గులాబీ సాగు లాభాలు బాగు

The benefits of rose cultivation are good– సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా గులాబీ పూల తోట సాగు
– ఆధునిక సేద్యపు విధానాలతో అధిక దిగుబడి
– గులాబీ పూల సాగులో సత్ఫలితాలు సాధిస్తున్న యువరైతు
నవతెలంగాణ-ఆమనగల్‌
వాణిజ్యపరంగా బయటి ప్రదేశాల్లో పాలీహౌజుల్లో సాగు చేసుకునే బహు వార్షిక పంట గులాబి. దేవుడి పూజకైనా, ఇతర ఏ శుభ కార్యా నికైనా గులాబీ పూలను విరివిగా వినియోగిస్తారు. అందుకే పూలల్లో రారాణి అయినా గులాబీ పూల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గులాబీ సాగు రకాల్లో సెంట్‌ రోజ్‌, బుల్లెట్‌ గులాబీ తదితర రకాలు అనుకూలంగా ఉన్నాయి. దేశవాళి హైబ్రిడ్‌ గులాబీ పంటలను బయలు ప్రదేశాల్లో సాగు చేస్తుండగా, ఇటీవల వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక సాగు పద్ధతిలో రైతులు పాలీహౌజుల్లో హైబ్రిడ్‌ గులాబీ పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పూల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఔత్సాహిక రైతులు తమకున్న కొద్దిపాటి పొలాల్లో గులాబీ పూలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఈ క్రమంలో ఆమనగల్‌ పట్ట ణానికి చెందిన యువ రైతు తోట అల్లాజీ యాదవ్‌ యాదమ్మ దంపతులు సాంప్రదాయ పంటల సాగును వీడి గులాబీ సాగుకు శ్రీకారం చుట్టారు. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం లేకున్నా నిత్యం హైదారాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు పూలను తరలిస్తున్నారు. సీజన్‌ సమయాల్లో మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండడం తో గులాబీ తోట సాగు రైతుకు కలిసి వస్తుంది. డ్రిప్‌ పద్ధతిలో నీరు అందిస్తూ ఆధునిక సేద్యపు విధానాలు అనుసరిస్తూ పూల సాగులో సత్ఫలితాలు సాధిస్తు న్నారు. పంట సాగుచేసిన 4వ నెల నుంచి పూల దిగుబడి ప్రారంభమైన 6వ నెల నుంచి ఆశాజనకంగా ఉంటుందని అంటున్నారు. సూక్ష్మ పోషకాల లోపం లేకుండా సేంద్రియ ఎరువులు వాడుతూ వాణజ్య సరళిలో గులాబీ పూలను పండిస్తున్నారు.
రెండు ఎకరాల విస్తీర్ణంలో సాగు..
తనకు ఉన్న మూడున్నర ఎకరాల వ్యవసాయ పొలంలో ఎకరన్నర పొలంలో వరి, టమాట తదితర పంటలను సాగు చేస్తూ రెండు ఎకరాల్లో బుల్లెట్‌ రకం గులాబీ తోటను సాగు చేశాను. రెండు ఎకరాల్లో సాలుకు సాలు మధ్య 6 ఫీట్లు, మొక్క మొక్కకు మధ్య 2 ఫీట్ల దూరంతో దాదాపు 5 వేల మొక్కలు నాటాను. తోట సాగు కోసం భూమి చదును, సేంద్రియ ఎరువు, డ్రిప్‌ పైపులు, అడుగు మందు, స్ప్రే మందు, మొక్కలకు మొత్తం కలిపి రూ.4 లక్షల వరకు ఖర్చు అయినవి. ఒక్క సారి మొక్కలు నాటితే 5 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు. మొక్క నాటిన 3వ నెల నుంచే కాపు కాసిన ఒక నెల రోజుల పాటు మొగ్గలు, కాండము వరకు తెంపివేశాము. దీంతో మండలు ఎక్కువై 4వ నెల నుంచి 20 నుంచి 30 కిలోల వరకు పూల సాగు చేతికొచ్చింది. 6వ నెల నుంచి ప్రతి నెలా పూల సాగు పెరుగుకుంటూ 9వ నెలలో క్వింటాలుకు పైగా దిగుబడి వస్తుంది. తోట నాటిన ఒక సంవత్సరం తర్వాత ఏపుగా పెరిగిన కొమ్మలు కట్‌ చేయించాను. తిరిగి రెండవ నెల నుంచి పూల దిగుబడి ప్రారంభమైంది. మార్కెట్‌ వీలును బట్టి రోజు విడిచి రోజు తెంపితే రెండు క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7, 8 గంటల వరకు పూలు కోస్తాము. అవసరాన్ని బట్టి మా ఇద్దరు పిల్లలతో పాటు మరో ఇద్దరు కూలీలను పెట్టుకుంటాం. వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. కలుపు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. పెండ్లిల్లు, పండుగల సమయాల్లో మంచి రేటు వస్తుంది. కిలోకు రూ.200 నుంచి 250 వరకు వస్తాయి. సీజన్‌ లేని సమయంలో కిలోకు రూ.40 నుంచి 70 వరకు ధర పలుకుతోంది. మాలాంటి ఔత్సాహిక రైతులను ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక రాయితీ రుణాలు అందించాలి.
తోట అల్లాజీ యాదవ్‌ యాదమ్మ, ఆమనగల్‌