– సీపీఐ(ఎం) జిల్లా అకాడమిక్ సెల్ కమిటీ సభ్యుడు బోడపట్ల రవీందర్
నవతెలంగాణ – బోనకల్
భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని సీపీఐ(ఎం) జిల్లా అకాడమిక్ సెల్ కమిటీ సభ్యుడు బోడపట్ల రవీందర్ అన్నారు. మండల పరిధిలోని జానకిపురం గ్రామంలోనే తేజా ఫంక్షన్ హాల్ నందు రెండవ రోజు సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా తరగతుల్లో మతం – మతోన్మాదం అనే అంశాన్ని బోడపట్ల రవీందర్ బోధించారు. మతానికి, మతోన్మాదానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. మతం అనేది వ్యక్తిగత ఇష్టమని, మతోన్మాదం అనేది ఇతరులపై బలవంతంగా రుద్దేదన్నారు. మతోన్మాదం దేశ ప్రయోజనాలకు హానికరమన్నారు. లౌకిక తత్వం దేశ ప్రజలకు మేలు చేస్తుందన్నారు. భారతదేశం లౌకిక తత్వం కలిగిన దేశం అన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకిక తత్వ భారత రాజ్యాంగాన్ని మతతత్వ రాజ్యాంగంగా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. వెంకయ్య నాయుడు కేంద్ర గ్రామీణ ఉపాధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా వ్యవస్థ మలినం అయిందని, విద్యావ్యవస్థ వామపక్ష భావజాలంతో నిండిపోయిందని, దానిని శుద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు. విద్యా విధానం సంస్కరణల పేరుతో చట్టాలు తీసుకువచ్చి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఉపా చట్టం పేరుతో అనేకమంది మేధావులను, జర్నలిస్టులను తనకు వ్యతిరేకంగా గొంతు విప్పిన వారిని జైలు పాలు చేసిందని విమర్శించారు.
అధ్యయనం లేకపోతే అన్ని వర్గ ధోరణలు పెరిగిపోతాయి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
అధ్యయనం లేకపోతే అన్యవర్గ ధోరణలు, పెడ ధోరణలు పెరిగిపోతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. పార్టీ నిర్మాణం అనే అంశాన్ని ఆయన బోధించారు. పార్టీ నిర్మాణం ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి, నేర్చుకోవాలి, దానిని అమలు చేయాలన్నారు. అప్పుడే పార్టీ నిర్మాణం ప్రాముఖ్యత, విలువ తెలుస్తుందన్నారు. పార్టీ పట్ల విశ్వాసం, నాయకులు పట్ల గౌరవం మాత్రమే ఉండాలన్నారు. సంఘాల వారీగా ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు నిర్వహించాలన్నారు. ప్రతి కమ్యూనిస్టు కమ్యూనిస్టు ధోరణి అలవర్చుకోవాలన్నారు. వ్యక్తి వాదం పార్టీకి నష్టం కలిగిస్తుందన్నారు. పార్టీ నిర్మాణం అమలు చేస్తే లాభం, ప్రయోజనం జరుగుతుందన్నారు. పార్టీ నిర్దేశించిన ప్రధానమైన నాలుగు అంశాలను ప్రతి సీపీఐ(ఎం) సభ్యుడు తప్పనిసరిగా పాటించాలన్నారు. పార్టీ సమావేశాలలో భిన్నాభిప్రాయాలు, విమర్శలు చేసే హక్కు ఉంటుందని, కానీ సమావేశంలో ఒక నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాల్సిందేనన్నారు. దేశంలో బీజేపీ మతోన్మాదం వల్ల కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌కి ఎన్నికలలో మద్దతు తెలపవలసి వస్తుందన్నారు. పార్టీ నాయకులు ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. అప్పుడే పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులై పెరుగుదలకు దోహదం చేస్తుందన్నారు. ఈ క్లాసులకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దొండపాడు నాగేశ్వరరావు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బంధం శ్రీనివాసరావు వివిధ గ్రామాల నుంచి పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.