
నవతెలంగాణ – వేములవాడ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో బిజెపి ప్రభుత్వానికి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ లేదని మరోసారి రుజువైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మిత్రులు పక్షాలను మెప్పించడం కోసం బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం చూసాం అన్నారు.నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏకచత్రాధిపత్యానికి అడ్డుకట్ట ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుందన్నారు. గతంలో ఈడీ,సీబీఐ,లను అడ్డుపెట్టుకొని దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం ఇక నడవదని మేము ఆరోజే చెప్పామన్నారు.అప్ కా బార్ 400 అంటే 300 కూడా రాకుండా సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షలతో కలిసి ఏవిధంగా ముందుకు పోతారని ఆనాడే అన్న సందర్భంలో మంగళవారం కేంద్ర బడ్జెట్లో తేటతెల్లమైంది అన్నారు.నరేంద్ర మోడీ కి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న వ్యతిరేకతను మనం చాలా సందర్భాల్లో చూసాం అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటు తలుపులు మూసి తల్లి బిడ్డలను వేరు చేసి తల్లిని చంపారని అన్న మోడీ మాటలతోటి వారికి తెలంగాణపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్థమైందన్నారు. తెలంగాణలో ప్రజలు 8 ఎంపీ సీట్లను ఇస్తే తెలంగాణ నుండి ఇద్దరు మంత్రులుగా ఉండి బండి సంజయ్ ,కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు.బేషజాలకు పోకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లు మోడీ తెలంగాణ కు వచ్చినప్పుడు, ఢిల్లీ వెళ్లి కలసి పెద్దన్న పాత్ర పోషించాల్సిందిగా కోరిన, మా మంత్రులు 18 సార్లు కేంద్రమంత్రులను కలిసినా బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు.బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి రంగాలపట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తుందన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని మూలుగులో గిరిజన యూనివర్సిటీకి నిధులేవన్నారు.బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం తెలంగాణలోని బిజెపి ఎంపీల, ఈ రాష్ట్రనికి చెందిన ఇద్దరు మంత్రుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని,తెలంగాణ ప్రజలకు బిజెపి రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ అంశాలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై గొంతు ఎత్తుతామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఎక్కువ మొత్తంలో పన్నుల రూపంలో డబ్బు కేంద్ర ప్రభుత్వానికి వెళుతున్న నేపథ్యంలో మన ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టుగా చూపిస్తూ రాబోవు రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచైన మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకువచ్చేలా చేస్తామన్నారు.