న్యూస్‌ క్లిక్‌పై దాడి పత్రికా స్వేచ్ఛను హరించటమే..

The attack on News Click is to take away the freedom of the press..– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్‌
– ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ – ముషీరాబాద్‌
ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌ క్లిక్‌ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అది పత్రిక స్వేచ్ఛను హరించడమేనని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్‌ అన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కోట రమేష్‌ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే వ్యక్తులపైనా, సంఘాలు, మీడియా సంస్థలపైనా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్‌ క్లిక్‌ కార్యాలయంపైనా, సిబ్బంది ఇండ్లపైనా ఢిల్లీ పోలీసులు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దాడులు నిర్వహించి.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కయాస్థ, పోర్టల్‌ హెచ్‌ఆర్‌ విభాగం అధిపతి అమిత్‌ చక్రవర్తిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. నిజాలు చెప్పే న్యూస్‌ క్లిక్‌పై మోడీ సర్కార్‌ కక్షగట్టిందన్నారు. ఏమాత్రం పసలేని చైనా కుట్ర థియరీని తెరపైకి తీసుకొచ్చి న్యూస్‌ క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులను, కళాకారులను, చరిత్రకారులను అరెస్టు చేయడం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. అనగంటి వెంకటేష్‌ మాట్లాడుతూ.. స్వతంత్ర మీడియా గొంతు నొక్కేందుకు దానిపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్‌ బషీరుద్దీన్‌, డి.తిరుపతి, గడ్డం వెంకటేష్‌,పి.జగన్‌, శివ వర్మ, సహాయ కార్యదర్శులు జావేద్‌, భాస్కర్‌, తిరుపతి, నవీన్‌, హరిక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.