ఆదిలాబాద్ కు బీజేపీ ఇచ్చిన హామీల అమలు చేయాలి

– జిల్లాకు అన్యాయంపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలను ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మరోసారి బీజేపీ ప్రజలను మోసగించిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్ అన్నారు. బడ్జెట్ లో జిల్లాకు ఒక్క రూపాయి తీసుకురాని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, బడ్జెట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీసీఐ, ఆదిలాబాద్ రైల్వే లైన్, విమానాశ్రయం తెరిపిస్తామని హామీలిచ్చి బడ్జెట్ లో నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యాబట్టారు. బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, దేశ అభివృద్ధికి శాపంగా ఉండనుందని ప్రజల జీవితాలకు, శ్రామికుల బతుకుదెరువుకు శాపంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ అనుకూల కేంద్ర బడ్జెట్ కు బడాబాబుల బొజ్జలను మరింతగా నింపేలా, మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహంగా ఉన్న ఈ బడ్జెట్ ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించటం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధానాల ఫలితంగానే దేశం తిరోగమిస్తున్నదని బడ్జెట్ కంటే ముందురోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో చాలా స్పష్టంగా బట్టబయలైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ఎకనామిక్ అడ్వైజర్గా ఉండే వ్యక్తి పర్యవేక్షణలో రూపొందిన రిపోర్టును సైతం పరిగణనలోకి తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ అభివృద్ధి వెనుకపట్టుపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తి అంచనాలు భిన్నంగా పడిపోయాయని అన్నారు. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనన్నారు. ఈ కాలంలో నిత్యజీవితావసరాల సరుకులను సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. కాని ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అందులో ఆహార సరుకుల ధరలు మరింత గా పెరిగాయని గుర్తు చేశారు. ఇది కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసిన చర్య తప్ప మరేమిటని ప్రశ్నించారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్ ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందని విమర్శించారు. బీమా రంగంలో ఎఫ్ఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్లో ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమన్నారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు లంక రాఘవులు, బండి దత్తాత్రి జిల్లా, కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, కిష్టన్న ఆర్.మంజుల, ఆర్.సురేందర్, నాయకులు నెల్ల స్వామి, లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి ,దేవతల స్వామి, గంగారాం, మహాదవ్, హరిఫా, అనసూయ పాల్గొన్నారు