
గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లందు పట్టణానికి, ఆ పైన ఉండే గ్రామాలు, పట్టణాలు, నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం లేక ద్విచక్ర వాహనాలపై, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. ఎన్నో పర్యాయాలు కొత్తగూడెం డిపో, ఇటీవల నూతనంగా ఏర్పడిన ఇల్లందు డిపో నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అనేక మంది స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పలుమార్లు డిపోలకు వెళ్లి మరీ వినతులు మేనేజర్, ఆర్.ఎంలకు వినతులను సమర్పించారు. కానీ, కానరాని అనేక కారణాలతో ఆళ్ళపల్లి మండలానికి బస్సు సౌకర్యం అడియాశగానే ప్రజలకు గత కొన్ని సంవత్సరాలుగా మిగిలింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాయం రామనర్సయ్య, సీనియర్ నాయకులు మొహమ్మద్ అతహార్, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య, కోశాధికారి తులం ముత్తిలింగం, కరకపల్లి సుధాకర్, బుర్ర వెంకన్న వంటి నాయకులు మండల ప్రజల రవాణా సమస్యను స్థానిక పినపాక, ఇల్లందు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో సోమవారం ఇల్లందు ఆర్టీసీ డిపో నుంచి ఆళ్ళపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామానికి బస్సు రావడంతో స్థానిక జనం చూసి మురిసిపోయారు. చాలా రోజుల తర్వాత ఆర్టీసీ బస్సు మండలానికి రానుండటంతో స్వయంగా ఇల్లందు డిపో ఇన్చార్జి మేనేజర్ సంజీవరాణి బస్సులో ప్రయాణం చేశారు. అదేవిధంగా ఇల్లందు నుంచి ఆళ్ళపల్లి మండలానికి రవాణా సౌకర్యాన్ని పరిశీలించారు. చాలా రోజుల తర్వాత వచ్చిన బస్సుకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోరణాలు కట్టి, మేనేజర్ కు స్వాగతం పలికారు. తొలిరోజే మండలం నుంచి ఇల్లందుకు ప్రయాణికులు బస్సు నిండుగా ఎక్కడంతో డిపో మేనేజర్ సైతం ఆశ్చర్యచకితులు అయ్యారు. ఆక్యూపెన్సీ ఎక్కువ ఉండటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.