
నవతెలంగాణ – తొర్రూర్ రూరల్
అధికార అహంతో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులకు తెగబడటం సిగ్గుచేటని జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ విమర్శించారు. మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రైతు,బిఆర్ఎస్ కార్యకర్త ఎండి అక్బర్ పై మడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నం సోమిరెడ్డి తో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులు చేయడం వలన తీవ్రంగా గాయపడటంతో తొర్రూరు డివిజన్ కేంద్రంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అక్బర్ ను పరామర్శించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జెడ్పిటిసి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మడిపల్లి గ్రామానికి చెందిన రైతు టిఆర్ఎస్ కార్యకర్త అక్బర్ ప్రభుత్వ చెరువు కుంట నుండి మొరం మట్టిని తన వ్యవసాయ భూమిలో పోసుకుంటే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, వెంకటేశ్వర్లు లు ప్రభుత్వ కుంటలో మొహరంను తీసుకుపోవాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని భౌతిక దాడులు చేసి గాయపరచడం బాధాకరమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడ ఎలాంటి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడలేదని వాపోయారు. అధికార అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజురోజు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, డీఎస్పీలు స్పందించి విచారణ చేపట్టి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మడిపల్లి గ్రామ ఉప సర్పంచ్ రామలింగం,బిఆర్ఎస్ నాయకులు అనిల్ రెడ్డి, వేల్పుల ఐలయ్య,తూర్పాటి రవి, రాములు, సంపత్, వెంకటస్వామి, వేల్పుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.