దర్శకుడు కె.విజరుభాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఉషా పరిణయం’ అనే అందమైన టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటీఫుల్ అనేది ఉపశీర్షిక. విజరుభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజరుభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తుండగా, తాన్వీ ఆకాంక్ష హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది.
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్రబందం. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆకాశానికే జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం..’ అంటూ సాగే ఓ ప్రేమగీతాన్ని తొలి లిరికల్ సాంగ్‌గా విడుదల చేశారు.
ఆర్.ఆర్. ధ్రువన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. ఆర్.ఆర్.ధ్రువన్ ఈ ప్రేమగీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత విజరు భాస్కర్ మాట్లాడుతూ, ‘ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రేమకథలో సరికొత్తగా ఉండే విధంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రేమకు నేనిచ్చే డెఫినేషన్. ఇదొక మంచి లవ్‌స్టోరీ. సినిమా లవర్స్‌కు విందుభోజనంలా ఉంటుంది. అన్ని ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ సినిమా సంగీతంలో ధ్రువన్ విశ్వరూపం చూస్తారు’ అని అన్నారు.
సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెలకిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలక్రిష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.