ఉద్యమ ప్రస్థానం

 Sampadakiyam”వర్తమాన వర్గ పోరాటంతో మాత్రమే చరిత్రను అధ్యయనం చేయాలి.
ఇంకేవిధంగా అధ్యయనం చేసినా గెలుపొందినవారి ప్రభావానికి లోనుకాక తప్పదు.”
సీపీఐ(ఎం)కు ఇది సంపూర్ణంగా నప్పుతుంది. ఏనాడూ గెలుపోటముల కోసం వెంపర్లాడలేదు. పాలకుల ప్రాపకం కోసం అది ఎన్నడూ పాకులాడలేదు. సీపీఐ(ఎం) నమ్ముకున్నది వర్గ పోరాటాన్ని. దాదాపు ఐదారు దశాబ్దాల సాపేక్ష ‘శాంతి’ కాలంలో ఎన్నికలే పార్టీల పెరుగుదలకు కొలబద్దగా మారాయి. వచ్చిన ఓట్లు, గెలిచిన సీట్లే పార్టీలకు గుర్తింపుగా మారింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో పదిహేను సీట్లు వచ్చినా పొంగిపోకుండా, నేడు తెలంగాణలో ఒక్క సీటూ రాకపోయినా కుంగిపోకుండా నాయకులను, కార్యకర్తలను రూపొందించుకోవడం ఆ పార్టీ ప్రత్యేకత. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కూడా ఏమంత సులభసాధ్యమైన పనికాదు.
‘యుద్ధం గెలిచావా? ఓడావా? అనేది కాదు.
నువ్వు అసలు యుద్ధం చేశావా? లేదా? అనేదే ముఖ్యం’ అనే ‘చే’ని పట్టుకుని నడుస్తోంది సీపీఐ(ఎం). అందుకే దాన్ని తూచేరాళ్ళు వేరే ఉంటాయి.
చాలా జిల్లాల్తో పోలిస్తే సంగారెడ్డి జిల్లా ఉద్యమం చిన్నదే కావచ్చు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వముంది. మగ్దూమ్‌ మొహినుద్దీన్‌ సాంస్కృతిక పరంపర, కేవల్‌కిషన్‌ వంటి నేతల వారసత్వం ఉంది. దానికితోడు మార్క్సిజం, లెనినిజంపై అచంచల విశ్వాసమున్న వందలాది శ్రామికవర్గ కార్యకర్తలున్నారు. విప్లవోద్యమానికి పునాది అయిన కార్మికోద్యమం ఉందక్కడ. కార్మిక, కర్షక ఐక్యతకు పునాదులేసుకుంటూ మెల్లిగా ముందుకు సాగుతోంది. రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాలకు ఆర్థికంగా చేయూతనిస్తూ, అంతకుముందు టి.యు. నుండే కార్యకర్తలను అందిస్తూ కాసుకున్న ఉద్యమం అది. ఏమైనా, ఈనాల్రోజుల మహాసభకు ఆతిథ్యమియ్యడానికి ముందుకొచ్చిన ఆ చిన్న ఉద్యమమైనా వారి స్థైర్యాన్ని మెచ్చుకోవాలి.
సీపీఐ(ఎం) పార్టీ కార్యక్రమం దేశంలోని అన్ని కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమాల్లోనూ సరైనదిగా రుజువైంది. 21వ మహాసభలో తుది రూపమిచ్చిన ఎత్తుగడలు తరువాతి కాలంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. పెచ్చరిల్లిన మతోన్మాద ప్రమాదమే అందుకు ప్రధాన కారణం. ఇండియా బ్లాక్‌ తదనంతర పరిణా మాలు మన కండ్లెదుటే ఉన్నాయి. 400+సీట్లని విర్రవీగిన మోడీ బృందాన్ని భారత ప్రజలు ఉలిపెట్టిచెక్కి ‘సైజ్‌’ చేశారు. 2014 తర్వాత మొట్టమొదటిసారి మిత్రులపై ఆధార పడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వామపక్షాల నిరంతర క్యాంపెయిన్‌, ముఖ్యంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల పాత్ర లేకుంటే ఇది అసాధ్యమైన ప్రక్రియే. మోడీకిది వ్యక్తిగత శృంగభంగం. ఎందుకంటే, గుజరాత్‌నైతే తన ఖాతాలోకి వేసుకోవచ్చుగాని, మహా రాష్ట్ర నుండి ఈశాన్య భారతం వరకు, కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు రాష్ట్ర నాయకులను కాదు, తనను చూసి ఓటేయమని కదా మోడీ అడిగింది?! 300 సీట్లు దాటినపుడు మోడీ నామ సంకీర్తనమిన్నంటితే, 400+ అన్న మోడీ పిలుపునకు భారత ప్రజలు 240కే కుదిస్తే ముఖ్యనేతలే లోలోన తిట్టుకుంటున్న తీరు లాస్‌ఏంజిలిస్‌ దావానలమవుతుందా? మోడీ బృందం ఆపగలదా చూడాలి.
400+ అన్న వారి కోరిక అసలు అర్థం నేడు భారత సమాజం అర్థం చేసుకుంటోంది. రాజ్యాంగాన్నే మార్చాలనే వారి కోరిక బహిరంగంగానే మోడీ అంతేవాసులు వెల్లడిస్తున్నారు. వాజ్‌పారు పాలనా కాలంలో ఒక ప్రయత్నం చేసి సాధ్యం కాక వదిలేశారు. ప్రస్తుతం బరితెగించి ‘ఒక దేశం – ఒకే ఎన్నిక’ అంటూ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కోసం ప్రభుత్వం చెప్పే వాదనలన్నీ తప్పులతడకలే. చివరికిది ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమయ్యేందుకు దారితీస్తుంది. ఆ విధంగా అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తుంది. ఏమైనా ఇవన్నీ మధురైలో జరగబోయే అఖిల భారత మహాసభ చర్చనీయాంశాలని పార్టీ పోలిట్‌బ్యూరో కన్వీనర్‌ ప్రకాశ్‌ కరత్‌ తెలిపారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పాలనపై వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి రాజుకుంటోంది. ఆరు గ్యారంటీల్లో ఒకటి రెండు మినహా మిగతావి అమల్లోకి రాలేదు. కోట్లాదిగా ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కావటంలేదు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన వాగ్దానం అటకెక్కింది. ఇండ్లు, ఇండ్ల స్థలాలపై ఇచ్చిన మాట తప్పింది రేవంత్‌ సర్కార్‌. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను, ఇతర సామాజిక శక్తులను ఐక్యంచేసి ఉద్యమ ప్రస్థానం సాగాలి. అందుకు ఈ నాలుగవ మహాసభ బాటలు వేస్తుందని ఆశిద్దాం.