– ఐదు రాష్ట్రాల ఫలితాలను శాసించేది వారే
– నేతల తలరాతలు మార్చేదీ రైతన్నలే
– ఎంఎస్‌పీ, ఆహారధాన్యాల సేకరణ విధానాలే కీలకం
తెలంగాణ మినహా నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. తెలంగాణలో నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో తలపడుతున్న పార్టీల తలరాతలను మార్చే శక్తి ఎవరికి ఉన్నదని ప్రశ్నించుకుంటే ఒకే ఒక సమాధానం వస్తుంది. అదే అన్నదాత. ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న రైతన్నకు ఫలితాలను ప్రభావితం చేసే సత్తా ఉంది. అదెలా అంటే…
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ మరోసారి విజయం సాధిస్తుందని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగినా…అక్కడ కూడా కాంగ్రెస్‌కే కొంత మొగ్గు ఉన్నదని ఒపీనియన్స్ పోల్స్, మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎదురు దెబ్బలు తినడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం అన్నదాతల ఆగ్రహమే. మధ్యప్రదేశ్‌లో రైతులు అనేక రకాల ఒత్తిడులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా వ్యవసాయ రంగం రానురానూ కుదేలవుతోంది.
ఈ రెండు అంశాలే కీలకం
రైతులు తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారా లేదా అనే విషయాన్ని బట్టి వారి ఆర్థిక స్థితిగతులను అంచనా వేయవచ్చు. వరి, గోధుమ వంటి ముఖ్యమైన పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) నిర్ణయిస్తుంది. అయితే ఇవి రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న ధరల కంటే తక్కువగా ఉంటున్నాయి. ఇక రెండో విషయమేమంటే ప్రభుత్వ సంస్థలు రైతుల నుండి తగినంత పంట ఉత్పత్తులను సేకరిస్తున్నాయా లేదా అనేది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు ఎంఎస్‌పీ కంటే తక్కువకే వాటిని కొనుగోలు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం గరిష్ట స్థాయిలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.
ఎన్నికలు జరిగిన నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన సేకరణ విధానాలను పరిశీలించడం అవసరం. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నేరుగా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. ఆ విధంగా కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం వినియోగిస్తున్నాయి. అల్పాదాయ వర్గాలకు సరఫరా చేయగా మిగిలిన ఆహార ధాన్యాలను ఎఫ్‌సీఐకి అందజేస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో అలా…
మధ్యప్రదేశ్ విషయానికి వస్తే 2019 -20 వరకూ సగటున సంవత్సరానికి 64-73 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించింది. కోవిడ్ సమయంలో అంటే 2020- 21, 2021- 22లో రెండు సంవత్సరాల పాటు సేకరిం చిన గోధుమలు రెట్టింపై 129 లక్షల మెట్రిక్ టన్నుల కు చేరాయి. ఆ సమయం లో అదో సంచలనం. గోధుమ సేకరణలో పంజాబ్ ను సైతం మధ్యప్రదేశ్ దాటే సింది. అయితే 2022-23లో గోధుమల కొనుగోలు ఒక్కసారి గా 56 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. గోధుమలను ఎగుమతి చేస్తే లాభదాయక ధరలు పొందవచ్చు నంటూ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఊదరగొట్టాయి. దీంతో ఈ మాటలు నమ్మిన రైతులు ప్రభుత్వ సంస్థలకు గోధుమలను విక్రయించేందుకు సుముఖత చూపలేదు. కానీ జరిగిందేమిటి? కేంద్రం గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో రైతులు లేదా వ్యాపారుల వద్ద నిల్వలు పేరుకుపోయాయి.
2023-24లో గోధుమ సేకరణ కొంత మెరుగుపడి 71 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అయినప్పటికీ రెండు సంవత్సరాల క్రితం జరిగిన సేకరణతో పోలిస్తే ఇప్పటికీ 45% తక్కువగానే ఉంది. ఈ పరిణా మాల కారణంగా ప్రభుత్వ పని తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. మార్కెట్ ధర, ఎంఎస్‌పీ మధ్య వ్యత్యాసానికి పరి హారంగా ప్రభుత్వం ప్రక టించిన పథకాలు, కార్య క్రమాల అమలు కూడా ఆశాజనకంగా లేదు.
రాజస్థాన్‌లో కనిపించిన అసంతృప్తి
ఇక రాజస్థాన్ విషయానికి వస్తే అక్కడ నీటిపారుదల సౌకర్యాలు బాగా మెరు గుపడ్డాయి. ఫలితంగా దిగుబడులు పెరిగాయి. అయినప్పటికీ తక్కువ నీరు అవసరమయ్యే ముతక తృణ ధాన్యాల పంటల సాగు గణనీయంగా ఉంది. కానీ రాష్ట్రంలో జొన్నలు, పెసలు వంటి తృణధాన్యాల సేకరణ చాలా తక్కువగా జరుగు తోంది. కోవిడ్ సమయంలో కొనుగోళ్లు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ ఆ తర్వాత పరిస్థితి షరా మామూలుగానే ఉంది. 2023లో గోధుమ సేకరణ జరగనే లేదు. 2023-24లో మాత్రం కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అనేక ఇతర సానుకూలతలు ఉన్నప్పటికీ రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు పారిశ్రామిక కార్మికులదీ అదే దారి. రాజస్థాన్‌లో పని పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
వేతనాలు కూడా తక్కువే. రాష్ట్రంలో అంతకుముందున్న బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన కార్మిక చట్టాలు గెహ్లాట్ హయాంలో కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉన్నదని వార్తలు వస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో ఇలా…
అదే సమయంలో మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం సేకరణ నిలకడగా పెరి గింది. 2018-19లో 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 2022-23లో 88 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది. దీనికితోడు ధాన్యానికి ప్రకటిం చిన ఎంఎస్‌పీ కంటే క్వింటాలుకు రూ.600 అదనంగా చెల్లిం చింది. ఇన్‌పుట్ సబ్సిడీగా రైతులకు ఎకరానికి రూ.9,000 అందజేసింది. దీనర్థం రైతుల కష్టాలన్నీ గట్టెక్కాయని కాదు. కానీ వారికి కొంత ఊరట లభించింది. ప్రభుత్వం అను సరించిన ఈ విధానాల వల్లే రైతన్నలు భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
సేకరణ బాగానే ఉంది కానీ…
తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ధాన్యం సేకరణ గణనీయంగా పెరిగింది. 2014-15లో కేవలం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరగ్గా 2022-23 నాటికి 132 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు కూడా బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచాయి. అయితే అవినీతి, బంధుప్రీతి, అట్టడుగు వర్గాల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలు ఆ పార్టీ విజయానికి ప్రతి బంధకంగా మారాయి. బీఆర్‌ఎస్ పాలనలో భూమి లేని పేదలు, కౌలు రైతులు, దళితులు, ఆదివాసీలు నిరాదరణకు గురయ్యారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వానికి మంచి పేరే వస్తున్నప్పటికీ మిగిలిన అంశాల్లో దాని పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంది.
ఏదేమైనా ఆయా రాష్ట్రాల్లో పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించడంలో అన్నదాతలు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ఎంఎస్‌పీని, ఆహారధాన్యాల సేకరణను పెంచాల ని, ఉత్పత్తి ఖర్చును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు చేస్తున్న ఆందోళనలు ప్రజల్లో అవగాహన పెంచాయి. ఇది ఓటింగ్‌లో ప్రతిబింబిస్తుందని అంచనా. రైతు, కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు జిల్లా కేంద్రాలు, రాష్ట్రాల రాజధానుల్లో జరిపిన ‘మహాపడావ్’లు విజయవంతమయ్యాయి. ప్రజల్లో చైతన్యం కలిగించాయి.