సీపీఎస్‌ను రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలి

– సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌)ను రద్దు చేస్తూ ఈనెల 31న నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్‌ రద్దు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు 57ను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. 2004, సెప్టెంబర్‌ ఒకటి కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలై ఆ తర్వాత నియామకం అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సీపీఎస్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.