సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. హీరోయిన్ శివాని మాట్లాడుతూ, ”ఈ సినిమాతో హిట్ అందుకున్న మా ప్రొడ్యూసర్ ధీరజ్‌కి కంగ్రాట్స్. అమ్మా నాన్న తర్వాత నేను రుణపడి ఉండేది మా డైరెక్టర్ దుశ్యంత్‌కే. ఆయన నన్ను హిట్ సినిమాతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. సుహాస్ కారణంగా ఇలాంటి మంచి సినిమా వచ్చింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. ‘ఇలాంటి కథలు రాయడంతోనే సరిపోదు ప్రొడ్యూస్ చేసే ధైర్యం గల వాళ్లు కావాలి. గీతా ఆర్ట్స్, ధీరజ్, బన్నీ వాస్ ఆ ధైర్యం చేశారు. ప్రొడ్యూసర్స్‌తో పాటు కథను నమ్మిన హీరో సుహాస్‌కు థ్యాంక్స్. సినిమా చూసిన వాళ్లంతా ప్రతి సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఇది అహంకారానికి, ఆత్మాభిమానికి మధ్య జరిగే కథ. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు అని ఈ మూవీలో చెప్పాం. సిస్టర్స్ ఉన్న ఆడియెన్స్ అయితే ఎమోషనల్ అవుతున్నారు’ అని డైరెక్టర్ దుశ్యంత్ చెప్పారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, ‘నా దష్టిలో ఇదొక జెన్యూన్ మూవీ. ఈ కథ విన్నప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది’ అని తెలిపారు. ‘నాకు హ్యాట్రిక్ ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్. నన్ను నమ్మి థియేటర్స్‌కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. రేపటి నుంచి టూర్‌కి వస్తున్నాం. మీ అందరినీ కలుస్తాం’ అని హీరో సుహాస్ చెప్పారు.