అది ఒక చిన్న పల్లెటూరు. ఊరు చిన్నదయినా గ్రామ ప్రజలందరూ కలిసి ఊరి అభివద్ధి కోసం పని చేస్తుండేవారు. ప్రతీ ఆరునెలలకొకసారి ఆ ఊరికి అవసరమైనది ఏదొకటి తలా ఒక చేయి వేసి సమకూర్చుకునేవారు. అలా ఈ ఏడాది ఊరి మధ్య కూడలి దగ్గర ఒక పెద్ద గంటల గడియారం ఏర్పరిచారు.
ఆ గంటల గడియారం చూడటానికి పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆ కూడలి వద్ద చేరేవారు. పదేళ్ళ బాలు కూడా పొద్దున్న పళ్ళు తోమడం దగ్గర నుండి బడికి పోయే వరకు తన పనులన్నీ గంటల గడియారంలో గంటలను బట్టి చేసేవాడు. అదొక ఆటలాగా ఉండేది!
అమ్మ రోజూ పదిసార్లు పిలిస్తేనే గానీ నిద్ర లేవని బాలు గడియారంలో ఏడు గంటలు వినపడేసరికల్లా లేవడం మొదలుపెట్టాడు. బాలులో ఈ మార్పు చూసి అమ్మానాన్న ఎంతో సంతోషించారు. బాలు ఒక్కడే కాదు దాదాపు ఆ ఊరిలోని పిల్లలంతా గడియారం పెట్టినప్పటి నుండి దానినే అనుసరిస్తూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. నిద్ర లేవడం దగ్గర నుండి తినడం, ఆడుకోవడం, పడుకోవడం వరకు కూడా! పిల్లలే కాక పెద్దల్లో కూడా గడియారం గంటలు సమయపాలనను అలవాటు చేశాయి.
ఆ రోజు గడియారం గంట కొడితే నిద్ర లేద్దామని చూస్తున్న బాలుకి ఎంత సేపైనా గంట వినపడలేదు. రోజూ అలవాటు అవడం వల్ల గంట వినబడకపోయినా ఆ సమాయానికే మెలుకువ వచ్చేసింది. కూడలి వద్ద ఉన్న గడియారం దగ్గరకు వెళ్ళి చూశాడు. గడియారం ముల్లు కదలట్లేదు. అది ఆగిపోయింది! కాసేపటికి మిగతా పిల్లలు కూడా వచ్చి చూశారు. అది పని చేయట్లేదని అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు. బాలు ఇంటికెళ్ళి గడియారం సంగతి వాళ్ళ నాన్నకు చెప్పాడు. ”గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి బాగుచేస్తేనే గానీ మళ్ళీ గడియారం గంటలు వినపడవు నాన్నా” అని బాధగా చెప్పాడు.
”వాళ్ళు వచ్చేవరకు ఎదురుచూడటం ఎందుకు? నువ్వేమైనా చేయగలవేమో ఆలోచించు” అన్నాడు నాన్న. బాలు ఆలోచిస్తున్నాడు.
మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే అలమరా అంతా వెతికాడు. తనకు కావాల్సినవి దొరికాయి.నాన్న చేయి పట్టుకుని గంటల గడియారం వద్దకు తీసుకెళ్ళాడు.
”నాన్నా! మనింట్లో గోడ గడియారానికి నువ్వు చిన్న బ్యాటరీలు వేస్తావు కదా! ఈ గడియారానికి పెద్దవి సరిపోయాతాయేమో అనిపించింది. ఈ పెద్ద బ్యాటరీలు మనింట్లో ఉన్నాయి. నువ్వు వేసి చూడు” అంటూ నాన్న చేతిలో పెట్టాడు. బాలు ఆలోచన నాన్నకు నచ్చింది. ఆయన గంటల గడియారం అమర్చి ఉన్న స్తంభం మెట్లు ఎక్కాడు.
గంటల గడియారంలోకి కొత్త బ్యాటరీలు వచ్చాయి. బాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. అప్పటికే కొంత మంది పిల్లలు గడియారం చుట్టూ చేరారు. గడియారం ముల్లు తిరగడం మొదలుపెట్టింది. ఇంక గంట కొట్టడమే ఆలస్యం! గడియారం పని చేస్తోందన్న విషయం తెలుసుకుని మరి కొంత మంది అక్కడకు వచ్చారు. గడియారం గంటలు కొడుతోంది. వాటితో పాటు బాలుని అభినందిస్తూ ఊరందరి చప్పట్లు!
– సిరా