అందాల ద్వీపం శ్రీలంక

అందాల ద్వీపం శ్రీలంక మాటల్లో మలయాళ ధ్వని, థాయి, బర్మీస్‌ను పోలిన లిపి. అక్కడక్కడా తెలుగును పోలిన అక్షరాలు.. కొలంబో విమానాశ్రయంలో దిగగానే ఇవే మనకు కన్పించేవి, వినిపించేవి. భారతదేశంలోని మరో రాష్ట్రంలో ఉన్నామన్న భావన తప్ప మరో దేశానికి వచ్చామని అన్పించదు.
శ్రీలంక ప్రధానంగా బౌద్ధుల దేశమయినా హిందువులు, ముస్లింలు కూడా ఉంటారు. హిందువుల్లో అత్యధికులు తమిళులు. కొంలబోలో కన్పించే సైన్‌ బోర్డులను బట్టి కొందరు ఉత్తర భారతీయులు కూడా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని అర్థమవుతుంది. మొత్తం జనాభాలో 80 శాతం సింహళీలు. వారందరూ బౌద్ధులే. ఆ దేశ ఉత్తర ప్రాంతంలో తమిళులు ఉంటారు. ఆ ప్రాంతంలో చాలా దట్టమైన అడవులున్నాయి. యూరోపియన్లకు, అమెరికన్లకు ఆ అడవులు పర్యటనా స్థలాలు. ఏనుగులు ఎక్కవ సంఖ్యలో ఉండే ఆ అడవుల్లో ఓపెన్‌ టాపు జీపుల్లో కెమెరాలతో నిలబడి ఫొటోలు తీస్తూ ప్రయాణించడం వారికి సరదా. ఆ దేశ ఆదాయంలో గణనీయమైన వాటా టూరిజానిది. ఆ తర్వాత తేయాకు, దాల్చిని ఇతర సుగంధ ద్రవ్యాలు. కొబ్బరి చెట్లు, అవుట్‌ సోర్సింగ్‌ బట్టల పరిశ్రమలు, విదేశాల్లో స్థిరపడిన, ఉద్యోగాలు చేస్తున్న శ్రీలంక ప్రవాసులు పంపే డబ్బు శ్రీలంకకు ఇతర ఆదాయ వనరులు.
మాటల్లోనే కాదు చూడ్డానికి కూడా ఆ ద్వీపం కేరళ మాదిరిగానే ఉంటుంది. ద్వీపమంతా పచ్చదనం పరుచుకొని ఉంటుంది. ఆ పచ్చదనం వల్ల పెద్ద సంఖ్యలో ఉండే చెట్ల వల్ల శ్రీలంక కేరళను తలపిస్తుంటుంది. కేరళలాగే ఉన్నట్లుండి వాన. అంతలోనే తెరపి. ఈ లక్షణం మనకు కేరళలోనూ ఇంగ్లడు లోనూ కన్పిస్తుంది. అందుకే శ్రీలంక ట్రావెలర్స్‌ కంపెనీలు తమ బస్సుల్లో ఎప్పుడూ ఓ డజనుకు పైగా గొడుగులు ఉంచుకొంటాయి. ఇక ట్రాఫిక్‌ నియంత్రణలో మాత్రం మన దేశంలో ఉన్న స్వేచ్ఛ అక్కడ లేదు. ఇక్కడ మనం పుట్‌ పాత్‌లు వదిలి తాపీగా రోడ్ల మీద నడవొచ్చు. వేగంగా వెళ్లే వాహనాలకు చేయి అడ్డం పెట్టి రోడ్డు దాటొచ్చు. ఎక్కడ బడితే అక్కడ కాగితాలు, ప్లాస్టిక్‌ సీసాలు పారేస్తాం. శ్రీలంకలో ఆ స్వాతంత్య్రం అస్సల్లేదు. భారతదేశం, శ్రీలంకల మధ్య ప్రధానంగా కన్పించే తేడా అదే. అక్కడ వేగంతో బండి నడిపితే భారీ జరిమానాలు వేస్తారు. అడవిలో కూడా నిర్ణీత వేగం మించరాదు. రోడ్డు మీద వ్యాపారాలు, వాహనాల పార్కింగ్‌ చెల్లదు. చాలా పేద దేశమే అయిన శ్రీలంక ట్రాఫిక్‌, పరిశుభ్రత విషయంలో యూరపు, అమెరికాలను తలపిస్తుంది. మరో విషయం ఎక్కడా కిళ్లీ షాపులు ఉండవు.
టీ తోటలకు ఆ దేశం అంతర్జాతీయ ప్రసిద్ధి. అయినా రోడ్డు పక్కన హోటళ్లు ఉండవు. పట్టణాల్లో ఒకటో అరో రెస్టారెంట్లు ఉంటాయి. అక్కడ కూడా ‘టీ’ అని అడిగితే లేదని సైగ చేస్తారు. ‘బ్లాక్‌ టీ’ అని అడిగితే ఉందన్నట్లు తలూపుతారు. మసాలాలు విదేశాలకు అమ్మడమే తప్ప వారి కూరల్లో కన్పించవు. ఉడకబెట్టిన ఆకులు, కాడలు అన్నంలో కలుపుకొని తిన్నట్లుంది వారి ఆహారం. ఆ విషయంలో చైనాను గుర్తుకు తెస్తుంది శ్రీలంక. భోజనంలో మిరియాల రసం తప్పని సరి. చేపలు, రొయ్యలు, చికెన్‌ మటన్‌ వంటలు మన లాగే ఉంటాయి. అయితే ఉప్పు, కారం తెలుగు వాడి నోటికి అందవు.
శ్రీలంకకు బ్రిటిష్‌ పాలకుల నుండి ఫిబ్రవరి 2, 1948లో స్వాతంత్య్రం లభించింది. 16వ శతాబ్ధిలో పోర్చుగీసు వారు శ్రీలంకను ఆక్రమించి తమ పాలన నెలకొల్పారు. సింహళాన్ని పోర్చుగీసు వారు ‘సెల్లో’ అని పిచిచారు. 1640 లో డచ్‌వారు ప్రవేశించాక వారు తమ యాసలో సింహళాన్ని ‘జెలాన్‌’ అన్నారు. 1796 లో బ్రిటిష్‌ వారు ఆ ద్వీపాన్ని తన వశం చేసుకొన్నాక ‘సిలోన్‌’ అన్నారు. 1972లో సిలోన్‌ రిపబ్లిక్‌ గా మారింది. ఆ సమయంలో శ్రీలంకగా తన పేరు మార్చుకొంది. రిపబ్లిక్‌గా మారినా మొన్నటి దాకా ఒకే కుటుంబం ఆ ద్వీపాన్ని పాలించిందని అక్కడి గైడ్లు చెప్తుంటారు.
శ్రీలంక పతాకంలో 80 శాతం మెరూన్‌ రంగు ఉంటుంది. అది దేశ జనాభాలోని సింహళీలకు గుర్తు. దాని మధ్యలో కత్తి పట్టుకొన్న సింహం బొమ్మ, అది శౌర్యానికి గుర్తు. ఆ తర్వాత పది శాతం స్థలంలో ఉండే ఆకుపచ్చ రంగు ముస్లింలకు గుర్తు. చివరి పది శాతం లోని కాషాయ రంగు హిందువులకు అంటే ప్రధానంగా తమిళులకు గుర్తు. అలా ఆ దేశ జెండాలోనే లౌకికి విలువలు కన్పిస్తాయి. హిందుస్తాన్‌ అంటే కేవలం హిందుల దేశమని భావించేవారు, భ్రమింపచేసే వారు ఈ విషయం గమనించాలి. సింహళీ ప్రాంతాల్లో కూడా హిందూ గుడులున్నా ఎక్కువ గుడులన్నీ తమిళ ప్రాంతాల్లోనే ఉంటాయి. సింహళీలు కూడా హిందువుల గుడులకు కూడా వెళ్లి మొక్కులు చెల్లిస్తారు. సింహళీ మహిళలు తెల్ల చీరల్లోనూ, తెల్ల ప్రాక్‌ల్లోనూ కన్పిస్తుంటారు. పేద మహిళలు ఎక్కువగా ఫ్రాకుల్లో కన్పిస్తారు. బౌద్ధ గుడుల దగ్గర కలువ, కమలం పూలు పట్టుకొని బుద్దుని విగ్రహం ముందు పెట్టే వారిలో ఫ్రాక్‌లు దరించిన పేదలే ఎక్కువ. వారి మొహాల్లో పేదరికం తాండవిస్తుంటోంది. ఇంగ్లండులోనూ అంతే భక్తి పీడితుల తాడితులకు పరిమితమై కన్పిస్తుంది. ఆఫ్రికలన్లు ఉండే ప్రాంతాల్లో నే చర్చీల దగ్గర జనం కన్పిస్తారు.
మేము ఆర్‌వి ట్రావెల్స్‌ ద్వారా వెళ్లాం. ఆ కంపెనీ ఒక గైడ్‌ హైదరాబాదు విమానాశ్రయం నుండి తిరిగి వచ్చే వరకు మా గ్రూపుతో ఉన్నారు. సింహళీ గైడ్‌ ఇంగ్లీషులో చెప్తే మన గైడ్‌ తెలుగులోకి అనువాదం చేసి చెప్పాడు. మనం తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్టు అని గొప్పలు పోతాం. కాని సింహళీ భాష పదాలు కూడా అచ్చుతో ముగుస్తాయి. మన పొరుగు భాష కన్నడ కూడా అంజతమే. అయితేనేం మన డబ్బా మనదే కదా! ఇటాలియన్‌ సంగీతాన్ని పరధ్యానంతో వింటే హిందీ పాటను వింటున్నట్లు ఉంటుంది.
మాది ప్రాథమికంగా పుణ్యకేత్రాల టూరు. ఈ విషయం నాకు శ్రీలంకలో బస్సెక్కాక అర్థమయింది. ఒకటి రెండు మినహా బస్కెక్కిన జంటల్లో సగం 70 సంవత్సరాలకు పై బడినవే. ఈ జన్మ ముగింపులో పుణ్యక్షేత్రాలు దర్శించి పుణ్యం గడించుకొంటే వచ్చేజన్మకు ఉపయోగ పడ్తుందనుకొనే జంటలే ఎక్కువ. కొలంబో నుండి బయల్దేరాక దారిలో మమ్మల్ని మనల్వారి గుడి అనే ఈశ్వరుడి గుడికి తీసుకెళ్లారు. అది తమిళ గుడి. గర్భగుడిలో భారీ లింగం ఉంది. గుడిలోకి ప్రవేశించిన వెంటనే ఎడమవైపు ఒక మూలన దాదాపు ఇరవై అడుగుల పది తలల రావణిడి విగ్రహం కన్పించింది. రంగు రంగుల్లో మిలమిల మెరుస్తూ ఠీవిగా ఉంది. సింహళీలు కూడా రావణుడిని పూజించరు. ఆ గుడిలోనూ అంతే అక్కడ మినహాయిస్తే మాకు రావణుడి విగ్రహం మరెక్కడా కన్పించదు. శ్రీలంకలో దేవుడితో సహా గుడి ఫొటోలు తీసుకోవచ్చు. అయితే దేవుడితో మాత్రం సెల్ఫీలు కుదరదు. ఎందుకంటే గర్భగుడిలోని దేవుడికి వీపు చూపాల్సి వస్తుంది కనుక అనుమతించరు.
మనల్వారి గుడికి ఓ కథ ఉంది. రావణ రాక్షసాదులను చంపాక శ్రీరాముడు పుష్పక విమానంలో సపరివారంగా అయోధ్య బయల్దేరారట. ఆ విమానం మనల్వారి రాగానే ఆగిపోయింది. ఎందుకాగిందో తెలియక శ్రీరాముడు శివుణ్ణి తలచుకొన్నాడు.(ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్లి చూసుకొన్నట్లుగా) శివుడు ప్రత్యక్షమై రావణుడు బ్రాహ్మణుడు కనుక శ్రీ రాముడికి బ్రహ్మహత్యాదోషం తగిలిందని. శ్రీలంకలో నాలుగు చోట్ల శివలింగాలు ప్రతిష్టిస్తే గానీ ఆ దోషం పరిహారమై విమానం కదలదని చెప్పాడు. రాముడు శివుని మాటను ఆచరించాడు. విమానం కదిలింది. భార్యను అపహరించినా సరే, బ్రాహ్మణుడుని దేవుడు కూడా చంపరాదా? అన్న ప్రశ్న మనలో ఉద్భవించక మానదు. పురాణాలన్నీ బ్రాహ్మణులు తమకోసం రాసుకొన్న పురాణాలు కదా! అందుకేనేమో పురాణాల్లో శూద్ర హత్యాదోషం అన్న పదం ఉండదు.
మరురోజు ట్రింకోలి వెళ్లాం. అది శ్రీలంక తూర్పున ఉంటే సహజ సిద్ద ఓడరేవు. సముద్రానికి మూడు వైపులా భూమి ఉండటం ఆ రేవు ప్రత్యేకత ఆ పట్టణం తమిళ సంస్కృతికి కేంద్రం. వేల సంవత్సరాలుగా అక్కడ తమిళం మాట్లాడుతారు. అక్కడి బీచ్‌ తెల్లటి ఇసుకతో చాలా పరిశుభ్రంగా అందంగా ఉంటుంది. బీచ్‌కు మరోవైపు ఎతైన పచ్చని కొండలు. జింకలు వగైరా వన్యజంతువులతో ఆహ్లాదంగా ఉంటుంది. పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. శ్రీలంక పేద దేశమైనా పరిశుభ్రతలో ఫస్ట్‌ మార్క్‌ వేయాల్సిందే. బీచ్‌ దగ్గర్లోని ఒక కూడలిలో కూర్చుని ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఉంటుంది. ఆ దేశంలో చాలా చోట్ల ఎత్తైన ప్రదేశంలో, కూడళ్లల్లో పెద్ద పెద్ద బుద్ధ విగ్రహాలుంటాయి. బుద్ధుడి చిత్రాలు మన దేశంలోలా కళ్లు మూసుకొని ఉండవు. సగం తెరుచుకొని ఉంటాయి.
ట్రింకోమలి పట్టణం ఉత్తరం వైపున ఉన్న గుట్టపై శాంకరీదేవి గుడి ఉంటుంది. దాన్ని శక్తి పీఠంగా పరిగణిస్తారు. గుడికి వెళ్లేదారిలో ఒక కొండ వంద అడుగులకు పైగా నిలువునా చాకుతో కట్‌ చేసిన కేక్‌లా విడిపోయి ఉంటుంది. శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోతే రావణుడు కోపం పట్టలేక తన కత్తితో ఒక్క వేటు వేశాడని, దాంతో ఆ కొండ నిట్ట నిలువుగా చీలిందని స్థల పురాణం. దాన్ని రావణ కట్‌ అని పిలుస్తారు. శాంకరీ దేవి గుడికి బౌద్ధులు, బౌద్ధ సన్యాసులు కూడా వస్తుంటారు. పిల్లలు పుట్టనివారు అక్కడున్న చెట్టుకు అరచేతి సైజులో ఉండే వెదురు ఊయల కడ్తారు. అలా కడ్తే పిల్లలు పుడ్తారని నమ్మకం. హిందూ ఆలయాల్లో బౌద్ధ సన్యాసులు కన్పించినా బౌద్ధ ఆలయాల్లో హిందూ పూజారులు కన్పించరు. ట్రింకోమలికి దగ్గర్లో వేడి నీటి గుంటలుంటాయి. వాటిని రావణ హాట్‌ వెల్సు అంటారు. ఈ పేర్లన్నీ నిస్సందేహం హిందువులే పెట్టి ఉంటారు. వాటి వెనుక బౌద్ధ ఆరామం పెద్ద విగ్రహం ఉన్నాయి. ఆరామంలో జరిగే ప్రార్థనలు బయటికి లౌడ్‌స్పీకర్లో విన్పిస్తుంటాయి. మసీదుల్లో ప్రార్థనలకు రమ్మని పిలిచే ‘అజా’లా ఉంది ఆ ప్రార్థన. సింహళీ భాష సంస్కృతం, పాళి పదాల మిశ్రమం. అయినా ఒకటి రెండు పదాలు కూడా అర్థం కావు. ప్రపంచంలో చాలా చోట్ల వేడి నీటి గుంటలుంటాయి. ఇంగ్లాండులో బాత్‌ అనే పట్టణం ఉంది. ఒకటవ శతాబ్ధంలో ఇంగ్లాండులను పాలించిన రోమన్లు అక్కడి వేడినీటి కొలను దగ్గర ఒక గుడి కట్టారు. ఆ గుడిలో ఉండే దేవత పేరు మినర్వా. మన పోచమ్మ, మైసమ్మ వగైరాల గుడుల్లాగానే ఆ గుడి లోకి కూడా వెల్తురు సోకదు గుడ్డి వెల్తురులో కన్పించే రాతి బొమ్మ ఉంది. అయితే స్థల పురాణం పేర చెప్పే కల్పితగాధ ఏదీ అక్కడి పోస్టర్లలో కన్పించదు. మనకు యూరోపియన్లకు ఉండే తేడా అదే. శ్రీలంక రెండవ పెద్ద పట్టణమైన క్యాండీ మాకు రెండవ మజిలీ. దారిలో డంబుల్లా గోల్డెన్‌ టెంపుల్‌ వెళ్లాం. అక్కడ ఎతైన పీటం మీద పెద్ద బౌద్ధ విగ్రహం ఉంటుంది. దానికి బంగారు తాపడం చేశారు. ఆ గుడిలో కలువ, తామర పూలు ఉంచి ప్రార్థనలు చేస్తారు.
ఆ తర్వాతి రోజు మా ప్రయాణమంతా అడవిలో ఘాట్‌ రోడ్లలో సాగింది. దార్లో రంబొడా గుడి అనే హనుమంతుడి గుడికి తీసుకెళ్లారు. దాదాపు 15 అడుగుల విగ్రహం. ఆకర్షణీయంగా ఉంది. గుడి తర్వాత ఘాట్‌లో గంట ప్రయాణం. డార్జిలింగ్‌కు వెళ్లే దారిలో ఉన్నట్లుగానే కనుచూపు మేర తేయాకు తోటలే. డార్జిలింగ్‌కు వెళ్లే రోడ్ల మాదిరిగా అక్కడి రోడ్లు ప్రమాద భరితంగా కన్పించవు. తోటలు ఆహ్లాదంగా ఉన్నాయి. తోటల్లో అత్యధిక భాగం విదేశీయుల చేతుల్లో ఉన్నట్లు ఆసైన్‌ బోర్డులే చెబుతాయి. శ్రీలంక స్వతంత్ర దేశం. అయినా తేయాకు తోటలు మాత్రం ఆంగ్లేయుల చేతుల్లోనే ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తేయాలకు ఆ గుట్టల్లో పండుతుంది. చైనీస్‌ బోర్డు లేవి కన్పించలేదు. విచిత్రమేమిటంటే శ్రీలంక వాసులకు టీ తాగే అలవాటు తక్కువ. మేము వెళ్లినప్పుడు రోడ్ల వెంట ఎక్కడ చూసినా రాసులు రాసులు లీచి పళ్లు, గుట్టలు గుట్టలుగా కొబ్బరి బొండాలు కన్పించాయి. కొబ్బరి చెట్టు వారికి మరో ప్రధాన ఆర్థిక వనరు. కొబ్బరికాయ తో పాటు ఆ చెట్టులోని ప్రతి భాగం ఆదాయం తెచ్చిపెడ్తుంది. అక్కడొక టీ ఫ్యాక్టరీ చూపెట్టారు. అదీ ఒక విదేశీ కంపెనీదే. ఫైవ్‌స్టార్‌ మర్యాదలతో చక్కని టీని ఉచితంగా పోస్తారు. అది చూసి మా యాత్రిక బృందానికి ప్రాణం లేచొచ్చింది. టీ ఫ్యాక్టరీ విజిట్‌ తర్వాత సీతమ్మ అశోక వాటిక అని ఒక స్థలం చూపెట్టారు. శ్రీలంకలో రావణుడి పట్టణం ఏదో తెలియదు. మరి అశోక వాటిక ఈ కొండల్లో ఎందుకు ఉంటుంది? ప్రశ్నకు అవకాశం లేదంతే. టీ తోటలన్నీ ఎతైన కొండల మధ్య ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉండే ఇళ్లు కూడా యురోపియన్‌ తరహాలోనే ఉంటాయి. ఆ గ్రామాల గుండా వెళ్తున్నప్పుడు యూరపు వాతావరణమే కన్పిస్తుంది.
క్యాండీలో శ్రీలంకలోని అతి పెద్ద బౌద్ధాలయం ఉంటుంది. అది రెండస్థుల పెద్ద భవనం. బుద్దుడి దంతం ఒక దాన్ని తెచ్చి అక్కడ ఒక పేటికలో ఉంచారట. చాలా దేశాల్లో చాలా ప్రదేశాల్లో బుద్ధుడి దంత పేటికలుంటాయి. అందుకే ప్రపంచమంతా పర్యటించిన బహుగ్రంధ రచయిత, పరిశోధకుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఇంతకీ బుద్దుడి ఎన్ని దంతాలున్నట్లు? అని ప్రశ్నించారు. క్యాండీలో ఆ పేటిక దర్శనం కోసం తండోప తండాలుగా బౌద్ధులు, హిందువులు వస్తుంటారు. బౌద్ధులైనా, యాత్రికులైనా ఒకే వరుసలో వెళ్లి దంత పేటికను చూడాలి. బౌద్ధ సన్యాసులకు మాత్రం స్పెషల్‌ దర్శనం. విదేశీయులం కనుక ఆ ఆలయంలోకి వెళ్లేందుకు రు.500/- (భారతీయ రూపాయిలు) పెట్టి టికెట్‌ కొనాలి.
భవనంలో తక్కువ ధ్వనితో పాడే కీర్తనలు మినహాయిస్తే అంతా పిన్ను పడితే విన్పించేంత నిశ్శబ్దం. పేటికను దర్శించుకోవడానికి కొన్ని సమయాలుంటాయి. ఆ వేళ కంటే ముందుగా వచ్చిన భక్తులు పాకెట్‌ సైజ్‌ బౌద్ధ మత గ్రంధాలు తెరిచి మౌనంగా చదువుతూ కూర్చుని ఉంటారు. ఆలయంలో గాని ఆవరణలో గానీ కాగితం ముక్క కూడా కన్పించదు. ఆవరణలో రాలిపడే చెట్ల ఆకులను ఎప్పటికప్పుడు ఊడ్చేస్తుంటారు. మిగతా ఆలయాల దగ్గర కూడా అంతే. బౌద్ధులు కలువలను, కమలాలను దంతపేటికకు వందగజాల దూరంలో ఉండే మెజా పెడ్తారు. కొందరు మల్లె, ఇతర పూలను అందంగా అలంకరించి పెడ్తారు. పది పదిహేను నిమిషాల తర్వాత వాటిని తొలగిస్తుంటారు. క్షణాల్లో మళ్లీ ఆ విశాలమైన మేజా పరిశుభ్రమైన పూలతో నిండిపోతుంది. ప్రతి రోజూ డిసిఎంల కొద్దీ పూలు అక్కడికి వస్తుంటాయేమో? ఆలయం నుండి బయటికి వచ్చే దారిలో పెద్ద ఆధునిక టాయిలెట్‌ ఉంది. పరిశుభ్రతకు శ్రీలంక ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో ఆ టాయిలెట్‌ చూపెడ్తుంది. విశేషం ఏమిటంటే ఆ టాయిలెట్‌ను చైనా ప్రభుత్వం తన విరాళంగా కట్టి ఇచ్చింది. శిలాఫలకం పై ‘డొనేటెడ్‌ బై పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’ అని రాసి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పెద్ద రావి చెట్టు ఉంది. బౌద్ధ గయలోని రావి చెట్టు కొమ్మను తెచ్చి అక్కడ అంటు పెడితే అది నేడు మహావృక్షమైంది.
శ్రీలంకకు చైనాతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొలంబో నగరంలో సాంస్కృతిక ప్రదర్శనల కోసం చైనా ఒక పెద్ద థియేటర్‌ను కట్టి బహుమతిగా ఇచ్చింది. భారీ మొత్తాల్లో శ్రీలంకకు చైనా వడ్డీలేని రుణాలిచ్చింది కూడా. మన దగ్గర చైనా వాహనాలు కన్పించవు. కాని శ్రీలంకలో చైనా నుండి దిగుమతి చేసుకొన్న కార్లు విస్తృతంగా కన్పిస్తాయి. చిన్న సైజులో ఉండే ఎలక్ట్రిక్‌ కార్లు చాలా వరకు చైనా నుండి దిగుమతి చేసుకొన్నవే. అమెరికా, జపాన్‌, ప్రాన్సుల నుండి బస్సులు, లగ్జరీ కార్లు దిగుమతి చేసుకొంటారు. టూవీలర్లు, ఆటోలు మాత్రం పూర్తిగా ఇండియా నుండే ఎగుమతి అవుతాయి. ఆటోలను తుక్‌, తుక్‌ అని పిలుస్తారు. ఢిల్లీలో మోటారు సైకిల్‌ ఆటోలను అవి చేసే శబ్దాన్ని బట్టి పిట్‌ పిటీ అని పిల్చినట్టు. శ్రీలంకలో మొత్తం మీద కార్ల సంఖ్య చాలా ఎక్కువ. కొలంబో రోడ్లపై కారు నిలపడానికి స్థలం ఉండదు. కొలంబోలో ఎప్పుడో నిర్మించిన మల్లీ లెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్‌ ఉందంటే చాలా కాలం నుండి ఆ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణపై శ్రద్ధ ఎక్కువే అని అర్థం అవుతుంది. రోడ్లమీద కన్పించే కార్లను బట్టి అక్కడ పేదరికం తక్కువ అనుకొంటే పప్పులో కాలేసినట్లే.
దేశ రాజధాని కొలంబోలో రద్దీ ఎక్కువ. సాయం కాలాలు బంపర్‌ టు బంపర్‌ అన్నట్లుగా ఉంటుంది ట్రాఫిక్‌. శ్రీలంక జన సంఖ్య 2.19 కోట్లు కాగా, కోలంబో జనాభా 60 లక్షలు. దానికి రెట్టింపు సంఖ్యలో జనం ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా ప్రతి రోజు చుట్టు పక్కల పట్టణాలు గ్రామాల నుండి కొలంబో వచ్చి వెళ్తుంటారు. బ్రిటీష్‌ కాలం నాటి భవనాలతో పాటు కొత్తగా వచ్చిన ఆకాశ హార్మ్యాలు కొలంబో శోభను పెంచాయి. అక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశాధ్యక్షుడు, ప్రధాని తదితర ముఖ్యుల కార్యాలయాలు, వారి ఇళ్లు ఉండే మార్గంలోకి సాధారణ ప్రజలు వెళ్లలేరు. టూరిస్టులు వాటి దరిదాపుల్లోకి వెళ్లడం కూడా అసాధ్యం. పత్రికా స్వేచ్ఛలో శ్రీలంక మనకంటే చాలా మెరుగైన స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ దేశంలో మొదటి సారి కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది.

– ఎస్‌. వినయ కుమార్‌ ,
99897 18311