
నవతెలంగాణ – కామారెడ్డి
అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ కలెక్టర్ కార్యాలయం నుండి డివిజన్, మండల సాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాల ప్రభావం ఇంకా ముగిసిపోనందున అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణా, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అధిక వర్షాలతో చెడిపోయిన రహదారులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి వెంటనే రిపేర్ చేయాలని అన్నారు. అధిక వర్షాల వలన చనిపోయిన వారి వివరాలు, దెబ్బతిన్న ఇండ్ల వివరాలను అందించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. అధిక వర్షాల వలన పాఠశాల భవనాలు దెబ్బతిని ఇబ్బందిగా మారిన పాఠశాలల వివరాలను అందించాలని, అవసరం అనుకుంటే పాఠశాలను సరి చేసేవరకు సెలవులు ఇవ్వాలని, విద్యాశాఖ అధికారులకు సూచించారు. వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాధుల ప్రబలకుండా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.