– సింధు, లక్ష్య, గాయత్రి-ట్రెసాలకు టైటిల్స్
– సయ్యద్ మోడీ ఇండియా ఓపెన్
లక్నో (ఉత్తరప్రదేశ్) : సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్‌లో భారత షట్లర్లు మెరిశారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మన షట్లర్లు హవా చూపించారు. ఐదు విభాగాల్లో ఏకంగా మూడింట విజేతలుగా అవతరించారు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు 21-14, 21-16తో చైనా షట్లర్ యు యును చిత్తు చేసింది. వరుస గేముల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించి సుదీర్ఘ విరామం అనంతరం టైటిల్ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ లక్ష్యసేన్ చాంపియన్‌గా నిలిచాడు. 21-6, 21-7తో ఇండోనేషియా షట్లర్ జియపై ఏకపక్ష విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలి జంట సైతం అదరగొట్టారు. 21-18, 21-11తో చైనా జోడీ జింగ్, లిలపై వరుస గేముల్లో విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో పృథ్వీ, సాయి ప్రతీక్ జోడీ 14-21, 21-19, 17-21తో మూడు సెట్ల పోరాటంలో చైనా జోడీ చేతిలో ఓటమి చెందారు. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ పోరులో ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టోలు సైతం 21-18, 14-21, 8-21తో థారులాండ్ జంట చేతిలో పోరాడి ఓడారు.