ప్రపంచానికి భౌతికవాదం, బౌద్ధం, హేతువాదం గురించి చెప్పిన మన భారతదేశం ఎప్పుడో విశ్వగురువు అయ్యింది. వాటిని నాశనం చేసి మనుషుల్ని విభజించి, తమ కల్పిత గాధలు, అబద్దాలు ప్రచారం చేసుకున్న వైదిక ధర్మ మనువాదులు – ఇప్పుడు తాము విశ్వగురువులమై పోయామని చెప్పుకుంటూ అపహాస్యానికి గురవుతున్నారు. బుద్ధుడు చెప్పిన ‘వేదన’ అనే పదం నుండే మనువాదులు ‘వేదాలు’ అనే పదం సృష్టించుకున్నారు. ప్రపంచంలో మతాలు పుట్టకముందే, ఈ దేశంలో బౌద్ధం విలసిల్లింది. అందువల్ల పురాతన లేదా సనాతన ధర్మం అంటే ఏదవుతుందీ? బౌద్ధమే అవుతుంది! ప్రపంచంలో అత్యధికంగా తయారవుతున్నవీ, అనేక రకాలుగా దేశ విదేశాలకు వ్యాప్తిస్తున్నవీ బుద్ధ విగ్రహాలే. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో బుద్ధుడి విగ్రహాలు పెట్టుకుంటున్నారు. అది మంచి పరిణామం. అయితే, ఆయన బోధనల్లోంచి కొన్నయినా స్వీకరించి ఆచరిస్తూ ఉంటే సమాజాన్ని కొంత బాగు చేసినవార మవుతాం. ఇక, మన దేశ నాయకుల్ని చూస్తే నవ్వొస్తుంది. విదేశాల నుండి ఏదేశ నాయకుడు వచ్చినా, ఓ బుద్ధ విగ్రహం బహుమతిగా ఇచ్చి సాగనంపుతుంటారు. ఆ పద్ధతి బావుంది కానీ, బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయరు. పైగా దేశం ‘విశ్వగురువు’ అయిపోవాలని కలలు కంటుంటారు.
బౌద్ధం భారతదేశాన్ని ఎన్నో విధాలుగా సంస్కరించింది. వైదిక మతస్థులు యాగాలు, బలులు వంటి హింసాత్మక కార్యాలు చేస్తున్నప్పుడు బౌద్ధం తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా ‘అహింస’ ఈ దేశంలో తొలిసారి ప్రవేశించింది. జీవహింస గురించి ఆలోచింపజేసింది, దాన్ని ప్రతిష్టాత్మకమైన విలువగా మార్చింది. జీవ కారుణ్యం గురించి చెప్పిందీ బౌద్ధమే! వైదిక ధర్మం కాదు. దేశంలో మూఢనమ్మకాల్ని చాలా వరకు తొలగించగలిగిందీ బౌద్ధమే! పాలి భాష, ఇంకా ఇతర స్థానిక భాషలు బౌద్ధ ప్రచారం వల్ల అభివృద్ధి చెందాయి. వ్యాప్తి కూడా చెందాయి. సంస్కృతం ఎప్పుడూ జనభాషగా లేదు. ఇవన్నీ కాకుండా బౌద్ధుల శిల్పకళ, వైజ్ఞానిక విషయాలు, బౌద్ధ విశ్వవిద్యాలయాలు దేశాన్ని ప్రగతి పథాన నడిపించాయి. సాంచి, బర్వాల్ వంటి చోట్ల అవశేషాలుగా పడి ఉన్న శిల్పాలన్నీ బౌద్ధులు చెక్కినవే. వేల వేల స్థూపాలు దేశ వ్యాప్తంగా అద్భుత శిల్పకళతో విరాజిల్లుతున్నాయంటే అందుకు కారకులు ఆనాటి బౌద్ధ శిల్పులే కదా? వాటి రూపురేఖలు మార్చి, విగ్రహాలు మార్చి, బౌద్దారామాలు మార్చి హిందూ దేవీ దేవతలుగా దేవాలయాలుగా మార్చుకున్నది – వైదిక ధర్మ ప్రభోధకులన్నది చరిత్ర రుజువు చేసిన సత్యం. నాటి నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించాయి. జ్ఞాన దీపాలు వెలిగించాయి. ఆ రోజుల్లోనే అవి రెసిడెన్షియల్ యూనివర్సిటీలు. అందువల్ల దేశంలో తొలి విద్యా సంస్థలు ఏవీ అంటే… అవి బౌద్ధులవే! అంతే కాదు, తొలినాటి భారతీయ వైజ్ఞానికులంతా బౌద్దులే. ఆర్యభట్టు లాంటి వైజ్ఞానికుల చిత్రాలకు నామాలు పెట్టి, వారంతా బ్రాహ్మణ వాదులయినట్లు ప్రచారం చేసుకోవడం… తర్వాత కాలాలలో జరిగింది. ఆ రకంగా భారతదేశం ప్రగతిపథంలోకి రావడానికి బౌద్ధం పాత్ర ఎంతో ఉంది. ఈ దిశగా విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉంది.
బుద్ధుని మరణం తర్వాత, బౌద్ధ భిక్కులు, సన్యాసులు, బౌద్ధం పట్ల ఆసక్తి గల వారు అంతా కలిసి నాలుగు సార్లు సమావేశమయ్యారు. అంటే నాలుగు మహాసభలు జరిపారు. మహాసభను వారు ‘మండలి’ అని వ్యవహరించేవారు. అక్కడ వారు తీసుకున్న నిర్ణయాలు బౌద్ధం మీద చాలా ప్రభావం చూపాయి. ఒకటవ బౌద్ధ మండలి: సాధారణ శకానికి పూర్వం 483 (బిసిఈ)లో రాజగృహలోని సప్తపర్ణి గుహలో మహాకశ్యప అధ్యక్షతన జరిగింది. ఈ మండలిలో బుద్ధుని బోధనల్ని రెండు పిటకాలుగా విభజించారు. 1. వినయ పిటక – దీన్ని ఉపాలి చదివి వినిపిస్తే 2. సుత్త పిటకను ఆనందుడు పఠించాడు. వీరిద్దరూ బుద్దుడిప్రియ శిష్యులు. వినయ పిటకలో సన్యాసుల, సన్యాసినుల జీవితానికి సంబంధించిన ప్రవర్తనా నియమావళి-క్రమశిక్షణ గురించి ఉంది. ఇక బుద్ధుని ప్రధాన బోధన (ధమ్మం) సుత్తపిటకలో ఉంది. ఇది 5నికాయలుగా విభజింపబడింది. 1. దిఘనికాయ 2. మజ్జిమ నికాయ 3. సంయుత్త నికాయ 4. అంగుత్తర నికాయ 5.ఖుద్దక నికాయ. ఈ తొలి బౌద్ధ మండలి జరిగినప్పుడు అక్కడ రాజు – హర్యాంక వంశపువాడైన ఆజాత శత్రు.
రెండో బౌద్ధమండలి: మొదటి బౌద్ధమండలి జరిగిన తర్వాత వంద సంవత్సరాలకు రెండో బౌద్ధమండలి జరిగింది. ఇది వైశాలిలోని చుల్లవంగలో సాధారణ శకానికి ముందు 383(బిసిఈ)లో సబకామి అధ్యక్షతన జరిగింది. అప్పుడే బౌద్ధ అనుచరులు 1. స్థవిరవాద 2. మహా సాంఘికులుగా విభజింపబడ్డారు. ఆ కాలానికి రాజ్యమేలుతున్నది శిశునాగ వంశానికి చెందిన కాలశోకుడు. మూడో బౌద్ధ మండలి: రెండవ బౌద్ధ మండలి తర్వాత 133 ఏళ్ళకు అంటే సాధారణశకానికి ముందు 250(బిసిఈ)లో జరిగింది. పాటలీపుత్రలోని అశోకరామ విహార్లో – అశోక చక్రవర్తి రాజ్యమేలుతున్న కాలంలో జరిగింది. మొదటి బౌద్ధ మండలి తర్వాత 233ఏళ్ళకు ఈ మూడవ బౌద్ధమండలి జరిగింది. అంటే వినయపిటక, సుత్త పిటకల తర్వాత మూడవదైన అభిదమ్మ పిటక వెలుగు చూడడానికి అన్నేళ్ళు పట్టింది. ఇందులో తాత్త్విక విశ్లేషణ, పండిత కార్యకలాపాలు, సన్యాసుల బోధన మొదలైన అంశా లున్నాయి. వీటిని అశోకుడి కాలంలోనే సంకలనం చేశారు.
నాలుగవ బౌద్ధమండలి: మూడవ మండలి తర్వాత, నాలుగవది జరగడానికి 322 సంవత్సరాలు పట్టింది. ఇది సాధారణ శకం 72(సి.ఈ)లో కాశ్మీర్‌లోని కుండలవాన్‌లో వసుమిత్ర అధ్యక్షతన జరిగింది. ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఆ సమయంలో కుషాణ వంశానికి చెందిన కనిష్కుడు రాజు. ఈ నాలుగు బౌద్ధ మండలులు జరగడానికి సుమారు 555ఏళ్ళు పట్టింది. బౌద్ధానికి సంబంధించి మూడుపిటకలతో పాటు ముఖ్యమైనవి మరికొన్ని ఉన్నాయి. అవి దివ్యవదన, దీపవంశ, మహావంశ, మిలింద్‌పన్హా మొదలయినవి.
సాధారణ శకానికి ముందు భారతదేశంలో అత్యధికులు మాట్లాడేభాష పాలి. బౌద్ధ ప్రచారమంతా ఆ భాషలోనే సాగింది. స్వయంగా బుద్ధుడే తన బోధనలన్నీ నాటి ప్రజల భాషలో కొనసాగించాడు. అయితే సాధారణ శకం రెండవ శతాబ్దం కనిష్కుని పాలనాకాలంలో కొన్ని మార్పులు జరిగాయి. ఆయన కాలంలో జరిగిన నాలుగవ బుద్ధ మండలిలో మెల్లగా సంస్కృతం ప్రవేశించింది. వైదిక మత ప్రచారకుల ప్రభావం వల్ల, సంస్కృతం ఆనాటి పండితుల మధ్య బాగా వ్యాపించి ఉంది. అందువల్ల, ఆ భాషను మొత్తానికి మొత్తంగా పక్కన పెట్టలేక పోయారు. క్రమంగా సంస్కృతం దాని ప్రభావాన్ని చూపుతూ, బౌద్ధంలోని మహాయాన శాఖలో తిష్టవేసింది. ఫలితంగానే బుద్ధ ప్రతిమను పూజించడం, ఇతర చిత్రపటాలకు పూజలు చేయడం ప్రారంభమైంది. బౌద్ధం హిందూ మతం వైపు మొగ్గు చూపుతోందని సామాన్య ప్రజలు కూడా విశ్వసించసాగారు. బ్రాహ్మణుల ఆరాధన, సంక్షిష్టమైన ఆచారాలు బౌద్ధంలో ప్రవేశించాయి. అసలైతే, పూజల్ని ఆరాధనల్ని, భజనల్ని బౌద్ధలు తీవ్రంగా వ్యతిరేకించాలి. కానీ, ఆ పని జరగక పోవడం వల్ల – బౌద్ధంలోని ఒక శాఖ బ్రాహ్మణవాద ప్రభావానికి గురైంది. ఫలితంగానే, దశవతారాలలో బుద్ధుణ్ణి చేర్చుకోవడం, బుద్ధుడి జీవిత కథను అభూత కల్పనలతో తిరగరాయడం జరిగి ఉంటుంది. ఏమైనా బౌద్ధపతనానికి గల కారణాలల్లో సంస్కృతం కూడా ఒకటి – అని చెప్పాలి! కాలక్రమంలో బౌద్ధంలో అనేక శాఖలు ఏర్పడ్డాయి. అవి ఈ విధంగా ఉన్నాయి…
1. హీనయానం: అంటే తక్కువ వాహనం. ఈ శాఖ కేవలం బుద్ధుని బోధనల్ని మాత్రమే నమ్ముతుంది. ఇతర ప్రభావాలకు లోనుకాదు. విగ్రహారాధనను నమ్మదు. స్వీయ క్రమశిక్షణతో, ధ్యానంతో వ్యక్తిగత ‘నిర్వాణ’ను సాధించవచ్చని చెపుతుంది. హీనయానంలోని మరో శాఖ తేరవాడ. ఇది బుద్ధుని బోధనలకు మరీ దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువగా ఉన్నది తేరవాడనే. శ్రీలంక, కంబోడియా, లావోస్, మయన్మార్, థారులాండ్‌లలో ఇది ఎక్కువగా ఉంది. బౌద్ధంలో అత్యంత పురాతన శాఖ.
2. మహాయానం: ఈ పదం సంస్కృతం నుండి ఉద్భవించింది. మహాఅంటే గొప్ప. యానం అంటే వాహనం / ప్రయాణం. ఈ శాఖ బుద్ధుని విగ్రహారాధనను నమ్ముతుంది. స్వర్గాన్ని కూడా నమ్ముతుంది. వైదిక మత ప్రభావం వల్ల అందులోని ఎన్నో అంశాలు ఈ శాఖ స్వీకరించింది. మహాయానం ఉత్తర భారతదేశంలోని కశ్మీర్‌లో ఉద్భవించింది. మధ్య, తూర్పు, ఆగేయాసియా ప్రాంతాలలో ఇది బాగా వ్యాపించింది.
3.వజ్రయానం: దీన్ని తాంత్రిక బౌద్ధం అంటారు.THE VEHICLE OF THUNDER BOLT. భారతదేశంలోనే సాధారణ శకం 900(సి.ఈ)లో ఇది అభివృద్ధి చెందింది. ఇందులో రహస్య అంశాలు, క్లిష్టమైన ఆచారాలు ఉంటాయి. కాలానుగుణంగా వైదిక మత ప్రభావం, సంస్కృత భాషా ప్రభావం వల్ల అనేక మార్పులకు గురైంది. పన్నెండవ శతాబ్దం ఆరంభంలో బౌద్ధసంఘాలలో అవినీతి చొరబడింది. విలువైన బహుమతులు స్వీకరించడం, సుఖలాలసకు అలవాటు పడటం జరిగింది. బుద్ధుడి బోధనలు మరిచిపోయిన సన్యాసులు అధోకరణానికి, ప్రభోదాలకూ అలవాటు పడ్డారు. హీనయాన, మహాయాన, వజ్రయాన శాఖలు మాత్రమే కాకుండా తంత్రయాన, సహజయాన వంటిశాఖలు కూడా ఏర్పడ్డాయి. ఆనందాలవైపు ఆకర్షించబడి, నైతికతను వదిలేసి, బౌద్ధంలోని కొన్ని శాఖలు వాస్తవికతకు దూరంగా వెళ్ళిపోయాయి. ఇలాంటి ఎన్నో కారణాలు బౌద్ధం పతనం కావడానికి కారణాలయ్యాయి.
4. నవయానం: ఆధునిక భారతదేశంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆరులక్షల మందితో బౌద్ధం స్వీకరించారు. ఈ దేశానికి ఒక దిశా నిర్దేశం చేశారు. ఆయన 132వ జన్మదినం సందర్భంగా 14 ఏప్రిల్ 2023 నాడు గుజరాత్‌లో యాభైవేల మంది బౌద్ధం స్వీకరించారు. స్వయం సైనిక్ దళ్ (ఎస్‌ఎస్‌డి) కృషి వల్ల ఒకకోటి మంది బౌద్ధం స్వీకరించే అవకాశం ఉంది. దీన్ని అంబేద్కర్ ‘నవయానం’ అన్నారు. ఇందులో ముఖ్యమైన సూత్రాలు ఏవంటే… 1. మనుషులందరిదీ ఒకే స్థాయి. 2. నైతికతే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. ఇలాంటి విషయాల వల్ల వారి వారి మతాల, కులాల అడ్డుగోడల్ని కూల్చుకుని జనం బౌద్ధం స్వీకరించడానికి ముందుకొస్తున్నారు. వీరిలో ముస్లింలు కూడా ఉన్నారు. మత విద్వేషాలు రేపి, జనాన్ని విడగొట్టి, అధికారంలో కొనసాగుదామనుకునే వారికి – దేశంలో క్రమంగా వస్తున్న ఈ మార్పు, గట్టిగా బుద్ది చెపుతుంది – సందేహం లేదు.
(బుద్ధుడు తొలి ఉపదేశం ఇచ్చిన రోజే గురుపూర్ణిమ. అదే ఆషాడ పూర్ణిమ-3 జులై)
– వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు