ముంబయి: ఒకవేళ ప్రభుత్వ పాఠశాల ఒక కిలోమీటరు పరిధిలో ఉంటే ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (ఆర్‌టిఇ) కింద ప్రవేశాలకు మినహాయింపు ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై బాంబే హైకోర్టు సోమవారం స్టే విధించింది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని, పూర్తి విచారణ చేయాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ, న్యాయమూర్తి జస్టిస్ ఆరిఫ్ డాక్టర్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇలాంటి ఉత్తర్వులు చిన్నారులకు ఉచిత విద్యను అందించడానికి ఆటంకం కలిగిస్తాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఫిబ్రవరి 9న మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 (దీనినే ఆర్‌టిఇ కూడా పిలుస్తారు) లోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటీషన్ దాఖలయింది. ఆర్‌టిఇ ప్రకారం ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి లేదా ప్రీ-ప్రైమరీ సెక్షన్‌లో ఇబిసి, ఒబిసి చిన్నారులకు 25 శాతం సీట్లను కేటాయించాలి. వీరి ఫీజులను ప్రభుత్వం పాఠశాలలకు తిరిగి చెల్లిస్తుంది. అయితే ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రభుత్వ పాఠశాల ఉంటే ఆర్‌టిఇ అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీనిపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.