
నవతెలంగాణ – అశ్వారావుపేట : చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడి అత్యంత హేయమైన చర్యగా అశ్వారావుపేట మండల పరిషత్ మాజీ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి,జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాశ్ లు అభిప్రాయపడ్డారు. అసలైన నిరుపేదలకు సంక్షేమ పధకాలు అందలేదని అధికారుల దృష్టికి తీసుకురావటం తప్పా అంటూ వారు ప్రశ్నించారు.
ఈ మేరకు బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకుల దాడిని సోమవారం వారు తీవ్రంగా ఖండించారు.గడిచిన 10 ఏళ్ళ కేసీఆర్ సర్కార్ లో ఇటువంటి దాడులు,ప్రతి దాడులు ఎన్నడూ జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాజకీయ ఒరవడిని తీసుకొస్తుందని మండిపడ్డారు.ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఎప్పుడూ గొంతెత్తి పోరాడుతూనే ఉంటుందని, ఎన్ని దాడులు,అక్రమ కేసులు బనాయించిన, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.తక్షణమే బీఆర్ఎస్ నాయకుడి పై దాడి చేసి కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆయా మండలాల పార్టీ నాయకులు సత్యవరపు సంపూర్ణ, జుజ్జూరపు శ్రీరామమూర్తి, తాళం సూరి, చిప్పనపల్లి బజారయ్య, మోటూరి మోహన్ లు పాల్గొన్నారు.