”మహాత్మా గాంధీ అంటే కుల, మత, లింగ సమానత్వాన్ని ఆకాంక్షించిన వ్యక్తి, అతను ఎన్ని అంశాలు మాట్లాడినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, అసమానతలు తొలగించడం, సమానత్వం సాధించడమే గాంధీ మొదటి ఆశయంగా చూడాలి.” అంటూ గాంధీజీ మెమోరియల్ స్పీచ్‌లో మార్క్సిస్టు యోధుడు కా. పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడిన మాటలివి.
న్యాయవాద వృత్తిలో భాగంగా ఒక ఏడాది కోసం దక్షిణాఫ్రికా వెళ్లి, 21 ఏండ్లు అక్కడే జీవించారు గాంధీజీ. భారతీయులపై అక్కడ జరుగుతున్న అనేక వివక్షతలపై పోరాడారు. సత్యాగ్రహాన్ని మార్గంగా ఎంచుకున్నారు. హక్కుల కోసం చేసిన పోరాటాలు కొంత మేరకు ఫలితాల్ని కూడా సాధించాయి. గాంధీజీకి రైలులో జరిగిన అవమానం గురించి చరిత్ర పుస్తకాలు చెబుతాయి. స్వయంగా వివక్షతను అనుభవించి దానికి వ్యతిరేకంగా పోరాడారు ఆయనó. 1914లో భారత దేశానికి వచ్చి, అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. తన జీవితంలో ముఖ్యమైన సూత్రాలు, సమానత్వం, సోదర భావం, అహింస, సత్యాగ్రహం. వీటిని ఆచరించి చూపెట్టాడు. చంపారన్ ఉద్యమంతో మొదలై, ఖిలాఫత్, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి స్వాతంత్య్రోద్యమాలకు నాయకత్వం వహించారు గాంధీజీ. స్వదేశీ నినాదంతో దేశాన్నంతా ఏకతాటిపైకి తీసుకొచ్చారు. విదేశీ వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. వృత్తిదారుల పనిముట్టుగా ఉన్న చరఖాను స్వాతంత్య్రోద్యమ చిహ్నం చేశాడు గాంధీ. అప్పటి ఉన్నత వర్గాల గుంపుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని, సామాన్య జనానికి చేరువ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు, రైతులకు కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిథ్యం కల్పించింది మహాత్ముడే. ఏ సోషల్ మీడియా లేని కాలంలో దేశాన్ని ఒక్కమాటమీద నడిపించిన సమ్మోహన శక్తి అతను. సాధించు లేదా – మరణించు అనే నినాదం ఎత్తుకుని చివరి ఘట్టంలో స్వాతంత్య్రం కోసం దేశ యువత లంఘించేలాగా స్ఫూర్తి నింపారు. గాంధీజీ జీవితంలో రెండు సార్లు సుదీర్ఘకాలంగా జైలు జీవితాన్ని గడిపాడు. 1922లో సహాయ నిరాకరణోద్యమంలో రెండేండ్లు, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో మరో రెండేండ్లు జైలు జీవితాన్ని అనుభవించారు. అనేక సందర్భాల్లో నిర్భందాలను ఎదుర్కొన్నారు. హత్యాయత్నాలకు గురయ్యారు. 33 ఏండ్లపాటు భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో కలికితురాయిగా నిలిచారు. ప్రపంచ స్వాతంత్య్రోద్యమాల చరిత్రలో ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి, అది విజయం సాధించాక పదవులు తీసుకోకుండా ఉన్న అరుదైన వ్యక్తి గాంధీజీ. అలాంటి వ్యక్తిపౖౖె తూటా పేల్చిన క్రౌర్యం ఎక్కడిది? ఎవరిది?
దేశాన్ని ముక్కలు చేయొద్దని..
మత సామరస్యం, పరమత సహనం ఆయన నినాదాలే కాదు. విధానాలు కూడా. భారతదేశాన్ని విభజించడానికి ససేమిరా అంగీకరించలేదు గాంధీ. మతం ప్రాతిపదికన దేశ విభజన ఎంతమాత్రం సమంజసం కాదనేది గాంధీజీ బలమైన అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా తన వాదనను వినిపించారు ఆయన. దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టడానికి శతవిధాల ప్రయత్నించారు. ఒక దశలో పరిస్థితి చెయ్యిదాటి పోతున్న సందర్భంలో గాంధీజీ సమ్మతించక తప్పలేదు. కానీ దేశ విభజన గాంధీజీని ఎంతగానో కృంగదీసింది. 1947, ఆగస్టు 15వ తేదీన దేశమంతా స్వాంతంత్య్ర సంబరాలల్లో మునిగిపోతే, గాంధీజీ మాత్రం కలకత్తాలోని ఒక దళితవాడను శుభ్రంచేస్తూ గడిపారు. దేశ విభజన అనంతరం మత సామరస్యం కోసం పరితపించారు గాంధీ. విభజన తర్వాత కూడా ఇరు దేశాలు స్నేహభావంతో మెలగాలని కోరుకున్నారు. ఆ సందర్భంగా తలెత్తిన అనేక వివాదాలను పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. మత హింసను ఆపటం కోసం తన చివరి ఆమరణ నిరాహర దీక్ష చేశారు. ప్రభుత్వం, నాయకులు ఎంత బతిమిలాడినా వినలేదు. చివరికి హిందూ, ముస్లిం, సిక్కు నాయకులు కలిసి ఉంటామని ఒప్పుకున్నాకే నిరాహార దీక్ష విరమించారు. ఆ సందర్భంగా గాంధీ మీద మతోన్మాదులు ఒకసారి హత్యాయత్నం చేశారు. తృటిలో బయట పడ్డారు. దేశం కోసం జనం కోసం మరణానికి ఎదురెళ్లినవాడు గాంధీజీ.
వివాదాలు
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఉరిశిక్ష రద్ధు చేయడానికి ప్రయత్నించలేదనేది గాంధీపైన ప్రధాన విమర్శ. ఐతే భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు చేయాలని వైస్రారు లార్డ్ ఇర్విన్‌కు లేఖ రాశారు గాంధీ. ‘ఉరిశిక్ష రద్దు చేస్తే శాంతియుత వాతావరణం స్థాపించ వచ్చు. శిక్ష కొనసాగితే శాంతి సామరస్యం ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు’ గాంధీజీ. లేఖకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యమం చేసి ఉంటే ఉరి శిక్ష ఆగి ఉండేదని చాలా మంది భావించారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును అడ్డుకున్నారని గాంధీని బహిరంగానే విమర్శించారు అంబే ద్కర్. ముస్లింలు, నిమ్నవర్గాలకు ప్రత్యేక నియోజక వర్గాల పేరుతో దేశ ప్రజలను విభ జించే కుట్రగా గాంధీజీ దీన్ని చూశారు. దీనికి వ్యతిరేకంగా ఆరురోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేశారు. ఐతే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించి ఉంటే వారి జీవితాలు మరోలాగా ఉండేవని ఇప్పటికీ సామాజిక ఉద్యమకారులు అభిప్రాయ పడతారు.
గాంధీజీపై మతోన్మాది తూటా ఎందుకు పేలింది?
గాంధీజీని గాడ్సే ఎందుకు చంపాడంటే అనే హెడింగ్‌తో వాట్సాప్ యూనివర్సిటీ పుంకానుపుంకాలుగా సిలబస్‌ను తయారు చేసి దేశంపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. గాంధీజీ ముస్లింలకు అనుకూలమైన వైఖరి తీసుకు న్నాడని ఆరోపిస్తారు. కుల, మత వైషమ్యాలు లేకుండా అన్నదమ్ముల్లా దేశ ప్రజలు కలిసి మెలిసి బతకాలని గాంధీజీ కోరుకున్నారు. అంటరానివారుగా ఊరికి దూరంగా నెట్టబడ్డ దళితులను ‘హరిజనులుగా’ పిలిచారు గాంధీ. దళితవాడల్లో యాత్రలు చేశారు. ఆ సందర్భంగా అగ్ర కులోన్మాదులు రాళ్లు విసిరితే వాహనం దిగి కాలినడకన జనంలోకి వెళ్లారు. ‘గురిపెట్టిన మీ రాళ్లను నాకు తాకనీయండి’ అంటూ ధైర్యంగా ముందగుడు వేశారు గాంధీజీ. దళితుల్ని గుడుల్లోకి తీసుకొచ్చారు. స్వయంగా చెప్పులు కుట్టారు. కులాన్ని శాస్త్రాలు సమర్థిస్తే, అంటరానితనాన్ని పాటిస్తే వాటిని వ్యతిరేకిస్తానని చెప్పారు. హిందూ మతంలోని అసమాతలను తొలగిం చేందుకు ఎంతగానో కృషి చేశారు ఆయన. జనాన్ని కులం, మతం పేరుతో విభజించాల నుకునే వారికి ఇవి నచ్చకపోవడంలో ఆశ్చర్యమే ముంటుంది. దేశం విడిపోవాలని కోరుకున్న రెండో వ్యక్తి జిన్నా, మొదటి వ్యక్తి ఆరెస్సెస్ సిద్ధాంత కర్త సావర్కర్. గాంధీని చంపింది గాడ్సే. ఆరెస్సెస్ అక్రమ సంతానమే నాథూరాం గాడ్సే. కానీ మావాడే అని బహిరంగంగా ఒప్పుకోరు. కానీ అంతర్గతంగా గాడ్సేని హీరోగా కొలుస్తారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో! జనం ఆలోచించాలి. రెండు దేశాల సిద్ధాంతాన్ని ఇటు ఆరెస్సెస్, అటు ముస్లిం లీగ్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎత్తుకున్నాయి. ఎంతో మంది ప్రాణాల్ని బలిగొన్నాయి. చివరికి దేశాన్ని విడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఉన్మాదులకు మత సామరస్యం, దేశ ప్రజలు కలిసిమెలిసి ఉండాలనే గొప్ప భావనలు బూతులుగా కనిపించాయి. స్వాతంత్య్రోద్యమంలో చారానా చరిత్రలేని ఆరెస్సెస్, దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడంలో ప్రముఖ పాత్ర పోషించిన జాతిపితను బలితీసుకుంది.
మువ్వన్నెల జెండాను దేశానికి అరిష్టం అంటూ ఎడిటోరియల్ రాసినోళ్లు, 2002 వరకు తమ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేయని బ్యాచ్, ఇప్పుడు ఇంటింటికీ తిరంగాలు పంచే కార్యక్రమం పెట్టుకున్నారు. సాద్వీల పేరుపెట్టుకున్న మతోన్మాదులు గాంధీజీని నడిరోడ్డులో మళ్లీ మళ్లీ కాల్చేస్తు న్నారు. గాంధీని చంపిన తూటా అక్కడితో ఆగలేదు. కల్బుర్గి, పన్సారే, గౌరీ లంకేష్ లాంటి అనేకమందిని బలిగొంటూనే ఉన్నది. దళి తులు, మైనారిటీలు, ఆదివాసులపై దాడులకు తెగబడుతున్నారు మతోన్మాదులు. చట్టం, కోర్టులు కండ్లప్పగించి, ప్రజలు రాజ్యాన్నప్ప గించి చూస్తున్నారు. రాజ్యాంగ మౌళిక స్వరూపాలైన లౌకికత్వం, సోషలిజం దుర్మార్గంగా రాజ్యాంగ ప్రవేశిక నుండి వెలివేయబడుతున్నాయి. రాజ్యాంగాన్నే మార్చేస్తా మని బీజేపీ ఎంపీలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మతోన్మాదం రాజ్యమేలుతున్న సందర్భం. హంతకుడేమో స్వచ్ఛ భారత్ పేరుతో గాంధీని వాడుకుంటూ గాడ్సేకు పూజలు చేస్తున్నాడు. గాంధీ పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఏకాభిప్రాయం వెలిబుచ్చే అంశాలు అనేకం ఉన్నాయి. లౌకికత్వం, మత సామరస్యం, అంటరానితనం, అసమానతలు తొలగించుట ఇలా లిస్టు రాస్తూ పోతే మతోన్మాది మొదటి టార్గెట్ గాంధీజీనే ఎందుకయ్యాడో అర్థమౌతుంది. ఉన్మాది చేతి నుండి దేశాన్ని రక్షించి, సమానత్వంవైపు నడింపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది.
స్వాతంత్య్ర భారతదేశంలో మతోన్మాదుల చేతిలో హత్యకు గురైన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా గాంధీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్యాన్ చేయబడ్డ మొట్టమొదటి సంస్థ ఆరెస్సెస్. ‘హే..రామ్’ అంటూ చివరి శ్వాస విడిచిన గాంధీ ఎట్లా హిందూ ద్రోహి అయ్యాడో మిలియన్ డాలర్ల ప్రశ్న. రాముడి పేరుతో రాజకీయాలు చేసేవాడు రామ భక్తుడిని ఎందుకు చంపాడో నిలేయాలి. అందరివాడుగా ఉంటూ దేశ స్వాతంత్య్రోద్యమానికి ముఖచిత్రంగా ఉన్న మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, నడివీధిలో వదిలేయబడ్డ విగ్రహంగా మిగిలిపోవడం బాధాకరం. ఆలోచించాల్సిన సందర్భం.
శ్రీ సుందర్
సిఇవో, టీ10