి ప్రవేశిస్తున్న కాంతిలోనే దశ్యానికి సంబంధించిన సమాచారం మొత్తం ఉంటుంది. ఇది ఎక్కువైతే ఫొటో చెత్తగా తయారవుతుంది, తక్కువైతే కొరతగా ఉంటుంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కదా, అలా అన్నమాట. అంటే, అతివష్టి అనావష్టి లాగా. వర్షం ఎక్కువైనా పంటకు నష్టమే, తక్కువైనా నష్టమే కదా. దీన్ని కెమెరా ద్వారా నియంత్రించడానికి మూడు అంశాలు చాలా ముఖ్యం. ఈ మూడు అంశాల ద్వారా exposure ను నియంత్రించడానికి exposure triangle అనే పద్ధతిని ఫొటోగ్రఫీలో ఫాలో అవుతారు. అంటే, మూడు భుజాలు కలిసి ఎలా త్రికోణం ఏర్పడుతుందో అలాగే, aperture, shutter speed and ISO అనే మూడు అంశాలూ కలిస్తే exposure అనే త్రికోణం ఏర్పడి, మనం తీసే ఫొటోలో కాంతి కావాల్సిన విధంగా పరచుకొని చక్కని ఫొటోగా మారుతుందనేది ఇక్కడ సూత్రం. ఈ మూడింటినీ సరిగ్గా కెమెరాలో సెట్ చేసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని అంశాలున్నాయి కానీ, ఈ మూడూ సరిగ్గా సెట్ అయితే తొంబై శాతం పని పూర్తి అయినట్టే.
Timing:- మనకు కావాల్సిన వస్తువు కావాల్సిన వెలుగులో ఉండడమొక్కటే కాదు, అది గనుక పక్షో, జంతువో, మనిషో యితే దాని హావభావాలను ప్రదర్శించే భంగిమను ఫొటోలో పట్టి బంధించడం ముఖ్యం. గుర్తుందా, సాగర సంగమం సినిమాలో ‘భంగిమ’ అంటుంటాడు ఓ బుడ్డోడు కమల హసన్‌తో! సినిమాలో అది హాస్యం కోసం పెట్టినా, ఈ భంగిమ ప్రాముఖ్య ఫొటోగ్రఫీలో చాలా ఉంది. దీని కోసం సబ్జెక్టు అవగాహన మనకు చాలా అవసరం. Wildlife photographyలో ఇది మరీ ముఖ్యం. ఓ పక్షి ఓ కొమ్మ మీద కూర్చునుంది అనుకొందాం, అలా అది కేవలం కూర్చున్న ఫొటో తీస్తే అందులో ఏమాత్రం ఆసక్తి కనపడదు వీక్షకుడికి. అదే పక్షి ఆ కొమ్మ మీదనుండి ఎగిరే క్షణంలో దాన్ని ఫ్రీజ్ చేయగలిగితే గొప్ప flying shot వస్తుంది. దాని కోసం పక్షి కదలికల మీద అవగాహన ఉండాలి. చాలా వరకు పక్షులు ఉన్నట్టుండి ఎగరవు, అవి ఎగిరే ముందు దాని శారీరక కదలికలు మనకు ముందుగానే ఆ సమాచారం ఇస్తాయి. అది తెలిస్తే, మనం కెమెరాను ఫోకస్ చేసి సరైన భంగిమ కోసం సిద్ధంగా ఉండొచ్చు. అలాగే ఓ వీధిలో కొందరు గొడవ పడుతున్నారు అనుకొందాం. వాళ్ళు గట్టిగట్టిగా కేకలు వేసుకొంటూ ఉండే ఫొటోలు పెద్ద ఆసక్తిని కలిగించవు. అందులో ఎవడో ఒకడికి తిక్క తారాస్థాయికి చేరి ఎదుటివాడి గూబ గుయ్యిమనిపించే క్షణంలో ఫొటో తీయగలిగితే అద్భుతంగా ఉంటుంది (మన ఫొటో కోసం వాళ్ళు తన్నుకోవాలని కోరుకోవడం లేదు సుమా). ఇలా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వొచ్చు. కానీ ఈ కావాల్సిన భంగిమ కోసం ఒక్కోసారి గంటల తరబడి ఏకాగ్రతతో వేచి ఉండాల్సి వస్తుంది. కానీ ఆ moment మాత్రం కేవలం క్షణంలో వెయ్యో వంతులో జరిగిపోతుంది. ఫొటోగ్రాఫర్ అప్రమత్తుగా ఉండి ఆ క్షణాన్ని బంధించగలగాలి.
నియమ ఉల్లంఘన తెలియాలి
అవును, నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో, ఏ కళలోనైనా, ముఖ్యంగా ఫొటోగ్రఫీలో, వాటిని సజనాత్మకంగా ఉల్లంఘించగలగడం కూడా అంతే ముఖ్యం. కానీ ఆ ఉల్లంఘన కేవలం గొప్ప ఫొటో కోసం మాత్రమే జరగాలి. అలా కాకుంటే మన ఫొటోలు ఒకే మూస ధోరణిలో ఉంటూ, మనకే బోర్ కొట్టిస్తాయి. అంటే, ఏ కళాకారుడైనా ప్రయోగశీలిగా ఉండాలి. ఏదో ఓ కొత్తదనం కోసం నిరంతరం తపించాలి.
ఇలా ఫొటోగ్రఫీలో కొన్ని మెళుకువలు ఉన్నాయి కానీ, గొప్ప ఫొటోగ్రాఫర్ కావడం మన పట్టుదల, నిరంతర అధ్యయనం, ప్రయోగ శీలతల మీదే ఆధారపడి ఉంటుందన్నది అక్షర సత్యం. సరే, రసాయనిక ప్రక్రియతో మొదలైన ఫొటోగ్రఫీ, ఎన్నో దశల్ని దాటుతూ ఎలక్ట్రానిక్ సాంకేతిక సహకారంతో నేటి డిజిటల్ యుగంలో కత్రిమ మేధను సైతం ఉపయోగించు కొంటూ ఊహించనంత అభివద్ధిని సాధించింది. ఫిల్మ్ కెమెరాలతో ప్రారంభమై DSLR కెమెరాలుగా అభివద్ధి చెంది నేడు morrorless camera ల స్థాయికి చేరుకున్నాయి. డ్రోన్ కెమెరాల వంటి ఆధునిక పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. టెక్నికల్‌గా ఎంత అభివద్ధి వచ్చినా అది ఛాయా చిత్రకారుడికి సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని అందించిందే కానీ, ఓ చిత్రాన్ని కళాఖండంగా తీర్చి దిద్దాలంటే మాత్రం ఇప్పటికీ అంతే కష్టం. అందుకు కెమెరా కంటే హదయం ముఖ్యం. అందాన్ని లేదా భావోద్రేక కవళికల్ని చూడగల హదయ నేత్రం నీలో లేకపొతే ఎప్పటికీ నువ్వు గొప్ప ఫొటోగ్రాఫర్ కాలేవు. అందుకే ఓ మంచి ఫొటో వెయ్యి మాటల్ని పలకగలదు అంటారు. అంటే, వెయ్యి మాటల్లో చెప్పలేని భావాల్ని కుడా ఓ ఫొటో మనకు కళ్ళతోనే చెప్పగలదు. అందుకే ఎన్నో సంవత్సరాల క్రితం Ansel Adams గారు తీసిన ప్రకృతి దశ్యాల నలుపు తెలుపుల ఛాయాచిత్రాలు ఇప్పటికీ ఫొటోగ్రాఫర్‌లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. గాంధీని కర్ర పట్టుకొని నడిపిస్తున్న ఓ చిన్నారి బాలుడి ఫొటో, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో రెండు కళ్ళూ కోల్పోయి చనిపోయిన ఓ చిన్నారిని, తండ్రి మట్టిలో పూడ్చి పెడుతున్నప్పుడు ప్రముఖ భారతీయ ఫొటోగ్రాఫర్ రఘురారు తీసిన చిత్రం, గుజరాత్ మత కలహాల్లో ఓ గుంపు దాడి చేసినప్పుడు చేతులు జోడించి కన్నీళ్ళతో వేడుకొంటున్న ఓ వ్యక్తి ఫొటో, తన కూనల్ని నోటితో పట్టుకొని తీసికెళుతున్న పులులు/ సింహాల ఫొటోలు… ఇలా ఎన్నో చిత్రాలు మనకు మాటలకందని భావాల్ని కళ్ళముందు నిలుపుతాయి. ఎన్నో పాత ఫొటోలు ఆ నాటి చారిత్రిక సంఘటనల్ని చెక్కు చెదరకుండా రికార్డు చేశాయి. అంతేగానీ, ఏది పడితే అది తీయడం ఫొటోగ్రఫీ అనిపించుకోదు. అందుకే అంటారు, ఫొటోనే తీయాలంటే చాలా సులభం, కెమెరా చేతిలో ఉంటే షట్టర్ బటన్ క్లిక్ మనిపించడానికి క్షణంలో వెయ్యో వంతు చాలు… కానీ ఓ మరపురాని ఫొటో తీయాలంటే మాత్రం పదివేల క్లిక్ లైనా సరిపోవు. మిగతా కళలతో పోల్చినప్పుడు ఫొటోగ్రఫీ కష్టం అనిపించడానికి కారణం ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వడిసి పట్టుకోగల నైపుణ్యం పెంపొందించు కోవడం, కళాత్మక హదయం కలిగి ఉండడం. రెండూ పెనవేసుకొని సాగినప్పుడే గొప్ప ఫొటోగ్రాఫర్ అవుతారు.
ఇకపోతే ఫొటోగ్రఫీలో వెడ్డింగ్/ ఈవెంట్ ఫొటోగ్రఫీ, ైన్‌ఆర్ట్ ఫొటోగ్రఫీ, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, నేచర్ ఫొటోగ్రఫీ, మాక్రో ఫొటోగ్రఫీ, అండర్ వాటర్ ఫొటోగ్రఫీ… ఇలా అనేక రకాలు ఉన్నాయి. ఏ రకంలోనైనా గొప్పగా రాణించాలంటే కష్టం ఒకటే. అకుంఠిత శ్రమ, నిరంతర అధ్యయనం, పట్టుదల, మెరుగైన నైపుణ్యం… ఇలా అన్నీ కలిస్తేనే సాధ్యం. వీటన్నిటి కంటే ముందు ఈ రంగం మీద అమితమైన అభిరుచి (passion), ఆశక్తి ఉండాలి. ఇష్టంతో చేసినప్పుడు కష్టం కనిపించదు, అనిపించదు.
ఫొటోగ్రఫీని చాలామంది సొంతంగానే, ఇతర ఫొటోగ్రాఫర్‌ల దగ్గర పని చేస్తూనో, చూస్తూనో నేర్చుకొంటారు. అయితే ఇప్పుడు దీన్ని చదువులాగా అందించే ఇన్‌స్టిట్యూట్‌లు, కాలేజీలు వచ్చాయి. Fine art కళాశాలల్లో నాలుగేళ్ల కోర్స్‌గా కూడా దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో అందిస్తున్నారు. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక, నేర్చుకోవాలనుకొనే వారికి ఎన్నో అవకాశాలు అది కల్పిస్తోంది. ఎంతోమంది ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌లు తమ youtube చానళ్ళ ద్వారా నిత్యం కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. అలాగే ఎన్నో వెబ్ సైట్లు కూడా మెళుకువలు నేర్పిస్తున్నాయి. వీటన్నిటి కంటే ముఖ్యం, నువ్వు సీరియస్‌గా ఫొటోగ్రాఫర్ కావాలనుకుంటే, కెమెరా, లెన్స్ కొని, నీకు ఇష్టమైన రంగం ఎంచుకొని ఫొటోలు తీయడం మొదలు పెట్టాలి. మిగతాదంతా అదే నేర్పిస్తుంది. ఇక వ్యక్తిగతంగా నేను nature photographer ను. సొంతంగానే నేర్చుకొన్నాను, నేర్చుకొంటున్నాను. అందులోనూ wildlife photography మీద ప్రత్యేక శ్రద్ధ. ఇంకాచెప్పాలంటే bird photography మీద మక్కువ ఎక్కువ.
ఆఖరిగా ఓ ముఖ్యమైన విషయం. సెల్ ఫోన్‌లు వచ్చాక, పిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్ అయిపోయారు. ఫొటోగ్రాఫర్‌లు అనే కంటే పిచ్చోళ్ళు అయిపోయారు అనాలేమో. సెల్ఫీలతో మొదలైన ఈ పిచ్చి, ఇప్పుడు రీల్స్‌తో ముదిరిపోయింది. సోషల్ మీడియా ఈ పిచ్చోళ్ళకు వేదికగా మారిపోయింది. వాళ్ళు పెట్టే పోస్ట్‌లు రాత్రికి రాత్రి వైరల్ అయిపోయి, హీరో అనిపించుకోవాలనే వెర్రి ముదిరిపోతోంది. ఈ పిచ్చిలో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఫొటోగ్రఫీ తాత్కాలిక ఉద్రేకాన్ని కలిగించే డ్రగ్ కాదు, అది తీసేవారికీ, చూసేవారికీ శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే కళ. ఇప్పటికీ ఎంతోమంది అలాంటి కళాకారులు మనకు గొప్ప గొప్ప ఫొటోలు అందిస్తున్నారు. నిజంగా అలాంటి ఫొటోగ్రాఫర్ కావాలంటే, నిద్దర, బద్దకాన్ని వదిలి లే… అలా ఊరి బయటకు, కొండల వైపు, గుట్టల వైపు, అడవుల వైపు, తోటల వైపు, చెరువుల వైపు నడువు…. నువ్వు ఎప్పుడూ చూడని, గమనించని చెట్లూ, పూలూ, పిట్టలు, పురుగులు, జంతువులూ నిన్ను పలకరిస్తాయి. వాటిని అందంగా కెమెరాలో బంధించు, నలుగురికీ చూపించు. మరీ బాగున్నట్టు అనిపిస్తే ప్రింట్ తీసి, ఫ్రేమ్ కట్టి గోడకు తగిలించు…. నువ్వు పోయినా (ఎప్పటికైనా తప్పదు కదా), నీ ఫొటోలు నిన్ను చిరంజీవిని చేస్తాయి! ఆల్ ది బెస్ట్!!