గద్దర్.. ఇది ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. యావత్ తెలుగు నేలపైన ఆయన పాట ఒక అలజడి. ఆయన పాట ఒక కదలిక. ఆయన పాట ఒక ప్రవాహం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పాట ఒక ధిక్కార స్వరం. గద్దర్ భౌతికంగా దూరమై ఏడాది గడిచినా ఆయన పాట, బాట, మాట మాత్రం తెలుగురాష్ట్రాల్లో నిరంతరంనే ఉన్నది.”కాలం కడుపుతో ఉండి కవిని కంటది” అని శివసాగర్ అన్నట్టు..1949 జనవరి 31న మెదక్ జిల్లాలోని తూప్రాన్ గడ్డమీద ఒక విప్లవ కవి, గద్దర్ పుట్టాడు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అట్టడుగునకు నెట్టివేయబడ్డ కులంలో పుట్టిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. స్వాతంత్య్రా నికి ముందు పంజాబీ భాషలో గదర్ అంటే విప్లవం. అందుకే దాని మీద గౌరవంతో దానికి గుర్తుగా ఆయన ఆ పేరును తీసుకున్నారు. అదే గదర్ శీర్షికతో ఆయన మొదటి పాటల ఆల్బమ్‌ని ప్రజల ముందుకు తెచ్చారు. ఆనాటి నుండి గదర్ అనే పదం ఉచ్చారణ దోషం కారణంగా గద్దర్‌గా రూపాంతరం చెంది అదే ఆయన పేరుగా స్థిరపడింది.
చిన్నప్పటి నుండి చురుకైన మేధస్సు, ఆదర్శవంతమైన భావాలున్న గద్దర్ రోజూ వార్త పత్రికలను అనేక సాహిత్య పుస్తకాలను చదవటం అలవాటు.తల్లిదండ్రుల కారణంగా అప్పటికే అంబేద్కర్, ఫూలే దంపతుల ఆలోచనలతో పరిచయం ఉన్న ఆయన పత్రికల్లో విప్లవకారుల కథనాలను, వార్తలను చదివి వారి పోరాటాన్ని అర్థం చేసుకుంటూ విప్లవ మార్గానికి ఆకర్షితులయ్యారు. ఈ సమాజంలోని వ్యవస్థల నిర్లక్ష్యానికి అవస్థ పడుతున్న ప్రజలను కండ్లారా చూస్తూ అర్థం చేసుకున్నాడు. కార్మిక కర్షక లోకాన్ని పీడిస్తున్న శ్రమదోపిడీ విధానాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థలో నష్టపో తున్న ప్రజల కన్నీళ్లను చూసి చలించిపోయాడు. దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని పోరుబాట పట్టాడు. క్రమంగా 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశాడు. నిరక్షరాస్యులైన ప్రజలకు అర్థం చేయించడం కోసం ఆయన బుర్రకథను ఎంచుకొని గ్రామాల్లో ప్రదర్శించాడు. జాషువా, శ్రీశ్రీ లాంటి వారి సాహిత్యంతో పాటు విప్లవ సాహిత్యాన్ని విరివిగా అధ్యయనం చేశాడు. రైతులు, పారిశుధ్య, రిక్షా కార్మికుల కష్టాలు, సామాజిక సమస్యలు ఇలా వివిధ అంశాలపైన వందలాది పాటలు, బుర్రకథలు రాసి పాడుతూ ప్రదర్శనలిస్తూ అవగాహన కల్పించేవారు.
1973లో రిక్షా కార్మికులు తమ రక్తాన్ని చమురుగా చేసి రిక్షా బండిని లాగుతూ బతుకు బండిని నడిపిస్తున్న వారి జీవితాలను అక్షరికరించిన గద్దర్… ”నా రక్తంతో నడుపుతాను రిక్షాను..నా రక్తమే నా రిక్షకు పెట్రోలు..పెట్రోల్ ధర పెరిగింది ..డీజిల్ ధర పెరిగింది నా రక్తం ధరనేమో రోజు రోజు తగ్గబట్టే” అనే పాటను ప్రజల ముందు పాడితే గుండెలు బరువెక్కిపోయేవి.1975 ఎమర్జెన్సీ కాలంలో గద్దర్‌ని అరెస్ట్ చేయగా 45రోజుల తరువాత విడుదలయ్యారు. 1979 జులై 23న విడుదలైన ‘మాభూమి’ సినిమా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోని పరిస్థితు లకు అద్దం పట్టింది. తెలంగాణ వ్యాప్తంగా రజాకార్ల, దొరల ఆకృ త్యాలకు వ్యతిరేకంగా సాగిన వీరోచిత పోరాటం నాటి తీరును కథాంశంగా బి.నరసింగరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిని మాలో గద్దర్‌కి మొదటిసారి అవకాశమొచ్చింది. యాదగిరి పాత్ర ను వేయించి నిజాంకు వ్యతిరేకంగా యాదగిరి పాడిన పాట ను…”బండెనక బండికట్టి.. పదహారు బండ్లు కట్టి..ఏ బండ్లె వస్తవు కొడుకో నైజాం సర్కరోడ” అంటూ స్వయంగా పాడి ఆడా డు. 1980 నుంచి ప్రజా జీవితంలో అనేక కళారూపాలలో ప్రజా చైతన్యం కోసం గళమెత్తాడు.’కయ్యం పెట్టిందిరో కలర్‌టివి ఇంటి కొచ్చి.. దయ్యం పట్టిందిరో నా పెండ్లంపోరలకు’ అంటూ ప్రజా జీవితంలో తలెత్తే అనేక సమస్యలపై వందలాది పాటలు రాశాడు.
1997 ఏప్రిల్ 6న మఫ్టీలో ఉన్న కొందరు గద్దర్‌పైకి తుపాకితో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. రక్తపు మడుగులో పడిపోయిన గద్దర్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. ఆయన శరీరంలో నుండి ఐదు బుల్లెట్స్‌ని తీయగలిగారు. కానీ ఒక్క బుల్లెట్‌ను మాత్రం తీయలేకపోయారు. అది తీస్తే చనిపోయే ప్రమాదం ఉంటుందని అలాగే ఉంచారు. దాంతో గద్దర్ మట్టిలో కలిసిపోయేవరకు ఆ బుల్లెట్ తన శరీరంలో అలాగే ఉన్నది. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర అక్షరాలకు అందనిది. తెలంగాణ ప్రతి పల్లెలోను తన పాటలతో కదిలించాడు. తన మాట, ఆట, పాటలతో యావత్ తెలంగాణను హోరెత్తించారు. దగాపడ్డ తెలంగాణ గుండె దరువయ్యాడు. ఉద్యమ తొలి నాళ్లలో ఆయన పాట ”అమ్మా తెలంగాణమా…ఆకలికేకల గానమా” అంటూ మొదలెట్టిన ఈ పాట ఎంతగానో ప్రజాదరణ పొందింది. ఈ పాట తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ అనేక అంశాలను గురించి చెబుతుంది. ఇక చివరిరోజుల్లో ”మూగ బోయిన గొంతులో రాగమెవరు తీసేదరో.. జీరపోయిన గొంతు లో జీవమెవరు పోసెదరో” అని స్వయంగా రాసి పాడుకున్నా డు.తన మరణాన్ని ముందుగానే ఊహించి రాసుకున్న పాటగా ఆయన చనిపోయిన తర్వాత ఇది చర్చనీయాంశమైంది. గద్దర్ గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 2023 ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు.
”నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబవునో అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టెదను” అని దాశరథి అగ్నిధారలో అన్నట్లుగా గద్దర్ సాహిత్యం తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నంతకాలం ఆయన అమరుడు. గద్దర్ సాహిత్య కృషి కొలమానానికి అందనిది. గద్దర్ ఒక సాహితీ శిఖరం. నేటి సాహితీ విద్యార్థులకు ఆయన సాంస్కృతిక విశ్వవిద్యాలయం. గద్దర్ లాంటి గొప్ప కవి, గాయకుడిని ఈ నేల మరువదు.
(నేడు గద్దర్ ప్రథమ వర్థంతి)
ఎనుపోతుల వెంకటేష్
9573318401