– బాధితులకు న్యాయం చేయాలి : సీఎంకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్హాపూర్ మండలం, మూలచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు కుటుంబంపై జరిగిన దాడి, వారి భూముల ఆక్రమణపై హైకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సహాయ కార్యదర్శి ఆత్రం తనుష్, ఉపాధ్యక్షులు తొడసం భీంరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దాడి చేసిన పెత్తందార్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, లైంగికదాడి, అపహరణ కేసులను నమోదు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలనీ, రకరకాల ప్రలోభాలు, ఒత్తిడులతో పెత్తందార్లు కాజేసీన చెంచు ఆదివాసీల భూములను తిరిగి వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు. భూమిని అక్రమంగా కాజేయడానికి సహకరించిన తహశీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులను విధుల నుంచి తొలగించి వారిపై కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ గ్రామంలో రెండేళ్ల నుంచి నిలిపేసిన ఉపాధి హామీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలనీ, నిర్వాసిత చెంచు కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆదిమ చెంచు కుటుంబాలన్నింటికీ తక్షణమే పోషకాహారం అందించాలని వారు కోరారు.
కాట్రాజు ఈరన్న రెండెకరాల భూమిని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేశం, బండి శివుడు (శివ), వెంకటేశం భార్య బండి శివమ్మ కౌలు చేస్తున్నారని తెలిపారు. ఆ భూమిని తమకే అమ్మాలని కౌలుదారులు కాట్రాజు ఈరన్నపై ఒత్తిడి తెచ్చి ఎకరాకు రూ.2.25 లక్షలకు మాట్లాడుకుని అడ్వాన్సుగా రూ.ఒక లక్ష ఈరన్నకు చెల్లించారు. అయితే ఈరన్న కుమారుడు ఈదన్న, కోడలు ఈశ్వరమ్మ భూమి అమ్మకాన్ని వ్యతిరేకించి దస్తావేజుపై సంతకాలు పెట్టడానికి నిరాకరించారు. దీంతో వారిని తిట్టడం, కొట్టడం కూడా చేశారు. పెత్తందార్ల భయంతో ఈశ్వరమ్మ పిల్లలను వదిలేసి పారిపోతే, ఆమెను పట్టుకుని ఈడ్చుకెళ్లి బండి వెంకటేశం ఇంట్లో వారం రోజుల పాటు లైంగిక హింసకు పాల్పడ్డారని వారు తెలిపారు. ఈశ్వరమ్మ ఎడమచేతిపై వేయబడిన మూడు వాతలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.