– ఎన్నికలు బహిష్కరిస్తూ లారీని దగ్ధం చేసిన మావోయిస్టులు
– బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటేయొద్దని విస్తృత ప్రచారం
నవతెలంగాణ-చర్ల
ఎన్నికలకు 36 గంటల ముందు రాష్ట్రం లో మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో ఓ లారీని మావోయిస్టులు దగ్ధం చేశారు. ఈ ఘటనతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చర్లకు చెందిన కిషోర్ అనే వ్యక్తికి చెందిన ఏపీ 37 టీవి 6568 నెంబర్ గల లారీని ధాన్యం అన్ లోడింగ్ నిమిత్తం పూసుగుప్పకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. లారీలో ఉన్న ధాన్యాన్ని కిందకు దింపించి లారీ ట్యాంకర్ పగల గొట్టి డీజిల్ పోసి లారీని మావోయిస్టులు తగుల బెట్టారు. రెండు సీఆర్పీఎఫ్ క్యాంపులకు మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్లు ముమ్మర తనిఖీలు చేస్తూ అడవిని జల్లెడ పడుతున్నారు. పోలీస్ అధికారులు పరిస్థితిని సమీక్షిం చారు. అటవీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కాగా నాలుగు రోజుల క్రితమే ఎన్నికలను బహిష్కరించాలంటూ బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటు వేయొద్దని మావోయిస్టులు బ్యానర్లు కట్టి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.