పట్టుబిగించిన ఆసీస్‌

The Aussies are tight-fisted– ప్రస్తుత ఆధిక్యం 241 పరుగులు
మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా):
పాకిస్థాన్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మిచెల్‌ మార్ష్‌ (96, 130 బంతుల్లో 13 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (50, 176 బంతుల్లో 3 ఫోర్లు) అర్థ సెంచరీలతో మెరవటంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 187/6తో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టాప్‌ ఆర్డర్‌లో డెవిడ్‌ వార్నర్‌ (6), ఉస్మాన్‌ ఖవాజ (0), మార్నస్‌ లబుషేన్‌ (4), ట్రావిశ్‌ హెడ్‌ (0)ల వైఫల్యంతో కంగారూలు కష్టాల్లో పడ్డారు. కానీ ఓ ఎండ్‌లో స్మిత్‌ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయగా.. మరో ఎండ్‌లో మార్ష్‌ పరుగుల మోత మోగించాడు. 16/4తో ఉన్న ఆస్ట్రేలియా స్మిత్‌, మార్ష్‌ భాగస్వామ్యంతో కోలుకుంది. ఐదో వికెట్‌కు ఈ జోడీ 153 పరుగులు జత చేసింది. స్మిత్‌ మరీ నెమ్మదిగా ఆడినా.. మార్ష్‌ లెక్క సరి చేశాడు. సెంచరీ ముంగిట మార్ష్‌, అర్థ సెంచరీ అనంతరం స్మిత్‌ నిష్క్రమించినా.. అప్పటికే ఆస్ట్రేలియా మంచి స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 241 పరుగుల ముందంజలో కొనసాగుతుంది. మరోవైపు పాకిస్థాన్‌ బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. అబ్దుల్లా షఫీక్‌ (62, 109 బంతుల్లో 5 ఫోర్లు), షాన్‌ మసూద్‌ (54, 76 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (42) రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ బ్యాటర్‌ అలెక్స్‌ కేరీ (16 బ్యాటింగ్‌) అజేయంగా క్రీజులో నిలిచాడు.
లిఫ్ట్‌లో ఇరుక్కున్న అంపైర్‌: ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ రెండో టెస్టు మూడో రోజు లంచ్‌ సెషన్‌ ఆట అనూహ్యంగా ఆలస్యంగా ఆరంభమైంది. లంచ్‌ విరామం అనంతరం పాక్‌ ఫీల్డర్లు, ఆసీస్‌ బ్యాటర్లు సహా ఫీల్డ్‌ అంపైర్లు గ్రౌండ్‌లోకి చేరుకున్నారు. కానీ ఫీల్డ్‌ అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఎందుకంటే థర్డ్‌ అంపైర్‌ రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ లంచ్‌ ముగించుకుని తన రూమ్‌కు వెళ్తుండగా.. లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు. ప్రసారదారు వ్యాఖ్యాత సైతం అందులోనే ఉండిపోయారు. ఈ అనూహ్య పరిణామంతో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ఫోర్త్‌ అంపైర్‌ ఫిల్‌ గిలెప్సీ హూటాహుటిన థర్డ్‌ అంపైర్‌ రూమ్‌కు వెళ్లి బాధ్యతలు చూసుకున్నాడు. దీంతో లంచ్‌ తర్వాత ఆట మొదలైంది. పది నిమిషాల అనంతరం లిఫ్ట్‌ నుంచి ఇల్లింగ్‌వర్త్‌ బయటపడ్డారు. ఈ విషయాన్ని సీఏ, ఎంసీజీలు సోషల్‌ మీడియాలో పంచుకున్నాయి.