రచయితలపై మతోన్మాదుల దాడి అమానుషం

– దాడికి పాల్పడిన
– ఏబీవీపీ మూకలపై చర్య తీసుకోవాలి : ప్రజాసంఘాల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమూహ రచయితల సదస్సుపై మతోన్మాదుల దాడి హేయమైన చర్య అనీ, ఈ ఘటనకు పాల్పడ్డ ఏబీవీపీ మూకలపై చట్టపర చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల రాష్ట్ర కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్‌, ఎ వెంకటేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి నాగరాజు సోమవారం వేర్వేరుగా ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఫాసిస్టు మూకల దౌర్జన్యాలకు ప్రతిరూపమే ఈ ఘటన అని పేర్కొన్నారు. లౌకిక, ప్రజాస్వామిక విలువలను కాపాడాలని రచయితలు భావిస్తున్నారనీ, ఆ స్వేచ్ఛ వారికున్నదని తెలిపారు. రచయితలంతా సమూహంగా ఏర్పడి నిర్వహిస్తున్న సదస్సుపై అప్రజాస్వామిక దాడికి పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు. వారిపై భౌతిక దాడులకు పాల్పడటం, బ్యానర్లను చించివేయటం దుర్మార్గమని తెలిపారు. గతంలో గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌, కల్‌బుర్గీ, గౌరీ లంకేష్‌ లాంటి మేధావులను ఫాసిస్టు మూకలు పొట్టనబెట్టుకున్నాయని గుర్తు చేశారు. బీజేపీ పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా సభలు నిర్వహించుకుని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మతోన్మాదులు హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదనీ, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ దాడులను ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీి అండతోనే ఫాసిస్టు మూకలు రెచ్చిపోతున్నాయని తెలిపారు. వీటి పట్ల కఠినంగా వ్యవహరించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల తీసుకోవాలని కోరారు.
పీవోడబ్ల్యూ ఖండన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమూహ సదస్సుపై ఫాసిస్టు మూకల దాడి అమానుషమని ప్రగతి శీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి ఝాన్సీ, అందె మంగ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు