విజ్ఞానాన్ని పంచుతున్న ఆక‌ర్ష‌ణ‌

chegoni ravi kumar - pustakala hotelవికసించే సమాజానికి గ్రంథాలయాలు ఆక్సిజన్‌ వంటివి. భవిష్యత్‌ తరాలకు జ్ఞానాన్ని అందించడంలో పాఠశాల గ్రంథాలయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి పుస్తక పఠనం ద్వారా విద్యార్థులలో మానసిక వికాసానికి బీజం వేస్తున్నది చిన్నారి ఆకర్షణ. ఆకర్షణ గత నెల రోజులుగా దేశం మొత్తం చర్చిస్తున్న పేరు ఆమె ఎవరు, ఏమిటి అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బేగంపేటలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో ఆకర్షణ అనే 12 ఏళ్ల విద్యార్థిని ఏడవ తరగతి చదువుతున్నది. ఆమె ఏర్పాటు చేస్తున్నటువంటి గ్రంథాలయాలు నేడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడులో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి యువకులకు పెద్దలకు ఆకర్షణగా (ఆదర్శంగా) నిలిచింది. మూడేళ్ల వయసులోనే హైపర్‌ ఆక్టివ్‌గా ఉండడం వల్ల డాక్టర్లు ఇచ్చిన సలహాతో తల్లిదండ్రులు పుస్తకాలు చదివే అలవాటుపై ఆమె అభిరుచి మలిచారు. ఆమె చిన్నప్పటి నుంచి ఎప్పుడూ బొమ్మలు అడగలేదు. పుస్తకాలే ఆమె బొమ్మలు.
కోవిడ్‌ కాలంలో గ్రంథాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఇంటి పక్కవారిని, కుటుంబ స్నేహితులను, స్నేహితులను, తోటి విద్యార్థుల నుండి, తెలిసిన వారి నుండి పాత పుస్తకాలను దాదాపు 6498 సేకరించి వివిధ ప్రాంతాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది. సేకరించిన పుస్తకాలలో బొమ్మల పుస్తకాలు, కథల పుస్తకాలు, నవలలు, ఎన్‌ సైక్లోపీడియాల వంటివి విద్యార్థులకు సరళంగా అర్థం అయ్యే పుస్తకాలున్నాయి.
ఆకర్షణ తండ్రి సతీష్‌ కుమార్‌ లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ 2020 కోఆర్డినేటర్‌గా తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మిస్సైల్‌ మెన్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో కలిసి పనిచేశారు. ఆకర్షణను మొదటిసారిగా చూసినప్పుడు తను ఆకర్షణీయంగా ఉందని అబ్దుల్‌ కలాం తనకు ఆకర్షణ అనే పేరు పెట్టారని సతీష్‌ కుమార్‌ చెప్పారు. అబ్దుల్‌ కలాం ప్రేరణ తోటి అంతరిక్ష శాస్త్రవేత్త అవ్వాలని కోరుకుంటుంది ఆకర్షణ. ఈమె నిత్యం పుస్తకాలు చదవడం వల్ల ఎటువంటి నోట్స్‌ లేకుండా గంటల తరబడి మాట్లాడగలదు. పుస్తకం ఏ విధంగా మనిషిని మారుస్తుంది అని చెప్పేటందుకు తన జీవితం ఉదాహరణ. ‘పుస్తకం చదవడం వలన సంక్లిష్ట విషయాల్లో కూడా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. చక్కటి వాక్చాతుర్యాన్ని అలవర్చుకోవడానికి నాకు పుస్తక పఠనం ఉపయోగపడింది’ అని చెప్తుంది.
అసలు గ్రంథాలయం స్థాపించాలనే ఆలోచన ఆకర్షణకి ఎందుకు వచ్చిందంటే… కోవిడ్‌ కాలంలో వీచీజీ క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులకు పళ్ళు పంచేక్రమంలో, పుస్తకాలను రోగులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇవ్వడం వల్ల మానసిక ఉల్లాసాన్ని పొంది వ్యాధి బారి నుండి కొంత ఉపశమనం పొందెందుకు అస్కారముందని భావించారు. ఆస్పత్రి పెద్దలతో మాట్లాడి మొట్ట మొదటి గ్రంథాలయం వీచీజీ క్యాన్సర్‌ ఆస్పత్రిలో 1036 పుస్తకాలతో 6వ తారీకు ఆగస్టు నెలలో 2021 ఏర్పాటు చేశారు.
రెండవ గ్రంథాలయం సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్లో 625 పుస్తకాలతో 19 ఫిబ్రవరి 2023లో ఏర్పాటు చేశారు. మూడవ గ్రంథాలయం కాచిగూడ జువైనల్‌ హోమ్‌ ఫర్‌ గర్ల్స్‌లో 825 పుస్తకాలతో, నాలుగవది గాయత్రి నగర్‌ అసోసియేషన్‌ బోరబండ 250 పుస్తకాలతో 16వ తేదీ ఏప్రిల్‌ 2023న, ఐదవది కోయంబత్తూర్‌ సిటీ పోలీస్‌ స్టేషన్లో-స్ట్రీట్‌ లైబ్రరీస్‌ 200 పుస్తకాలతో 8 జూన్‌ 2023లో, ఆరవది చెన్నై – భార్సు క్లబ్‌-నోలాంబార్‌ పోలీస్‌ స్టేషన్‌ 1200 పుస్తకాలతో 23వ తారీకు జూన్‌ 2023న ఏర్పాటు చేశారు.
ప్రాథమిక స్థాయిలోనే తరగతి పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవాలన్న జిజ్ఞాసను విద్యార్థుల్లో పెంచితే పుస్తక పఠనం మీద ఆసక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఏడవది గవర్నమెంట్‌ హై స్కూల్‌ సనత్‌ నగర్‌ 610 పుస్తకాలుతో ఐదు ఆగస్టు 2023న ఏర్పాటు చేశారు..
మరొక గ్రంథాలయాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేసారు. దానితోపాటు తార్నాక మెట్రోస్టేషన్‌లో, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్‌ 15, 2023న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా మరో రెండు లైబ్రరీలు ఏర్పాటు చేశారు. యూసుఫ్‌గూడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా గ్రంథాలయాన్నీ… ఇలా దాదాపు 10 గ్రంథాలయాలు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ఏర్పాటు చేశారు.
పుస్తకపఠనం అలవాటు చేసుకోవాలని, దాని కోసం రోజూ పుస్తకంలో కొన్ని పేజీలయినా చదవాలని చెప్తూ, పుస్తక పఠనం అలవాట్లు తన తల్లిదండ్రుల నుండి అలవడిందని ఆకర్షణ అంటుంది.
తనకు పుస్తక పఠనం అలవాటుతో పాటు సైకిలింగ్‌, యోగ, సంగీతం వినడం తన నిత్య జీవితంలో కార్యక్రమాలని, అదేవిధంగా కోవిడ్‌ కాలంలో 270 ఆన్‌లైన్‌ క్లాసెస్‌లో కోడింగ్‌ లాంగ్వేజెస్‌, బ్లాక్‌ కోడింగ్‌, హెచ్‌.టి.ఎమ్‌.ఎల్‌, పైతాన్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకున్నది. మార్చ్‌ 2, 2021 ప్రధానమంత్రి ప్రశంసా పత్రాన్ని అందుకుంది.
విద్యార్థులకు విజ్ఞానం అందించాలనే సదుద్దేశంతో ఈ గ్రంథాలయాల రూపకల్పన చేశానని ఆకర్షణ చెప్తుంది. ముఖ్యంగా తను చేసిన సేవలకు మాజీ గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ప్రశంసించారు. ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఆకర్షణను ప్రశంసించి తాను ఏర్పాటు చేయబోయే 25వ గ్రంథాలయానికి అతిదిగా వస్తానని వాగ్దానం చేశారని సంతోషపడుతుంది.
దేశవ్యాప్తంగా కనపడని ఆకర్షణలు ఎంతోమంది ఉన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పాఠశాలలో, సామాజిక కూడలిలో, స్వచ్ఛంద సంస్థలలో స్వచ్ఛందంగా గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తే చక్కటి విజ్ఞానవంతమైన తరాన్ని ఈ సమాజానికి అందించగలుగుతాం. అయితే ఇక్కడ ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలతో వారికి సహాయ సహకారాలు అందించాలి. యువతను విద్యార్థులను పుస్తక పఠనం వైపు ఆకర్షించవలసిన అవసరం ఉన్నది.
అదేవిధంగా ఆకర్షణ చేస్తున్న ఈ విజ్ఞాన మందిరాల ఏర్పాటు ఉద్యమం ఆదర్శంగా తీసుకొని పెద్దలు, విద్యార్థులు తమ తమ ప్రాంతాలలోని పాఠశాలల్లో, సామాజిక కూడళ్లలో ఏర్పాటుచేసి విజ్ఞానాన్ని ప్రజల చెంతకు చేర్చాలి. అది సామాజిక బాధ్యతగా గుర్తెరగాలి. వీరికి ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, మేధావులు సహాయ సహకారాలు అందించాలి.

– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327