కొన్నేండ్లు యుద్ధభూమిలోనూ యుద్ధానికి సంబంధించిన వాతావరణంలో గడిపిన సైనికులు తర్వాత జనజీవన స్రవంతిలో కలవాలంటే మానసికంగా ఎంతో అసౌకర్యానికి గురవుతారు. యుద్ధం మనుషుల జీవితంలో చాలా మార్పు తీసుకొస్తుంది. స్వేచ్ఛగా బతికే సాధారణ తత్వాన్ని దూరం చేస్తుంది. ఒక సైనికుడు యుద్ధకాలంలో మానసికంగా ఎన్నో రకాలుగా తనను తాను మార్చుకుంటాడు. అలాంటి అతన్ని మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకురావడం చాలా కష్టం. యుద్ధ వాతావరణంలో కొన్నేండ్లు గడిపిన సైనికులు సాధారణ జీవితంలోకి రావడానికి మానసికంగా ఎంతో వ్యధకు సంఘర్షణకు లోనవుతారు. ఇది అందరికీ అర్ధం కాని విషయం. ఈ సర్దుబాటు కాలం వారిని ఎన్నో రకాల పరీక్షలకు గురి చేస్తుంది.
యుద్ధం కలిగించే కష్టాల్లో సైనికులకు సంబంధించిన ఈ వ్యధను పెద్ద సమస్యగా చాలా మంది ప్రస్తావించరు. దేశం కోసం తమ జీవితంలో కొన్నేండ్లు ధారపోసి, తమను తాము రకరకాల అగ్ని పరీక్షలకు గురి చేసుకున్న సైనికులు యుద్ధం తర్వాత అనుభవించే ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. అప్పటిదాకా తమదైన కుటుంబం కొత్తగానూ, తమను వాళ్లు స్వాగతించి, స్వీకరించే విధానంలో వచ్చిన తేడాను ఒప్పుకుని మళ్లీ తమ వాళ్ల మధ్య తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అంతఃసంఘర్షణను అనుభవించే ఆ సైనికుల మానసిక స్థితిని వర్ణించడం చాలా కష్టం. వాళ్లు తమ మధ్య లేకపోవడాన్ని వాళ్ల కుటుంబం అలవాటు చేసుకుని ముందుకు వెళ్లిపోతుంది. ఇప్పుడు మళ్లీ వాళ్ల రాక, వాళ్లనీ ఇబ్బంది పెడుతుంది. దానితో కుటుంబీకులు తమ దైనిక జీవితంలో వీరిని ఎలా స్వీకరించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. యుద్ధం చాలా మంది జీవితాలను, బంధాలను శాశ్వతంగా మార్చివేస్తుంది.
ఇలాంటి సున్నిత కథాంశంతో ప్రపంచంలో అన్ని భాషల్లోనూ ఎన్నో సినిమాలు వచ్చాయి. కాని ప్రప్రధమంగా ఈ విషయాన్ని లోతుగా చర్చించిన సినిమా 1946లో విలియం వైలర్ దర్శకత్వంలో వచ్చిన ”ది బెస్ట్ యియర్స్ ఆఫ్ అవర్ లైవ్స్”. మకిన్లే కాంటర్ రాసిన ”గ్లోరీ ఫర్ మీ” అనే నవలిక ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏడు అకాడమీ అవార్డులను అందుకున్న ఈ చిత్రం ‘గాన్ విత్ ద విండ్’ చిత్రం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గానూ చరిత్రకెక్కింది. ప్రజలు ఈ సినిమాను ఎంతో ఆదరించారు. ముఖ్యంగా సైనికుల మానసిక స్థితిని సున్నితంగా చర్చించిన ఈ చిత్రం అప్పటి యుద్ధకాలంలో జన జీవనంలో కలవలేక ఇబ్బంది పడుతున్న సైనికుల మనసులను తాకింది. 1939 నుంచి 1945 దాకా జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో ఎందరో సైనికులు గాయాలతో, చెప్పుకోలేని కఠినమైన అనుభవాలతో తమ కుటుంబాల మధ్యకు చేరారు. వాళ్ల మానసిక స్థితిని అర్థం చేసుకోగల అనుభవం కుటుంబీకులకు లేదు. ఆ సమయంలో ఆ సైనిక కుటుంబాలు తమకే తెలియని అసహాయతను అనుభవిస్తున్నారు. ఈ సినిమా ఆ కుటుంబాల్లోని మనుష్యులను దగ్గర చేయడానికి ఎంతో ఉపయోగ పడింది. అందుకే ప్రజలు దీన్ని విశేషంగా ఆదరించారు. ఇప్పటికీ అలనాటి పాత చిత్రాల నడుమ ఈ సినిమాను సినీ అభిమానులు ఎంతో గౌరవంగా తలచుకుంటారు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, యుద్ధంలో పని చేసిన ముగ్గురు వ్యక్తులు తమ ఊరికి వెళ్లడానికి ఉత్సాహంగా బయలు దేరతారు. విమానంలో సీట్లు నిండిపోయి ఉన్నందువల్ల వీరిని చిన్న చిన్న యుద్ధ విమానాల్లో వారి నగరాలకు తరలిస్తూ ఉంటుంది ప్రభుత్వం. అలా బూన్ సిటీకి వెళ్లే విమానంలో ముగ్గురు వ్యక్తులు మొదటిసారి కలుసుకుంటారు. వీళ్లు ముగ్గురు యుద్ధంలో మూడు విభాగాల్లో పనిచేసారు. ఫ్రెడ్ డెర్రీ లో బొంబార్డియర్ కెప్టెన్ గా సేవలు అందించాడు. విమానంలో నుంచి కింద భూమిపై బాంబులు వేసే దళానికి అతను నాయకుడు. హోమర్ పారిష్ . నేవీలో ఒక చిన్న అధికారిగా పని చేస్తే, ఆల్ స్టీఫెన్‌సన్ ఆర్మీ సార్జెంట్‌గా సేవలు అందించాడు. వీరిద్దరిదీ ఒకే ఊరు అవడంతో కలిసి ఆ చిన్న విమానంలో కింద కూర్చుని ప్రయాణం చేసి తమ ఊరు చేరుకుంటారు. విమానంలో పై నుంచి తమ ఊరు చూస్తూ కూర్చున్న వీరికి ప్రపంచం చాలా ప్రశాంతంగానూ కొత్తగానూ కనిపిస్తూ, వాళ్లకు స్వాగతం పలుకుతుంది. తమను ప్రేమించే కుటుంబాలను చేరడానికి ఉత్సాహంగా బైలుదేరుతారు ముగ్గురూ.
హోమర్ పారిష్ కాలేజీలో గొప్ప ఆటగాడు. మధ్యతరగతికి చెందిన తల్లితండ్రులు, చెల్లెలితో ప్రశాంతంగా జీవించేవాడు. ఇంటి పక్కన ఉండే స్నేహితురాలు విల్మాను అతను ప్రేమిస్తాడు. యుద్దం తర్వాత వివాహం చేసుకోవాలని ప్రేమికులు నిర్ణయించుకున్నారు. కాని యుద్దంలో బాంబు పేలుళ్లకు గురయి అగ్నిప్రమాదంలో హౌమర్ చేతులు పోగొట్టుకుంటాడు. పెట్టుడు స్టీలు చేతులతో అతను ఇంటిని చేరతాడు. కాని సైనికుడికున్న అపారమైన ఆత్మవిశ్వాసం అతని సొంతం. ఎవరితోనూ ఏ పని చేయించుకోడు హోమర్. తన పెట్టుడు చేతులతోనే అన్ని పనులు సులువుగా చేసుకుంటూ ఇతరులకు సహాయపడుతూ ఉంటాడు. ఎవరూ తనపై జాలి చూపడం అతనికి ఇష్టం ఉండదు. కాని తనను ఆ స్థితిలో విల్మా ఆదరిస్తుందా, తనను కోరుకుంటుందా, అసలు తమకు వివాహం జరుగుతుందా అనే అనుమానం అతన్ని వేధిస్తూ ఉంటుంది. అతని కథ విన్న అ ఇద్దరు కూడా అదే అనుమానంతో హోమర్‌ను అతని ఇంటి వద్ద దింపుతారు. కాని కొడుకుని చూసిన ఆనందంతో కన్నీళ్ల పర్యంతం అయిన హోమర్ తల్లితండ్రులు, వారి నడుమ అదే ప్రేమతో హోమర్‌ను కౌగలించుకున్న విల్మాను చూసిన ఆ ఇద్దరికీ అతని భవిష్యత్తు సురక్షితమనిపిస్తుంది.
అల్ స్టీఫెన్సన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. ఆ నగరంలో ఖరీదైన అపార్టమెంట్‌లో భార్య ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. ఆ నగరంలో ధనిక సమాజంలో అతను ఒకడు. అతన్ని ఎంతో ఆనందంతో ఆహ్వానిస్తారు భార్యా పిల్లలు. అంత త్వరగా ఆల్ ఇంటికి రావడం వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్లేన్‌లో సీట్ దొరకలేదని తన రాక ఆలస్యం అవుతుందని అతను ఫోన్ చేసి భార్యకు చెప్పడంతో ఆమె అతని రాకకు సిద్ధంగా ఉండదు. యుద్ధ విమానంలో ఆఖరి నిముషంలో తనను అధికారులు పంపించారని ఆల్ ఆమెకు చెబుతాడు. భర్త ఇంటికి చేరడంతో మిలి తాను ఆ రోజు వెళ్లాలనుకుంటున్న విందుకు రానని ఫోన్ చేసి చెబుతుంది. ఆమె హై క్లాస్ స్నేహితులతో తనదైన జీవితానికి అలవాటు పడుతుంది. ఆల్ కూతురు కొడుకు కూడా పెద్దవాళ్లవుతారు. వారిని ఆల్ క్తొతగా చూస్తూ ఉంటాడు. యుక్తవయసులోకి అడుగుపెట్టిన తన పిల్లల్లో మాయమయిన ఆ పసితనం లోటు అతన్ని ఇబ్బంది పెడుతుంది. ఆల్ కూతురు పెగ్గీ చాలా స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా ఎదుగుతుంది. యుద్ధకాలంలో ఖర్చులను తట్టుకోవడానికి ఇంట్లో పని వాళ్ల సహాయం లేకుండా ఆమె అన్ని పనులు చేస్తూ తల్లికి తోడుగా ఉంటుంది. తాను పసి పిల్లగా వదిలి వెళ్లిన పెగ్గీ ఇలా ఓ బాధ్యత గల యువతిగా ఎదిగి తన ముందుకు రావడంతో ఆల్ ఇబ్బంది పడతాడు. కొడుకు బాబ్ కూడా పెరిగి ఆల్ ఎత్తుకు ఎదుగుతాడు. తాను అపరిచితుల మధ్యకు చేరినట్లు అనిపిస్తుంది ఆల్ కు.
ఫ్రెడ్ డెర్రి యుద్ధానికి ముందు సోడా అమ్మే చిన్న దుకాణంలో పని చేసేవాడు. అతని తల్లిదండ్రులు పేదవాళ్లు. యుద్ధానికి ముందే అతను మారీ అనే స్త్రీని ప్రేమించి పెండ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఆమె దూరంగా ఓ నైట్ క్లబ్‌లో నాట్యం చేస్తూ ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా జీవిస్తుందని అతనికి తెలిసి ఆమెను వెతుక్కుంటూ నగరంలోని నైట్ క్లబ్లన్నీ తిరుగుతుంటాడు.
తన కట్టుడు చేతులను చూసి ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడుతూ తనకేదో సహాయం చేయాలని, అది ఎలా అడగాలో, ఏం అడగాలో అర్థంకాక తికమకపడే తల్లిదండ్రులు, తనతో ఎలా సంభాషించాలో తెలియని విల్మా కండ్లల్లో తన పట్ల ప్రేమ సానుభూతి కలగలసి ఉండడం హోమర్ భరించలేకపోతాడు. వాళ్లలో తనపై ఎంతో ప్రేమ ఉంది కాని దానితో పాటు సానుభూతి కూడా ఉండడంతో చిన్నతనంగా అనిపిస్తుంది అతనికి. తనతో ఎవరూ సహజంగా ఉండక పోవడం అతన్ని తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుంది. ఇది అతనిలో కోపాన్ని పెంచుతుంది. ప్రేమగా దగ్గరకు చేరబోయిన చెల్లెలిని, తల్లిదండ్రులను, ప్రియురాలిని కూడా విసుక్కోవడం, అకారణంగా కోపగించుకోవడం చేస్తాడు. దానితో వాళ్లు తమలో తాము కుమిలి పోతూ ఉంటారు. ఆ వాతావరణం అతనికి ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. మార్పు కోసం తన స్నేహితుని బార్‌కి వస్తాడు హోమర్. అక్కడ తన భార్య కోసం ప్రతీ బార్‌కి వెళ్లి వెతుకుతున్న ప్రెడ్ కనిపిస్తాడు. తన అందమైన ఫ్లాట్, క్రమబద్దమైన దైనిక జీవితానికి అలవాటుపడిన కుటుంబంలో ఆల్ కూడా ఇబ్బందికి గురవుతాడు. అందుకే భార్యను కూతురిని తీసుకుని తాను ఇంతకు ముందు వెళ్లిన పబ్‌లకు ఆ రాత్రంతా తిరుగుతాడు. ఓ బార్‌లో అనుకోకుండా అతను ఫ్రెడ్, హోమర్‌లను కలుస్తాడు. ఈ ముగ్గిరికి ఒకరినొకరు తిరిగి ఇలా కలుసుకోవడం చాలా అనందంగా అనిపిస్తుంది. ఆ ఊరిలో వాళ్ల కుటుంబాలు స్నేహితులు అన్నీ పరాయిగానూ తాము ముగ్గురమే ఓ కుటుంబంగా వారికి అనిపిస్తుంది.
హోమర్ ఒంటరితనాన్ని గమనించి అతని స్నేహితుడైన ఆ బార్ ఓనర్ అతన్ని అర్ధం చేసుకుంటాడు. ఆ సమయంలో అతను ఇంటికి వెళ్లాలని అతన్ని పంపించేస్తాడు. కాని ప్రెడ్ ఆల్ పూర్తిగా మత్తులో మునిగి ఉండడంతో ఆ ఇద్దరినీ పెగ్గీ తన తల్లితో పాటు కారులో ఇంటికి తీసుకొస్తుంది. ఆల్‌ని తన గదిలో మంచంపై పడుకోబెడుతుంది భార్య మిలి. పెగ్గి ఫ్రెడ్‌ని తన గదిలోకి తీసుకెళుతుంది. అతన్ని తన మంచంపై పడుకోబెట్టి తాను హాలులో పడుకుంటుంది. ఫ్రెడ్ యుద్ధంలో బాంబులు వేస్తూ గడిపాడు. అతనికి రాత్రిపూట భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. దానితో అతను విపరీతంగా భయపడి కలవరిస్తూ ఉంటాడు. పెగ్గీ ఆ రాత్రి అతను కలవరించడం చెమటతో తడిసిపోవడం చూస్తుంది. ఫ్రెడ్‌పై ఆమెకు ప్రేమ కలుగుతుంది. అతను వివాహితుడని ఆమెకు తెలుసు. కాని అతనిపై ఆమెకు అనురాగం ఏర్పడుతుంది.
ఫ్రెడ్ చివరకు తన భార్యను మారీని కలుసుకుంటాడు. మారీకి డబ్బు పిచ్చి ఎక్కువ. జీవితంలో పైకి ఎదగాలని, డబ్బు సంపాదించి ఆడంబరంగా బతకాలని ఆమె కోరిక. ఫ్రెడ్ భార్యలో ఈ గుణాన్ని అంగీకరించలేకపోతాడు. ఆమె అందానికి కళ్లు మూసుకుపోయి తాను చేసుకున్న ఈ వివాహం తన జీవితంలో పెద్ద తప్పిదం అని అతనికి అర్ధం అవుతుంది. కాని వివాహ బంధాన్ని గౌరవిస్తూ మారితో జీవితాన్ని గడపడానికి తననుతాను మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. కాని అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకదు. మారి నైట్ క్లబ్‌లో ఉద్యోగం మానేస్తుంది. ఆమె జీవించే పద్ధతికి ఫ్రెడ్‌కు చాలా డబ్బు ఖర్చవుతూ ఉంటుంది. సైన్యం నుంచి వచ్చిన డబ్బు అయిపోవడంతో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు ఫ్రెడ్. మారి ఖర్చులు తగ్గించుకోదు. దీనితో ఆర్ధిక ఇబ్బందులు, తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయి ఫ్రెడ్ ఇష్టం లేకపోయినా మళ్లీ అదే సోడా అమ్మే ఉద్యోగంలో చేరతాడు.
ఆల్‌కు బ్యాంక్‌లో ప్రమోషన్ ఇస్తారు. అతని సైనిక అనుభవం తమకు అవసరం అని, యుద్ధం తర్వాత బ్యాంకుల పని, లోన్లు ఇవ్వవలసిన అవసరాలు పెరగడంతో తమ వ్యాపారం ఊపందుకుం టుందని యజమానులు గుర్తిస్తారు. ఆల్‌కు ఆ ప్రమోషన్ ఆనందాన్ని స్తుంది కాని యుద్ధాన్ని, యుద్ధంలో నుంచి బయటపడి సాధారణ జీవితాన్ని గడపాలనుకునే సైనికుల జీవన భతికి ఇచ్చే లోన్లలో కేవలం వ్యాపారాన్ని మాత్రమే చూసే యజమానుల వైఖరి ఆల్‌కు నచ్చదు. ఒక రకమైన తిరుగుబాటు చేస్తాడు. నిజాయితీతో కష్టపడి జీవించాలనుకుంటున్న సైనికులకు ఏ పూచీకత్తు లేకుండా లోన్లు ఇవ్వడం మొదలెడతాడు. దీనితో యజమానులు ఇబ్బంది పడతారు. తన యుద్ధ అనుభవాన్ని, తమ స్వార్ధానికి ఉపయోగించుకోవాలని అనుకుంటున్న యజమానుల వైఖరిని బాహాటంగా ఖండిస్తాడు ఆల్. అతనికి మద్దతుగా నిలుస్తుంది భార్య మిలి.
ఫ్రెడ్ పెగ్గీని కలుస్తూ ఉంటాడు. తాను ఫ్రెడ్‌ను ప్రేమిస్తున్నానని, అతని వివాహం ఓ తప్పిదం అని తన తల్లిదండ్రులకు పెగ్గీ చెబుతుంది. కూతురు భవిష్యత్తు పట్ల భయంలో ఆల్ ఫ్రెడీని కలిసి పెగ్గీతో పరిచయం తప్పని ఆమెని ఎప్పటికీ కలవవద్దని మాట తీసుకుంటాదు. ఫ్రెడీ ఆల్ తండ్రి ప్రేమను అర్ధం చేసుకుంటాడు. పెగీతో స్నేహాన్ని మానుకుంటాడు. కాని మారి అతనితో ఉండలేనని తనకు ఆ పేదరికం సరిపడదని చెప్తూ విడాకులు కావాలంటుంది. దీనితో ఆ ఊరే వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు ఫ్రెడ్. తన సోడా షాప్‌కు వచ్చిన హోమర్‌ని ఒకతను అవమానించి వాళ్లు చేసిన యుద్ధమే నిరర్ధకం అని గేలిచేస్తే దాన్ని తట్టుకోలేక గొడవకు దిగి ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు ఫ్రెడ్.
హోమర్ విల్మాకు దూరంగా మసలుతుంటాడు. ఇది భరించలేక ఆమె ఓ రాత్రి అతన్ని కారణం అడుగుతుంది. రోజంతా ఆ పెట్టుడు చేతులతో అన్ని పనులు చేసుకుంటూ ఉండే హోమర్ రాత్రి అయ్యాక మరొకరి ఆసరా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. పడుకోబోయే ముందు తానే ఆ చేతులను విడదీసుకున్నా పడక మీదకు చేరడానికి, పొద్దున్న మళ్లీ ఆ చేతులు తగిలించుకోవడానికి అతనికి మరొకరి సహాయం తప్పనిసరి. ప్రస్తుతం అతని తండ్రి ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడు. కాని వివాహం అయ్యాక అతని అసహాయస్థితికి విల్మా అలవాటు పడాలి. జీవితాంతం ఆ అసహాయతను భరించడం అంత సులువుకాదని ఆమెకు నచ్చచెబుతాడు హోమర్. చేతులు లేకుండా తానెంత అసహాయుడో ఆమెకు చూపిస్తాడు. కాని విల్మా అతనితో జీవితం పంచుకోవడమే తన తుది నిర్ణయం అని చెబుతుంది. ఇద్దరి వివాహం నిశ్చయమవుతుంది.
విడాకుల తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతున్న ఫ్రెడ్ ఓ పెద్ద మైదానంలో యుద్ధంలో ఉపయోగించిన విమానాలను స్క్రాప్‌గా విడదీసే పనిలో కొందరు ఉండడం చూస్తాడు. అక్కడే చిన్న ఉద్యోగంలో కుదురుతాడు. సినిమాలో ఈ సీన్‌ను నిజంగా అలా విమానాలను విడదీసే చోటే తీసారట. అన్ని విమానాలను జంక్‌గా మార్చి విడదీస్తున్న ఆ చోటునుచూస్తే యుద్ధంలోని నిష్ప్రయోజకత్వం, ప్రయోజనం లేకుండా ఖర్చయి పోయిన ప్రజల ధనం గురించి ఆలోచన వచ్చి మనసు కలవరపడుతుంది. ఈ సినిమాలో ఇది మర్చిపోలేని ఓ దశ్యం.
హోమర్ వివాహానికి బెస్ట్ మాన్ హోదాలో వస్తాడు ఫ్రెడ్. అక్కడ ఆల్ కూడా భార్యతోనూ కూతురుతోనూ వస్తాడు. హోమర్ విల్మా భార్యా భర్తలవుతారు. అక్కడే ఫ్రెడ్ పెగ్గీని తిరిగి కలుస్తాడు. తనతో జీవితం అంత సజావుగా సాగదని చెప్పిన ఫ్రెడ్‌ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది పెగ్గి. వారిద్దరూ ఒకటవుతారని ప్రేక్షకులకు అర్ధం అవుతుండగా సినిమా ముగుస్తుంది.
ఆల్‌గా ఫ్రెడ్రిక్ మార్చ్, మిలిగా మైర్నా లారు, ఫ్రెడ్‌గా డానా ఆండ్రూస్, పెగ్గీ గా థిరీసా రైట్, హోమర్‌గా హారోల్డ్ రసల్ నటించిన ఈ చిత్రం సినిచరిత్రలోనే ఓ గొప్ప సినిమా. ఇందులో హోమర్ పాత్రలో నటించిన హారోల్ద్ రసెల్ నిజంగానే రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పాల్గొని చేతులు పోగొట్టున సైనికుడు. తన పెట్టుడు చేతుల్లో ఈ సినిమాలో రసల్ పియానో వాయించే సీన్ అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తుంది. రసల్‌కు సినీ ప్రపంచం గౌరవాన్ని ఇస్తూ ఆస్కార్‌కు ఈ చిత్రం చేరిన తర్వాత అతన్ని అకాడమి గౌరవ అవార్డుతో సత్కరించాలనుకుంది. కాని ఆస్కార్ బరిలో ఈ చిత్రం చేరి, నటన ఏంటో తెలియని రసల్ తన పాత్రను పండించిన విధానానికి ఈ చిత్రం ద్వారా సహాయనటుడిగా అతను ఆస్కార్‌ను గెలుచుకున్నారు. అలా దివ్యాంగుడిగానూ నాన్ ప్రొహెషనల్ నటుడిగానూ ఆస్కార్ గెలుచుకున్న ఏకైక నటుడిగా ఆయన చరిత్రకెక్కారు. అయినా ఆస్కార్ అకాడమీ ఆయనకి అదే వేదికపై గౌరవ పురస్కారాన్ని కూడా అందించింది. అలా ఒకే పాత్రకు రెండు ఆస్కార్లను అందుకున్న ఏకైక నటుడిగానూ రసల్ చరిత్ర సష్టించారు. 1992లో తన ఉత్తమ సహాయ నటుడి ఆస్కార్‌ను ఆయన ఆర్ధిక కారణాలతో 60,500 డాలర్లకు అమ్మేసారు. అలా తన ఆస్కార్ అవార్డును అమ్మిన మొదటి నటుడు కూడా రసలే. ఆ ఆస్కార్‌ను గోప్యంగా కొన్న ల్యూ వాసెర్మాన్ అనే స్టూడియో ఎగ్జిక్యూటివ్ దానిని అకాడమికి రసల్ మరణానంతరం తిరిగి ఇచ్చేసారు.
సినీ విమర్శకులందరూ ఏక కంఠంతో గొప్ప చిత్రంగా ఈ రోజుకీ ప్రస్తావించే ‘ది బెస్ట్ యియర్స్ ఆఫ్‌్ అవర్ లైవ్స్” నిస్సందేహంగా ఆస్కర్ ఉత్తమ చిత్రాలలో ప్రధమ వరుసలో నిలుస్తుంది.
పి.జ్యోతి
98853 84740