దాడులు అమానుషం

– చెన్నూర్‌లో తాగునీటి చెలిమెలో మూత్ర విసర్జన మానవత్వానికే మచ్చ
– పేదలపై దాడి చేసినవారికే వంతపాడుతున్న పోలీసులు, ఆధికారులు
– దీని అంతర్యమేమిటీ.?
– భయపెడితే పేదలు పారిపోరు..
– మరింత తెగువతో పోరాడతారు
– ఎర్రజెండా వారికి అండగా ఉంటుంది : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, మల్లు లక్ష్మి
– జగిత్యాలలో సీపీఐ(ఎం) నాయకులపై అక్రమ కేసులు
నవతెలంగాణ- చెన్నూర్‌ / జగిత్యాల
ప్రభుత్వ ఆసైన్డ్‌ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలపై దాడి ఒక అమానవీయమైన చర్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, మల్లు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట శివారు సర్వే నెంబర్‌ 8లో పేదలు వేసుకున్న గుడిసెలపై దాడి చేసి, తాగునీటి చెలిమెలో మూత్ర విసర్జన చేయడం మానవత్వానికి మాయని మచ్చని అభివర్ణించారు. అదే విధంగా, జగిత్యాల జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోని తిమ్మాపూర్‌, మోతే గ్రామాల మధ్య ఉన్న ప్రభుత్వం భూమిలో వారం రోజులుగా ఇండ్ల స్థలాల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న వారిపై గ్రామ ఉప సర్పంచ్‌ మోహన్‌ రెడ్డి దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు గాయపడ్డారు. ఆదివారం మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో జరిగిన ఈ దాడుల్లో గాయపడిన వారిని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య, మల్లు లక్ష్మి పరామర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట శివారు సర్వే నెంబర్‌ 8లో పేదలు వేసుకున్న గుడిసెలను సందర్శిచి ఎస్‌. వీరయ్య మాట్లాడారు. పేదలు గుడిసెలు వేసుకొని ఐదు నెలలకు పైగా నివాసముంటుంటే, పక్కా ప్లానింగ్‌తో 200 మందిని తీసుకొచ్చి వేసుకున్న గుడిసెలను, అందులో ఉన్న సామగ్రిని కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది భూ కబ్జాదారులకు వత్తాసు పలికి, మామూళ్లకు తలొగ్గి అక్రమంగా పట్టా చేయించారన్నారు. పేదలు వేసుకున్న గుడిసెలు కూల్చి కాల్చి వేస్తుంటే.. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలన్నీ ఒక గంటలోపే కూల్చి, కాల్చి వేయడమే కాకుండా, మంచినీటి కోసం తవ్వుకున్న చెలిమలో మూత్ర విసర్జన చేశారని మండిపడ్డారు. పట్టణానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరుగుతుంటే పట్టి పట్టనట్టుగా పోలీసులు ఆలస్యంగా రావడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఒక వైపు పేదలకు మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామంటూనే మరోపక్క ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తూ, భూ కబ్జాదారులకు వంతపాడుతున్నారని విమర్శించారు. ఏది ఏమైనా పేదలు వెను తిరిగి పోరని, ఇంటి జాగాకి పట్టాలిచ్చేంత వరకు సీపీఐ(ఎం) అండదండలతో పోరాడుతారని స్పష్టం చేశారు. అనంతరం మల్లు లక్ష్మి మాట్లాడు తూ.. ఐదు నెలలుగా ఇక్కడే ఉంటూ అన్ని సమకూర్చు కున్నారని, వాటన్నింటినీ కూల్చి, కాల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గుడిసెవాసులకు రూ.2 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కబ్జాకోర్లను ఎదుర్కొని పోరాటం సాగించాలని, పార్టీ అండగా ఉంటుందని భూ పోరాట భాదితులకు స్పష్టంచేశారు. మంచినీళ్ళ చెలిమలో మూత్ర విసర్జన చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి రాజేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు, గుడిసెవాసులు పాల్గొన్నారు. జగిత్యాల కేంద్రానికి కూత వేటు దూరంలోని తిమ్మాపూర్‌, మోతే గ్రామల మధ్య ఉన్న ప్రభుత్వం భూమిలో వారం రోజులుగా ఇండ్ల స్థలాల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శాంతియుతంగా పోరాటం చేస్తున్న పేదలపై దాడి హేయమైన చర్య అని సీపీఐ(ఎం) నేతలు అన్నారు. ధర్నా చేస్తున్న వారిలో సీఐటీయూ కన్వీనర్‌ సులోచనతో పాటు మరో ఆరుగురిపై గ్రామ ఉప సర్పంచ్‌ మోహన్‌ రెడ్డి దాడి చేయగా, గాయపడిన వారిని పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు 120గజాల స్థలంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం లో ఇప్పటికే 64 కేంద్రాల్లో ఇండ్ల స్థలాల కోసం పోరాటం జరుగుతోందని తెలిపారు. జగిత్యాలలో 65వ కేంద్రంగా పోరాటం చేస్తున్న వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలిపారు. తిమ్మాపూర్‌,మోతే గ్రామాల మధ్యలో ఉన్న స్థలం ధరణిని అనుసరి ంచి ప్రభుత్వ భూమిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఇండ్ల స్థలాల కోసం గుడిసెలు వేశామని వివరించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌, రెవెన్యూ అధికారులు దాడి చేసిన వారికే కొమ్ముకాస్తున్నారని తెలిపారు. పైగా, పేదల ఇండ్ల కోసం పోరాడుతున్న నాయకులపై భూముల ఆక్రమణ, హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేశారు. సీపీఐ(ఎం) స్థానిక నాయకులు తిరుపతి నాయక్‌, కడకుంట్ల నాగరాజు, గర్వందుల రమేష్‌, సులోచన, పోచయ్య, సుధారాణి, రఫీ, వెలుగొండ శ్రీను, శ్రీకాంత్‌, సమ్మయ్య, పూచెర్ల అంకుశ్‌, లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.