అందం చందం లేనోడు మంచం నిండ పన్నట్టు

The bed is full of beautyఅందంకు కొలమానాలు లేవుగాని, చూస్తేనే తెలుస్తుంది అందం యొక్క సౌందర్యం. చూసే దృష్టితో చూస్తే రూపాన్ని బట్టి కాక వ్యక్తిత్వాన్ని బట్టి మనుషులు అందంగా కనిపిస్తరు. మనిషి మంచోడు కాకుంటేనే ‘అందం చందం లేనోడు మంచం నిండ పన్నట్టు’ అనే సామెత వాడతారు. ఇక్కడ అందం అంటే సింగారం కాదు. పని అందమన్నట్టు. అయినా మనిషి అందం ఉంటే సరిపోదని ‘అందం ఉంటే ఎంది అదృష్టం ఉండాలె గని’ అనే సామెత అంటారు. ఇక్కడ కూడా అందమంటే రూపమే అయినా అదృష్టం ఉండాలె అంటే మంచి పనివాడై ఉండాలె అని అర్థం. మరొకచోట ‘అందాల మొగోనికి రాగి మీసాలు’ అంటారు. మనిషి ఎర్రగా బుర్రగా ఉంటే సరిపోదు రోషంగా ఉండేందుకు మీసాలు ఉండాలని అన్నట్టు. అందానికి కూడా అందమైన జత ఉంటుంది. అన్ని జంటలు గొప్ప జంటలు కాకపోవచ్చు. కాకపోతే కాలక్రమేన కలిసిపోతారు. కొందరు జంటను చూసి ‘కాకి ముక్కుకు దొండ పండు లెక్క’ అంటారు. కాకి కర్రెగా ఉంటది. దొండ పండు ఎర్రగా ఉంటుంది. తేడా బాగా ఉండడంవల్ల ఈ సామెత వాడుతారు. ఏది ఏమైనా ‘అందమే ఆనందం ఆనందమే జీవన మకరందం’ ఒక పాట కూడా ఉన్నది. ఎవ్వరు ఏది చెప్పినా ఎవరూ సంపూర్ణం కాదు. అందుకే ‘అంతా తెలిసినోడు లేడు, ఏమీ తెలవనోడు లేడు’ అనే సామెత కూడా ఉంది. అన్నీ తెలిసిన మనిషి ఉండదు. ఎవరికి తెలిసిన రంగం వరకు మాత్రమే వారు నిష్ణాతులు. అట్లాగే ఎవరూ ఏమీ తెలియని వారు కూడా ఉండరు.

– అన్నవరం దేవేందర్‌, 9440763479