భగవద్గీత, మనుస్మృతులలో సనాతన సారాంశం!

 Bhagavad Gita is the epitome of sanatana in Manusmruti!కుల వ్యవస్థను సమర్థించు కోవడానికి బ్రాహ్మణార్యులు భగవద్గీతను ప్రచారంలోకి తెచ్చారు. భగవద్గీత ఒకటవ అధ్యాయంలో అర్జునుడు ఒక సందేహం వెలిబుచ్చాడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వారి భార్యలు చరిత్రహీనులవుతారు. ఎందుకంటే భర్తలు లేనందువల్ల వారు ఇతర కులాల వారితో సంబంధాలు పెట్టుకుంటారు. లేదా, వారిని వివాహం చేసుకుంటారు. వర్ణ సంక్రమణం జరుగుతుంది. సంకర జాతి పిల్లలు పుడతారు. ఇక ఈ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన మన వీరులకు పిండాలు పెట్టడానికి వారి పిల్లలు ఉండరు కదా? ఆ విధంగా కులం, ధర్మం, నీతి, నియమం అన్నీ నాశనమవుతాయి కదా? అన్నది అర్జునుడి సందేహం.
కృష్ణుడు దానికి నేరుగా సమాధానమివ్వాలి కదా? ఇవ్వడు. విషయాన్ని అటూ ఇటూ తిప్పుతాడు. రెండో అధ్యాయం మూడవ శ్లోకంలో కృష్ణుడు కోపంతో అర్జునుణ్ణి నపుంసకుడా! అని దూషించి, తన కోపాన్ని అదుపులో పెట్టుకుని, మళ్ళీ వెంటనే ‘నీకు స్వర్గం ప్రాప్తిస్తుంద’ని ఆశ పెడతాడు (రెండవ శ్లోకం) రెండో అధ్యాయంలో 23, 24, 25 శ్లోకాలలో కృష్ణుడు ఆత్మగురించి మాట్లాడుతాడే గాని, సరైన వివరణ ఏమీ ఇవ్వడు. చనిపోయిన తర్వాత ఆత్మస్వర్గంలో ఎవరితో ఎలా సుఖపడుతుంది? అన్నదానికి జవాబులేదు. మళ్ళీ కొత్త శరీరం పొందడానికి కొత్త తల్లిదండ్రులు అవసరమవుతారు కదా? స్వర్గంలో పురుషులకు అప్సరసలుంటే మరి స్త్రీలకు ఏ ఏర్పాట్లున్నాయో కృష్ణుడు చెప్పలేదు.
భగవద్గీత రెండో అధ్యాయం 31, 38 శ్లోకాలలో వర్ణవ్యవస్థను తనే సృజించానని, దాన్ని నిలపడమే తన ధ్యేయమని కృష్ణుడు బలంగా చెపుతాడు. భగవద్గీతలోని 18వ అధ్యాయంలో తను సృజించిన వర్ణవ్యవస్థను అర్జునుడు అనుసరించాలని ప్రభోదిస్తాడు. కుల నాశనం జరిగితే సనాతన ధర్మం నశించిపోతుందని మనువాదుల భయం అందుకే అలా రాసిపెట్టుకున్నారు.
నేటి మన ఆధునిక ఆలోచనల ప్రకారం వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఎందుకూ పనికిరానివి. మానవత్వాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మసలుకోవాల్సిందే తప్ప – ఏవో కల్పిత పాత్రలతో మనువాదులు చెప్పించిన వర్ణ వ్యవస్థ, వర్ణ సంకరం, జన్మ, పునర్జన్మ, దేవుడి మహిమ వంటి మాటలకు ఎలాంటి విలువా. అర్థమూ లేదు. వైదిక మత ప్రభోదకులు కుట్ర పూరితంగా అల్లుకున్న మతగ్రంథాలు ప్రామాణికం కావు. హిందూ మతమనే కాదు, ప్రపంచంలోని అన్ని మతాలూ అబద్దాలే చెప్పాయి. కనుక, వాటినన్నింటినీ పక్కకు నెట్టేసి, మానవత్వం నిలుపుకునే దిశలో ఆధునికులమైన మనం, సంయమనంతో ప్రయాణించాల్సి ఉంది.
వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను తనే సృజించానని కల్పిత పాత్ర అయిన ఓ కృష్ణుడితో చెప్పించి, మనువాదులు చేతులు దులుపుకున్నారు. మనుషుల్ని విడగొట్టే ప్రక్రియ భగవద్గీతతో ప్రారంభించి, దాన్ని స్థిరపరిచి, మనుస్మృతిలో వివక్షను తారాస్థాయికి తీసుకెళ్ళారు. వివరంగా విశ్లేషించుకుంటూ ఉంటే, అంతా కళ్ళ ముందే కదలాడుతుంది. అయితే ఇక్కడ దోషులెవరో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తెలిసినా తెలియనట్టే ఉండటం – దోషులను శిక్షించకుండా వదిలేయడం తెలివిగల పనులేం కావుగదా?
మనుస్మృతి రెండవ అధ్యాయం 30వ శ్లోకంలో పది, పన్నెండు రోజుల పిల్లలకు నామకరణం చేయాలని ఉంది. ఇంకా ముందుకు వెళ్ళి 31, 32 శ్లోకాలలో ఎవరికి ఎలాంటి పేరు పెట్టాలో సూచించడం జరిగింది. ఉదాహరణకు బ్రాహ్మణ పిల్లలకు ఉన్నతమైన పేర్లు పెట్టాలనీ – శూద్రులకు హీనమైన పేర్లు పెట్టాలనీ అందులో రాసి ఉంది. ఆ పేర్లతో వారు జీవితాంతం దీనుల్లాగా, దాసుల్లాగానే బతకాలి. మధ్యలో కొంత వ్యతిరేకత వచ్చినందువల్ల ‘వర్ణం జన్మతో కాదు కర్మతో వస్తుంది’ అని కొత్త పాట పాడారు. ఇదే నిజమైతే బ్రాహ్మణులు పెట్టుకునే పేర్లు, శూద్రులను పెట్టుకోనిచ్చారా? లేదు కదా? అలాగే దాసులాంటి శూద్రుల పేర్లు బ్రాహ్మణార్యులు ఎందుకు పెట్టుకోలేదూ? జన్మతో కాదు చేసే కర్మతో ఉచ్ఛం, నీచం ఏర్పడుతాయని ఇంకా కతలెందుకు చెప్తారూ? అంబేద్కర్‌ చదివినంత చదువు బ్రాహ్మణుల్లో ఎవరూ చదవలేదు. ఆయన చేసిన గొప్ప పనులు ఏ బ్రాహ్మణుడూ చేయలేదు. కర్మతో వర్ణం మారుతుందంటే, అంబేద్కర్‌ తన కర్మ ఫలితంతో ఉన్నతవర్ణం వాడు కావాలి కదా? కాలేదు ఎందుకూ? విసిగి వేసారి ఆయన హిందూ ధర్మమే వద్దను కుని, ఆరులక్షల మందితో బౌద్ధం స్వీకరించాడు – మళ్ళీ అది వేరే విషయం.
మనుస్మృతి పదవ అధ్యాయంలో 5-6-66-67-68 శోక్లాలలో వివక్షకు సంబంధించి మరిన్ని విషయాలున్నాయి. బ్రాహ్మణుడు శూద్రజాతికి చెందిన అమ్మాయిని పెండ్లి చేసుకుంటే, పుట్టిన పిల్లవాడు బ్రాహ్మణుడే అవుతాడు. ఒక శూద్రుడు గనక బ్రాహ్మణ స్త్రీని పెండ్లి చేసుకుంటే పుట్టిన పిల్లలు శూద్రులే అవుతారు – ఈ మాత్రం దానికి వర్ణం జన్మతో వస్తుందని ఓ సారి, కర్మతో వస్తుందని మరోసారి చెప్పడం ఎందుకూ? అయినా మహిళలందరినీ శూద్రులుగా పరిగణించిన మనుధర్మ శాస్త్రం చిన్న లాజిక్‌ మరిచిపోయింది. ప్రపంచ మానవులందరూ స్త్రీలకు పుట్టినవారే. అంటే శూద్రులకు పుట్టినవారే. శూద్రుల పిల్లలు శూద్రులే అవుతారు కదా? అలాంటప్పుడు అందరూ సమానమే. వారి శాస్త్ర ప్రకారం అందరూ శూద్రులే. ఏమైతేనేం? తేడాల్లేవ్‌. ఇక నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థ ఎక్కడుంటుందీ? మరో విషయం మనుధర్మ శాస్త్రాన్ని వివిధ భాషల్లోకి అనువదించిన మహనీయులందరూ బ్రాహ్మణార్యులే – అన్నది మనం గమనించుకోవాలి! ఇంకా మరికొన్ని వివరాలు చూద్దాం! శూద్రుల పిల్లలకు ఉపనయనం చేసుకునే అర్హత ఉండదు. ఈ కాలంలో ఎవరైనా చేసుకుంటున్నారంటే వారు తమని తాము అగ్రవర్ణం స్థాయి కి తీసుకుపోతున్నారని – పరాయీకరణ చెందుతున్నారనీ అర్థం.
మాంగల్య బ్రాహ్మణస్య సాక్షత్రియస్య బలావితమ్‌.
వైశ్యస్య ధనసూచంక్తు శూద్రస్యతో జుగుప్సితమ్‌ మంగళకరమైన పేరు బ్రాహ్మణుడికి, వీరత్వాన్ని సూచించే పేరు క్షత్రియుడికి, ధన సూచికతో వైశ్యుడికి పేర్లు ఉండాలి. శూద్రుడికి నిందా పూర్వకమైన జుగుప్సాకరమైన పేరుండాలి అని అర్థం.
శర్మ వద బ్రాహ్మణస్య స్థాయోద్రజో రక్ష సమవీతమ్‌
వైశ్యస్య పుష్టి సంయుక్త శూద్రస్య ప్రేశ్య సంయుతమ్‌
అంటే గోపీనాథ్‌ శర్మ వంటి పేరు బ్రాహ్మణుడికి, రఘువీర్‌ సింV్‌ా వంటి పేరు క్షత్రియుడికి, ఘన్‌శ్యామ్‌ గుప్త వంటి పేరు వైశ్యుడికీ ఉండాలి. శూద్రుడికి బలరామ్‌ దాసు వంటి పేరు పెట్టాలి. మొదటి పేరు బలరామ అని పెట్టుకున్నా చివరకు వాడు దాసుడని లేదా బంటు అని స్పష్టంగా తెలిసే విధంగా పేరుండాలి.
వర్ణ వ్యవస్థను రూపొందించడమే కాదు, శతాబ్దాలుగా దాన్ని పరిరక్షించుకునే పనిలో బ్రాహ్మణార్యులు పూర్తిగా నిమగమై ఉన్నారు. అందుకే మనదేశంలో ఒక వ్యక్తి పేరును పూర్తిగా విశ్లేషించుకుంటే అతడి కులం, వర్ణం అన్నీ అర్థమవుతాయి. అలా అర్థమయ్యే విధంగా మనువాదులు డిజైన్‌ చేశారు.
ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో వారి పేర్ల చివరి ద్వివేది, త్రివేది, చతుర్వేది అనేవి ఉంటుంటాయి. అంటే వారి గురించి వారు గొప్పగా, ఘనంగా ప్రకటించుకోవడమన్న మాట. ద్వివేది – రెండు వేదాలు చదివిన వాడు, త్రివేది – మూడు వేదాలు చదివినవాడు. చతుర్వేది – నాలుగు వేదాలు అవుపోసన పట్టినవాడు అని అర్థం. రోజుకు మూడుసార్లు పఠనం చేసేవారు ‘త్రిపాఠి’ అని పెట్టుకుంటారు. అలాగే యాగాలు, యజ్ఞాలు చేసినవారు ‘సోమయాజి’ అని పెట్టుకుంటారు. వాళ్ళ జీవితమంతా తమ అగ్రవర్ణ స్థానాన్ని ప్రకటించుకోవడంతోనే సరిపోతుంది. ఆ పరిధిలోనే గిరికీలు కొడుతూ కుంచించుకుపోయి ఉంటుంది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం, గణితం, చరిత్ర అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. వేదం, పురాణాలు సంస్కృత భాషా ప్రావీణ్యం, పంచాంగం, జ్యోతిషం, వాస్తు వంటి విషయాలు తెలిసిన వారికి గౌరవమిచ్చారు. కానీ, అది మాత్రమే జ్ఞానం కాదు. అనే విషయం సామాన్య పౌరులు గ్రహిస్తూ వచ్చారు. ఇంకా కొందరు గ్రహించే దశలో ఉన్నారు. గతాన్ని అధ్యాయనం చేయడం వల్ల కుట్రలన్నీ వెల్లడయ్యాయి. కుతంత్రాలు బయటపడ్డాయి. మత మౌఢ్యంలోంచి బయటపడి స్వేచ్ఛాలోచనలో జనం విశ్వమానవులుగా ఎదుగుతున్నారు. తాము ఏ కులానికీ ఏ మతానికీ కట్టుబడి లేమని అధికారికంగా ”నో కాస్ట్‌ – నో రిలిజియన్‌” సర్టిఫికేట్లు తీసుకుని మానవ జాతి అంతా ఒక్కటే అని చాటి చెపుతున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను ఎత్తి చూపాలన్నదే – ఈ ప్రయత్నం! తప్పితే, ఒక వర్గం వారిని విమర్శించాలని కాదు. శతాబ్దాల క్రితం జరిగిన పొరపాట్లను సరి చేసుకుందామని చెప్పడం తప్ప, సమకాలీనంలో మన జనాభాలో భాగమైన బ్రాహ్మణవర్గం మీద ఉక్రోషం వెళ్ళగక్కడం కాదు. శతాబ్దాల క్రితం జరిగిన పొరపాట్లకు సమకాలీనంలోని వారు ఏ విధంగానూ బాధ్యులు కారు కదా? అయితే అవే పాత పద్ధతులు వర్థిల్లాలని తాపత్రయ పడేవారు కొంచెం వారి ‘మైండ్‌ సెట్‌’ మార్చుకుంటే బావుంటుంది.
ఒక శూన్యానికి ‘దైవం’ అని పేరు పెట్టి, దాన్ని జనానికి మత్తు మందులాగా అలవాటు చేసి ఆ తర్వాత ”ఈ భూమి మీద దైవ స్వరూపులు మరెవరో కాదు, బ్రాహ్మణులే” అని తమ గురించి తామే ప్రకటించుకున్నారు కదా? అంటే ఈ శూన్యంలో తమను తాము ప్రతిష్టించుకున్నారు. సామాన్య జనం నమ్మి పూజారిని అపర పరమాత్మ స్వరూపుడనుకున్నారు. దైవస్తుతిలో ఎవరైనా ఓ కీర్తన పాడితే ఇక ఏకంగా అతణ్ణి దైవ స్వరూపుడన్నారు. అతను చనిపోలేదు – దైవంలో ఐక్యమై పోయాడు అని అన్నారు. ఇన్నిన్ని అభూత కల్పనల మధ్య సామాన్య జనం ఆలోచించలేక, మెదడ్లు మొద్దుబారిపోయి, తరతరాలుగా వాస్తవాలు గ్రహించలేకపోయారు.
భ్రమలు తొలగాలంటే జీవ పరిణామం, జన్యుశాస్త్రం, ఖగోళశాస్త్రం గురించి కొంత ప్రాథమిక పరిజ్ఞానమైనా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకా పెంచుకోవాలి. కొందరు గౌరవనీయులైన మూర్ఖులుంటారు. అశాస్త్రీయమైన విషయాలకు శాస్త్రీయ వివర ణలివ్వాలని ప్రయత్నిస్తుంటారు. వారిని నిర్దాక్షిణ్యంగా పక్కకు తొలగించు కుంటూ – మానవ జాతి అంతా ఒక్కటే – అందరిదీ ఒకేస్థాయి అని ఎలుగెత్తి చాటుకుంటూ ప్రగతి పథంలోకి కదలాలి – మానవవాదులుగా గెలవాలి! మానవవాద ప్రపంచానికి రూపకల్పన చేయాలి!!
– వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త.

డాక్టర్‌ దేవరాజు
మహారాజు