– ఎస్కేఎం నిరసనలో వక్తలు
– ఎస్వీకే నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు బైకు ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నుంచి మన దేశం వెంటనే బయటకు రావాలని సంయుక్త కిసాన్‌మోర్చా (ఎస్కేఎం), కార్మిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానుద్దేశించి ఎస్‌కేఎమ్ రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, వి.ప్రభాకర్, ఆర్.వెంకట్రాములు, జక్కుల వెంకటయ్య, డేవిడ్, కార్మిక సంఘాల నాయకులు భూపాల్, ఎస్‌ఎల్ పద్మ, ఎం.శ్రీనివాస్, అరుణ, మహిళా సంఘం నాయకులు ఝాన్సీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. అబుదాబీలో డబ్ల్యూటీవో కాన్ఫరెన్స్ సోమవారం ప్రారంభమైందన్నారు. మన రైతులకు ఎమ్‌ఎస్‌పీ మంజూరు చేయొద్దనీ, రైతులకిస్తున్న సబ్సిడీలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై డబ్ల్యూటీవో ఒత్తిడి చేస్తున్నదని విమర్శించారు. ప్రజలకు నేరుగా డబ్బులు బదిలీ చేయాలని ఒత్తిడి చేయడమంటే ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్నారు. డబ్ల్యూటీవో ప్రతిపాదనలు రైతులకు, పేద ప్రజలకు, ఆహార భద్రతకు, భారతదేశ సార్వభౌమత్వానికి హానికరమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డబ్యూటీఓ నుంచి వెనక్కి రావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు ఉద్యమంలో చీలికలు తేవడానికి కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలనీ, ట్రాక్టర్ల మర్మత్తుల ఖర్చులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మార్చి 14న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులను చైతన్యపరిచేందుకు పల్లెపల్లెనా పాదయాత్రలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలకతీతరంగా రైతు పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సోమన్న, కిషన్ (సీఐటీయూ), యం.హన్మేష్ (ఐఎఫ్‌టీయూ), మూడ్ శోభన్ ( రైతు సంఘం), బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ(వ్యవసాయ కార్మిక సంఘం), ఆర్.శ్రీరామ్ నాయక్, యం. ధర్మానాయక్(గిరిజన సంఘం), స్వరూప, వరలక్ష్మి, లక్ష్మి బాయి, పుష్ప(పీఓడబ్ల్యూ), కోట రమేష్, జావెద్ (డివైఎఫ్‌ఐ), కేఎస్‌ప్రదీప్ (పీవైఎల్), తాళ్ళ నాగరాజు, అశోక్ రెడ్డి, లెనిన్ గువేరా (ఎస్‌ఎఫ్‌ఐ) ఎస్.నాగేశ్వరావు, మహేష్, అనిల్ (పీడీఎస్‌యూ)తదితరులు పాల్గొన్నారు.