కవులు, రచయితలపై మతోన్మాదుల దాడి దుర్మార్గం : ఐద్వా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కవులు, రచయితలపై మతోన్మాద ఏబీవీపీ, బీజేపీ మూకల దాడి అమానుషమని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ”లౌకిక విలువలు- సాహిత్యం” అనే అంశంపై ”సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌” ప్రజాస్వామ్య యుతంగా సదస్సు నిర్వహించారని తెలిపారు. దానిపై అరాచకశక్తులు దాడి చేయటం దుర్మార్గమని పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్టు చేసి చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాల మేరకు, భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా, అభిప్రాయాలను వెల్లడించడంలో తప్పేంటని ప్రశ్నించారు. రోజు రోజుకూ పతనమవుతున్న రాజ్యాంగ, లౌకిక విలువలను కాపాడుకోవాలని కవులు, రచయితలు, మేధావులు సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌గా చర్చించటం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అది ఒక సామాజిక బాధ్యతగా అర్థం చేసుకోవాలని సూచించారు. కానీ.. సంఫ్‌ుపరివార్‌ శక్తులు సమావేశ మందిరంలోకి జొరబడి, కవులను, రచయితలను పరుష పదజాలంతో దూషిస్తూ, పోలీసుల సాక్షిగానే ఫ్లెక్సీలు చింపి వేశారనీ, కుర్చీలు చిందరవందర చేస్తూ నానా బీభత్సం సృష్టించటం ఆందోళన కరమని తెలిపారు. పోలీసుల సాక్షిగానే డాక్టర్‌ పసునూరి రవీందర్‌, నరేష్‌ కుమార్‌ సూఫీ, మెర్సీమార్గరెట్‌, ప్రొఫెసర్‌ క్యాతాయిని, భూపతి వెంకటేశ్వర్లతో పాటు ఇతరులపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. దీన్ని ప్రజాస్వామిక, లౌకిక శక్తులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.