గుంతలను తప్పించబోయి కిందపడ్డ బైక్

The bike fell down after avoiding potholes– వాహనదారుడికి ఎడమకాలు ఫ్రాక్చర్,
– మరొకరికి స్వల్ప గాయాలు
– ప్రమాదం జరిగిన గంట తర్వాత వచ్చిన అంబులెన్స్
– గంటసేపు రోడ్డు పక్కన విలవిలలాడిన బాధితులు  
నవతెలంగాణ – శాయంపేట
రంగాపూర్ లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి పరకాల పట్టణంలో తన తండ్రి నడవడానికి అనుకూలంగా ఉండడానికి వాకర్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్తుండగా పరకాల హనుమకొండ ప్రధాన రహదారిలోని మాందారిపేట మూలమలుపుల వద్ద, కేజీబీవీ గురుకుల పాఠశాల సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పిస్తూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడడంతో ఇరువురికి గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… వరంగల్ పట్టణంలోని కొత్తవాడకు చెందిన అంబిశెట్టి వీరేశం, అతని బామ్మర్ది వెలిశెట్టి నరేష్ టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై శనివారం రంగాపూర్ లో జరిగే శుభకార్యానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిశాక వీరేశం తండ్రి కోసం పరకాల పట్టణంలో వాకర్ కొనుగోలు చేశాడు. తిరిగి ఇంటికి వస్తుండగా మాందారిపేట మూలమాలపుల గుట్ట వద్ద కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పిస్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో నరేష్ కు ఎడమ కాలు ఫ్యాక్చర్ కాగా, వీరేశం కు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. గంట సేపటి వరకు రాకపోవడంతో రోడ్డు పక్కన బాధితులు గాయాలతో విలవిలలాడిపోయారు. గంట తర్వాత అంబులెన్స్ రావడంతో బాధితులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. శాయంపేటకు అంబులెన్స్ లేకపోవడంతో క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అంబులెన్స్ కేటాయించానని  ప్రకటిస్తున్నారని, ఇప్పటివరకు అంబులెన్స్ జాడలేదని, బిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మండలానికి అంబులెన్స్ కేటాయించినట్లయితే రోగులకు, క్షతగాత్రులకు సత్వర సేవలు అందుతాయని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.