బ్లర్బ్‌

The blurbయుద్ధ శిథిలాల కడుపుకోత
విషాద గీతాల కన్నీళ్ల
నిప్పుకణిక కళ్లల్లోంచి
ఎగిసి పడుతున్న మంటలకు
దావోస్‌ సభలు చలికాచుకుంటున్నాయి

కంపెనీలు ప్రాజెక్టులు
అరచేతిలో వైకుంఠాలు
అభివృద్ధి ఉపాధి కల్పనలు

షరతులు అంగీకారాలు
సీ.ఈ.ఓ.లు రాజకీయ ప్రతినిధులు
చేతులు మార్చుకుంటున్న
కాగితం మీద కందిపప్పు
ఒప్పందాల అవగాహన పత్రాలు

రుణమను నువ్వు ఆర్థిక సహాయమను
పేరు ఏదైనా ఒక్కటే
పూల బొకే లాటి
చక్కెరపూత సంభాషణలు
రెప్పలు తెరచి ఉండగానే
సుతారంగా కనుగుడ్లను
ఒడుపుగా మాయం చేసేకాలం

ఉద్రిక్తలు వారే పెంచుతారు
యుద్ధాలు వారే చేయిస్తారు
సహాయ శిబిరాలను నిర్మించి
హెలికాప్టర్‌ మీంచి గొప్ప ఉదారతతో
నిత్యావసరాలను వారే విసిరేస్తారు

నొప్పి తెలియకుండా
ఎన్ని రకాల సుద్దులు బుద్దులు చెప్పినా
అమాయక శిశువులు స్త్రీలు వృద్ధులు
డాలర్‌ దాహానికి ఆహుతి అవుతుంటారు

శ్రమవస్తువు వినియోగదారుడు
ప్రతిదీ షోకేస్‌లో
అందంగా ప్రదర్శించి
మార్కెట్‌ చేయబడుతుంది

నాకు తెలియక అడుగుతా
రాజ్యాలకు రాజ్యాలను నడిపిస్తున్న
కుంపినీల లక్ష్యం ప్రజాసంక్షేమమైతే
దేశదేశాలు లేబర్‌ అడ్డామీద
పనికోసం వలస కూలీలుగా
ఎందుకు నిలబడుతున్నారు
-జూకంటి జగన్నాథం