దళితుల సంక్షేమానికి గండి కొడుతున్న బీజేపీ ప్రభుత్వం

– రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమం
– పేదలకు భూములు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి
– డిసెంబర్‌ 4న చలో ఢిల్లీ
– కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్‌, డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌
దళితుల సంక్షేమానికి గండి కొడుతున్న బీజేపీ ప్రభుత్వం
నవతెలంగాణ – మెదక్‌
దళిత సంక్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గండి కొడుతోందని కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్‌, డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌ విమర్శించారు. మంగళవారం మెదక్‌లోని కేవల్‌ కిషన్‌ భవన్‌ లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డిబిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘దళిత్‌ సమ్మిట్‌’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన అతిమేల మాణిక్‌, శంకర్‌ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా దళిత గిరిజన మహిళల సమస్యల పరిష్కరం కొరకు పోరాటాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్య హక్కులు హరించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఉన్న లౌకిక తత్వం ప్రజాస్వామ్యం అనే ముఖ్యమైన వాటిని తొలగించాలన్నారు. రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగం స్థానంలో ప్రైవేటు రంగంలో ప్రోత్సహిస్తూ దేశ సంపదనంతా కొద్ది మంది వ్యక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, రూ. 600 కూలీ ఇవ్వాలని, విద్య వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లోని అధికంగా దళితులు మహిళల పై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో ప్రతి దళిత కుటుంబానికి 125 గజాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూ సమస్యను పరిష్కరించాలని కౌలు రైతులందరికీ హక్కులు కల్పించాలన్నారు. డిసెంబర్‌ 4న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి సంగమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, జిల్లా అధ్యక్షులు దేవయ్య, డీబీఫ్‌ జిల్లా కార్యదర్శి సంజీవ్‌, జైబీమ్‌ జిల్లా అధ్యక్షులు రాజు, లాద్ద నర్సింలు, ఎమ్మార్పిఎస్‌ జిల్లా నాయకులు బాలరాజు, స్వామి, సంజీవ్‌, బీఎస్పి నాయకులు సురేష్‌, రిటైర్‌ టీచర్‌ రామస్వామి, మలమహనడు రాష్ట్ర నాయకులు సంజీవ్‌, బుడగ జంగం జిల్లా నాయకులు మల్లేశం డీబీఫ్‌ జిల్లా నాయకులు విద్యాసాగర్‌, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.