పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంకకేసారం గ్రామంలోని సాయి బ్రిక్స్ లో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని పౌరహక్కుల సంఘ సభ్యులకు తెలియడంతో నిజ నిర్ధారణ కోసం పౌర హక్కుల సంఘం నాయకులు పుల్ల సుచరిత, నారా వినోద్, బొడ్డుపల్లి రవి, బండారి రాజా లింగయ్య శుక్రవారం నిజ నిర్ధారణ చేసి మాట్లాడారు. ఇటుక బట్టీల యజమాని సైన్ల విష్ణు ఒరిస్సా వలస కార్మికులను 9 మందిని ఫిబ్రవరి 8 న మధ్యాహ్నం 3 గంటలకు మండుతున్న ఇటికబట్టిలోని ఇటుకను తీయమని ఆదేశించాడనీ వారు అన్నారు. అలాగే కార్మికులు అన్నం తిన్న తర్వాత తీస్తామని చెప్పిన వినకుండా 9 మంది వలస కార్మికులను చెప్పులతో కొడుతూ, తన్నుతూ, కర్రలతో కొట్టాడనీ, వారు తెలిపారు. అదేవిధంగా ఈ వలస కార్మికులను ఒరిస్సా రాష్ట్రంలోని బలంగిర్, సోనాపూర్ జిల్లాలనుండి 80 మంది దళిత, ఆదివాసి వలస కార్మికులను ఐదు నెలల క్రితం తీసుకువచ్చారనీ, అదేవిధంగా అప్పటినుండి వలస వచ్చిన కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తూ, శ్రమ దోపిడీ చేస్తూ కార్మికులపై భౌతిక దాడులు దిగుతూ, యజమాని దౌర్జన్యం చేస్తున్నాడని తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టీల యజమానులు 2014 నుండి మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారని, 2015లో పెద్దపల్లి లో సూర్జబాగ్ అనే గర్భవతిని కూడా కాలుతో తన్ని హత్య చేశారని అదేవిధంగ నూకంటి మార్జి అనే యువతని కూడా యజమాలు హత్య చేశారనీ, అప్పటినుండి పౌర హక్కుల సంఘం లేబర్ కమిషనర్ కు, మహిళా కమిషన్కు, రాష్ట్ర హోంమంత్రికి, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని అన్నారు. అయినప్పటికీ ఈలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ మొత్తం సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచరణ జరిపించాలని బట్టి యజమాని సైన్ల విష్ణు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేశారు.