రైతన్నపై సాగు భారం..

Cultivation burden on the farmer– కాడెడ్లు కనుమరుగు..
– యంత్రాలతో దుక్కిదున్నకాలు
– రెట్టింపైన సాగు పెట్టుబడి వ్యయం
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
వ్యవసాయమే ప్రధాన జీవనాదరమైన రైతులకు ఏటా పెట్టుబడి వ్యయం పెరిగి వారికి సాగు బారమవుతొంది.వ్యవసాయ పనుల్లో రైతులకు ఆసరా నిలిచే కాడేడ్లు రానురాను  కనుమరుగైయ్యాయి. యంత్రాల, ట్రాక్టర్ల వాడకం పెరిగిపోవడం, ఇంధనాలైన డీజిల్, పెట్రోల్ రేట్లు అధికంగా పెరగడంతో పంటల సాగుకు భారంగా మారుతోంది. ట్రాక్టర్ యజమానులు గంటకు రూ.1200 నుంచి రూ.1500 వరకు డిమాండ్ చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక భారమైన వ్యవసాయ పనులు చేయిస్తున్నారు.ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న దానికి అనుగుణంగా మద్దతు ధరలు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
భారం పశుపోషణ
పశుపోషణ భారంగా మరడంతో రోజురోజుకూ వ్యవసాయంలో కాడెద్దుల వినియోగం తగ్గుతుంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో అధికశాతం కుటుంబాల్లో కాడెద్దులు ఉండగా వాటితో పనులు చేయించేవారు.ప్రస్తుతం వ్యవసాయంలో పనులు చేపట్టేందుకు కాడెద్దులు కనిపించడం లేదు. అలాగే రైతులు పశువులను పెంచడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఏ గ్రామంలో చూసిన ట్రాక్టర్ల వినియోగం పెరిగింది.
పెరిగిన యంత్రాల వాడకం
వ్యవసాయ పనులను కూలీలపై ఆధారపడకుండా ట్రాక్టర్ల ద్వారా చేపడుతున్నారు.పత్తి కర్రలను తొలగించడానికి ఎకరాకు రూ.800 నుంచి రూ.1000, దుక్కి దున్నదానికి ఎకరాకు రూ.1200 నుంచి రూ.1500 చెల్లించాల్సి వస్తుంది. విత్తనాలు వేసే సమయంలో భూమిని చదును చేయడానికి రోటవేటర్ ఎకరాకు రూ.1200 నుంచి రూ.1400 వరకు చెల్లిస్తున్నారు. గ్రామాల్లో ఒక్కసారి ట్రాక్టర్లకు డిమాండ్ పెరగడంతో కాడెడ్లు కనుమరుగైయ్యాయి. దీంతో రైతులపై సాగు భారం పడింది.