బాండ్ల వెనుక బంధం!

The bond behind the bonds!ప్రజాస్వామ్యం, పౌరహక్కుల గురించి మనమేదో ముచ్చట పడుతుంటాంగాని అలాంటివేవీ అమలులో లేక పోవడం ఓ చేదునిజం. ఎన్నికల నిర్వాహణ కోసం రాజ కీయ పార్టీలకు డబ్బు ఎక్కడ్నుంచొస్తుందో, ఎలా పంచ బడుతుందో తెలుసుకునే హక్కు దేశపౌరులకు లేదుగాక లేదు పొమ్మంటోంది మోడీ సర్కారు. ఈ ముక్క అక్కడా ఇక్కడా కాదు ఏకంగా సుప్రీంకోర్టు ముఖం మీదనే చెప్పేసింది. ఎన్నికల బాండ్లను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా న్యాయస్థానం ముందు కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ వినిపించిన వాదన చూశాక.. ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలకు, చైతన్యానికి చోటు లేకుండా పోయిందనిపిస్తోంది. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్‌ డొమైన్లో ఉండదట. ఆర్టీఐ చట్టం ద్వారా తెలుసుకునే హక్కు కూడా ప్రజలకు లేదట. రాజ్యాంగం ప్రకారం… తాము ఓటు వేసే అభ్య ర్థుల విద్యార్హతలు, గుణగణాలు, అప్పులు, ఆస్తులు, నేర చరిత్ర తదితర పూర్వాపరాలను తెలుసుకునే హక్కు పౌరు లకుంటుంది. అలాంటప్పుడు అభ్యర్థులకు నిధులెలా సమకూరుతున్నాయో తెలుసుకునే హక్కు మాత్రం లేదనడంలోని మతలబేమిటి?
రాజకీయపార్టీలకు నల్లధనం చేరకుండా అడ్డుకునే పేరుతో, పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత కోస మంటూ మోడీ ప్రభుత్వం ఈ ఎలక్టోరల్‌ బాండ్స్‌ పథకాన్ని తీసుకొచ్చింది. నిజంగా ప్రభుత్వ ఉద్దేశం అదే అయితే విభే దించాల్సిందేమీ లేదుగానీ, ఆచరణలో జరుగుతున్న దేమిటి? పారదర్శకత అంటే ప్రతిదీ ప్రజల ముందుంచ డమే కదా. కానీ ఈ బాండ్ల చుట్టూ గోప్యత అనే సంకెళ్లు విధించిందీ ప్రభుత్వం. ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు? ఎవరికిస్తున్నారు? అనే వివరాలను ప్రజల ముందుంచడం మహా అపరాధమట! ఎందుకంటే ఈ వివరాలు తెలిస్తే రాజకీయపార్టీల నుండి దాతలకు ఇబ్బందులెదురవు తాయట! అలాగని ఇక్కడ పూర్తిగా గోప్యతే ఉందనుకుంటే పొరపాటే. ఏలినవారికి మాత్రం మినహాయింపు! ఎలా గంటే.. ప్రభుత్వ బ్యాంకుల దగ్గర బాండ్లు కొంటున్నవారు, తీసుకుంటున్న వారు.. ఇద్దరి వివరాలూ ఉంటాయి. అంటే ప్రభుత్వం… ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అధికారపక్షం ఏదో ఒక మార్గంలో ఈ వివరాలను తెలుసుకోవచ్చు, విరాళాలు ఇచ్చే వారిని ప్రభావితం కూడా చేయొచ్చు. ఆ ప్రభావం మోతాదు ఎంతంటే, ఈ మొత్తం స్కీంలో నాలు గింట మూడొంతులు, అంటే దాదాపు 75 శాతం నిధులు అధికారపక్షమైన బీజేపీకి మాత్రమే అందేంత! కాంగ్రెస్‌ లాంటి ప్రధాన ప్రతిపక్షానికి కేవలం 9 శాతమే దక్కేంత!! ప్రాంతీయ పార్టీల్లో కూడా అధికారంలో ఉన్న వారికే అత్యధిక నిధులు అందుతున్న వైనాన్ని పలు నివేదికలు ధృవీకరిస్తున్నాయి. అందుకే వీటిని రాజ్యాంగ విరుద్ధమైనవిగా పేర్కొంటూ, వీటి చెల్లుబాటును సవాలు చేస్తూ పిటీషన్‌లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో సీపీఐ(ఎం)తో పాటు ”ఏడీఆర్‌(అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌)” లాంటి సంస్థలు కూడా ఉండటం గమనార్హం. భారత దేశంలో ప్రజాస్వామ్య సంస్కరణలు స్థిరపడి నిలదొక్కు కోవాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఇది. గత కొంతకాలంగా మన శాసనవ్యవస్థలో పేరుకుపోతున్న అంతులేని అవి నీతిని, నేరప్రవృత్తిని బట్టబయలు చేస్తూ దేశ ప్రజలను అప్ర మత్తం చేస్తోంది. ఈ ఎన్నికల బాండ్ల విషయంలోనూ పలు ఆధారాలు, విశ్లేషణలతో కూడిన ఏడీఆర్‌ నివేదికలు ఏలిన వారి కుట్రపూరితమైన ఎత్తుగడల్ని పట్టిచూపుతున్నాయి. అంతెందుకు, 2017లో ఈ బాండ్లను మొదట ప్రవేశ పెట్టినప్పుడు, వీటి వల్ల ఎన్నికల్లో పారదర్శకత ఏర్పడటం కాదుకదా, కొరవడుతుందని ఎన్నికల సంఘం సైతం చెప్పింది. అయితే, ఏం జరిగిందో తెలియదు గానీ ఏడాది తర్వాత ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంది.
ఇక విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మా సనం కూడా ఈ ఎలక్టోరల్‌ బాండ్ల విశ్వసనీయతను ప్రశ్నిం చడం తాజా పరిణామం. ఈ పథకంలో అధికార పార్టీకే అధిక విరాళాలెందుకొస్తున్నాయి? ముడుపులను చట్టబద్ధం చేయదలిచారా? అని నిలదీసింది. అధికారంలో ఉన్న వారితో రహస్య వ్యాపారాలు చేసేందుకు, పాలకపార్టీలకు అనుకూలంగా ”క్విడ్‌ ప్రోకో”లోకి ప్రవేశించేందుకు సంపన్నులు ఈ ఎలక్టోరల్‌ బాండ్స్‌ను ఉపయోగించుకునే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకూ వివిధ పార్టీలు పొందిన విరాళాల వివరా లను రెండువారాల్లో అందజేయాలని ఆదేశిం చింది. అంతిమంగా విచారణ ముగించి రిజర్వు లో ఉంచిన ధర్మాసనం తీర్పు ఎలా ఉండబో తుందో వేచి చూడాల్సిందే గానీ… ప్రభుత్వం చెబుతున్నట్టు ఈ పథకంలో పారదర్శకత, ప్రజాస్వామ్య ప్రక్రియలంటూ ఏమీలేవని తేలి పోయింది. దేశంలో ప్రజలకు సార్వత్రిక ఓటు హక్కయితే ఇచ్చారు గాని ఎన్నికలకూ వారికీ సంబంధమే లేకుండా పోవడం విచారకరం. ఎన్నికలను కేవలం ఓ తంతుగా మార్చి.. ఏ పార్టీ అధి కారంలోకి రావాలో, వచ్చినవారు ఎలాంటి విధానాలను అవలంబించాలో కార్పొరేట్లు ముందే నిర్ణయిస్తున్నా రనడానికి ఈ ఎలక్టోరల్‌ బాండ్స్‌ ఓ ఉదాహరణ.