క్యాడర్‌ టీడీపీ వెంటే…

– బాబుకు బెయిల్‌ రావడంతో హర్షాతిరేకాలు
– ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద శ్రేణుల హడావిడి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్‌
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్‌రావటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్టీఆర్‌భవన్‌వద్ద శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. కాగా, ఎన్నికలలో పోటీచేయాలనుకున్న కొంత మంది నేతలు తప్ప ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా టీడీపీలోనే ఉండి… బాబు ఆదేశాలమేరకు పనిచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామాతో టీడీపీ అతలాకుతలం అవుతుందని అందరూ అనుకున్నారు. బీజేపీతో పొత్తుకు ఇప్పటికి ఆ పార్టీ శ్రేణులు ససేమిరా అనే పరిస్థితే ఉంది. జ్ఞానేశ్వర్‌ సైతం పార్టీ తెలంగాణ ఎన్నికలలో పోటీచేయాలని భావించారు. ఎక్కువమంది బీసీలకు అధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం బీసీల పార్టీ అని నిరూపించాలని ఆశించారు. అయితే ఏపీ రాజకీయాల నేపథ్యంలో చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో ఆ పార్టీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకోవాల్సి వచ్చిందనే వ్యాఖ్యానాలు ఆ పార్టీ సీనియర్‌ నేతల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌తోపాటు.. కొంతమంది పార్టీని వీడటం వల్ల వచ్చే నష్టమేమీ లేదని నేతలు అంటున్నారు.