వర్షాన్ని కాలాన్ని దాటేసి.. బంగ్లాను కొట్టేశారు

The bungalow was destroyed by the rain– రెండో టెస్టులో 7 వికెట్లతో భారత్‌ గెలుపు
– 2-0తో టెస్టు సిరీస్‌ టీమ్‌ ఇండియా కైవసం
వెలుతురు లేమి, వర్షం, తడి అవుట్‌ఫీల్డ్‌.. వెరసి కాన్పూర్‌ టెస్టు తొలి మూడు రోజుల్లో రెండు రోజుల ఆట వర్షార్పణం. నాల్గో రోజు మొదలయ్యే సమయానికి అప్పటివరకు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. చివరి రెండు రోజుల ఆటలో నాలుగు ఇన్నింగ్స్‌లు పూర్తి కావటమే అసాధ్యమైన పని. ఇక ఫలితం గురించి ఆలోచన ఎవరైనా చేయగలరా?!.
టీమ్‌ ఇండియా ఆ సాహసం చేసింది. వర్షాన్ని, కాలాన్ని దాటుకుంటూ.. బంగ్లాదేశ్‌ను జయించింది. మరో సెషన్‌ మిగిలి ఉండగానే లాంఛనం ముగించింది. 7 వికెట్ల తేడాతో కాన్పూర్‌ టెస్టులో అసమాన విజయం సాధించింది. 2-0తో టెస్టు సిరీస్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సుస్థిరం చేసుకుంది.
పిచ్‌ నుంచి సహకారం లేదు. సీమర్లకు పేస్‌ లభించలేదు, స్పిన్నర్లకు టర్న్‌ దక్కలేదు. అయినా, టీమ్‌ ఇండియా బౌలర్లు నీరసించిపోలేదు. పిచ్‌పై నెపం వేసే పని పెట్టుకోలేదు. క్రమశిక్షణతో లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు సంధించి బంగ్లాదేశ్‌ ఆట కట్టించారు. విజయం గురించి ఆలోచన చేయలేని దశలో బంగ్లాదేశ్‌ 20 వికెట్లు పడగొట్టి.. కాన్పూర్‌లో మరుపురాని విజయాన్ని అందుకుంది.
నవతెలంగాణ-కాన్పూర్‌
భారత జట్టు అసాధ్యం సుసాధ్యం చేసింది. కాన్పూర్‌ టెస్టులో 7 వికెట్ల తేడాతో మెరుపు విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 95 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే ఊదేసిన భారత్‌.. మరో సెషన్‌ ఆట మిగిలి ఉండగానే లాంఛనం ముగించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (51, 45 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో ఛేదనలో చెలరేగాడు. విరాట్‌ కోహ్లి (29 నాటౌట్‌, 37 బంతుల్లో 4 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. పేస్‌ దళపతి బుమ్రా (3/17), స్పిన్‌ మాంత్రికుడు అశ్విన్‌ (3/50), జడేజా (3/34) సమిష్టిగా మెరవటంతో బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ ఇస్లాం (50, 101 బంతుల్లో 10 ఫోర్లు), ముష్ఫీకర్‌ రహీమ్‌ (37, 63 బంతుల్లో 7 ఫోర్లు) రాణించినా.. 47 ఓవర్లలోనే బంగ్లాదేశ్‌ కథ ముగిసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలువగా.. ఆల్‌రౌండర్‌గా కదం తొక్కిన రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును దక్కించుకున్నాడు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా చేతులమీదుగా టెస్టు సిరీస్‌ టైటిల్‌ను భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుకున్నాడు.
యశస్వి దంచికొట్టగా..
లంచ్‌ సెషన్‌ అనంతరం ఛేదనకు వచ్చిన భారత్‌ ముంగిట 95 పరుగుల లక్ష్యం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (8) ఓ బౌండరీతో దూకుడు చూపించినా.. స్పిన్‌ ఉచ్చులో చిక్కాడు. శుభ్‌మన్‌ గిల్‌ (6) సైతం స్పిన్‌ వలలో ఇరుక్కున్నాడు. కానీ యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (51) దంచికొట్టాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించాడు. క్రీజు వదిలి స్వేచ్ఛగా షాట్లు ఆడిన జైస్వాల్‌.. భారత్‌ను గెలుపు వాకిట నిలిపాడు. విజయానికి మరో 3 పరుగులు అవసరమైన దశలో వికెట్‌ కోల్పోయాడు. విరాట్‌ కోహ్లి (29 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగు బౌండరీలతో మెరిసిన కోహ్లి.. యశస్వికి మరో ఎండ్‌ నుంచి చక్కటి సహకారం అందించాడు. రిషబ్‌ పంత్‌ (4 నాటౌట్‌) మెరుపు బౌండరీతో లాంఛనం ముగించాడు. 17.2 ఓవర్లలో 5.65 రన్‌రేట్‌తో భారత్‌ 98 పరుగులు చేసింది. టీ విరామానికి ముందే.. 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ మెహిది మిరాజ్‌ (2/44) రెండు వికెట్లు పడగొట్టాడు.
పేస్‌, స్పిన్‌ దండెత్తగా..
ఓవర్‌నైట్‌ స్కోరు 26/2తో ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌..మరో 120 పరుగులకే చివరి 8 వికెట్లను కోల్పోయింది. స్వీప్‌ షాట్లతో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన మోమినుల్‌ హాక్‌ (2) రెండో ఇన్నింగ్స్‌లో ఆ షాట్‌కే వికెట్‌ కోల్పోయాడు. మోమినుల్‌ రూపంలో అశ్విన్‌ మూడో వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్‌ నజ్ముల్‌ శాంటో (19, 37 బంతుల్లో 2 ఫోర్లు), షాద్‌మాన్‌ ఇస్లాం (50) నాల్గో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. సుమారు 15 ఓవర్ల పాటు భారత బౌలర్లను ఈ జోడీ విసిగించింది. క్రీజులో ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు కావటంతో జడేజాకు అప్పటివరకు బంతి ఇవ్వలేదు. కానీ బంతి జడేజా చేతికి వచ్చిన మూడు ఓవర్లలోనే బంగ్లాదేశ్‌ మూడు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికే శాంటోను క్లీన్‌బౌల్డ్‌ చేసిన జడేజా.. ఆ తర్వాతి ఓవర్లో లిటన్‌ దాస్‌ (1)ను సాగనంపాడు. షకిబ్‌ అల్‌ హసన్‌ (0) కథను తన మూడో ఓవర్లో ముగించాడు. ఈ మధ్యలో ఇస్లాంను అవుట్‌ చేసిన ఆకాశ్‌ దీప్‌.. బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించాడు. 93/3తో ఉన్న బంగ్లాదేశ్‌ 94/7తో పతనావస్థలో నిలిచింది. ఆఖర్లో ముష్ఫీకర్‌ ఓ ఎండ్‌లో నిలబడినా.. టెయిలెండర్లను బుమ్రా లేపేశాడు. మిరాజ్‌ (9), తైజుల్‌ (0)లను బుమ్రా అవుట్‌ చేశాడు. లంచ్‌ విరామానికి ఆఖరు బంతికి ముష్ఫీకర్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన బుమ్రా..టీమ్‌ ఇండియాకు గెలుపు బాటలు పరిచాడు. బుమ్రా, అశ్విన్‌, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్‌ దీప్‌ ఓ వికెట్‌ తీసుకున్నాడు.

టెస్టులకు జీవం
ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లకు గతంలో ప్రాధాన్యత లేదు. ఆఖరు రోజు, ఆఖరు సెషన్‌ వరకు విజయం కోసం తపించే తత్వం లోపించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రాకతో టెస్టు క్రికెట్‌లో సమూల మార్పులు. ప్రతి మ్యాచ్‌కు ఓ ప్రాధాన్యత ఏర్పడింది. అగ్ర జట్టు, పసికూన వ్యత్యాసమే లేదు. విజయమే లక్ష్యంగా అన్ని జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆధునిక క్రికెట్‌లో టీమ్‌ ఇండియా ఆటతీరు, దృక్పథం టెస్టులను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. కాన్పూర్‌ టెస్టులో టీమ్‌ ఇండియా ఆడిన విధానమే అందుకు నిదర్శనం. వర్షం కారణంగా మూడు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. చివరి రెండు రోజుల్లో ఫలితం తేలటం అసాధ్యమైన పని. కానీ గెలుపే లక్ష్యంగా కదిలిన రోహిత్‌ సేన.. బ్యాట్‌తో, బంతితో అసమాన ప్రదర్శన చేసింది. పిచ్‌ నుంచి సహకారం లభించిన చోట అద్భుతం చేసింది. బౌలర్లు, బ్యాటర్లు కలిసికట్టుగా కదం తొక్కటంతో కాన్పూర్‌లో భారత్‌తో పాటు టెస్టు క్రికెట్‌ సైతం గెలిచింది. ఈ టెస్టులో భారత్‌ 312 బంతులే ఆడినా.. చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బౌలర్లు బంగ్లాదేశ్‌ 20 వికెట్ల కోసం 728 బంతులు సంధించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. పరుగుల వేటలో వికెట్‌కు విలువ లేదంటూ ముందుండి భారత్‌ను గెలుపు పథాన నడిపించాడు. కాన్పూర్‌ టెస్టులో టీమ్‌ ఇండియా షో ఐదు రోజుల ఆటకు వన్నె తెచ్చింది!. టెస్టుల్లో భారత్‌ స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఈ ఏడాది ఆఖర్లో ఐదు టెస్టుల సవాల్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

స్కోరు వివరాలు :
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 233/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 285/9 డిక్లేర్డ్‌
బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: ఇస్లాం (సి) యశస్వి (బి) ఆకాశ్‌ 50, జాకిర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 10, హసన్‌ (బి) అశ్విన్‌ 4, మోమినుల్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 2, నజ్ముల్‌ (బి) జడేజా 19, ముష్ఫీకర్‌ (బి) బుమ్రా 37, లిటన్‌ దాస్‌ (సి) పంత్‌ (బి) జడేజా 1, షకిబ్‌ (సి,బి) జడేజా 0, మిరాజ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 9, తైజుల్‌ (ఎల్బీ) బుమ్రా 0, ఖలీద్‌ నాటౌట్‌ 5, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం : (47 ఓవర్లలో ఆలౌట్‌) 146.
బౌలింగ్‌: బుమ్రా 10-5-17-3, అశ్విన్‌ 15-3-50-3, ఆకాశ్‌ దీప్‌ 8-3-20-1, సిరాజ్‌ 4-0-19-0, జడేజా 10-2-34-3.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) హసన్‌ (బి) మిరాజ్‌ 8, యశస్వి జైస్వాల్‌ (సి) షకిబ్‌ (బి) తైజుల్‌ 51, గిల్‌ (ఎల్బీ) మిరాజ్‌ 6, విరాట్‌ కోహ్లి నాటౌట్‌ 29, రిషబ్‌ పంత్‌ నాటౌట్‌ 4, మొత్తం : (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 98.
బౌలింగ్‌: మిరాజ్‌ 9-0-44-2, షకిబ్‌ 3-0-18-0, తైజుల్‌ 5.2-0-36-1.