కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, వారి భూములను ఆక్రమించారన్న ఆరోపణలకు సంబంధించిన వ్యవహారాన్ని కలకత్తా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలు తనను కలవరపాటు, వేదనకు గురిచేశాయని జస్టిస్ అపుర్బ సిన్హా రారు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.
ఈ కేసు ఈ నెల 20న విచారణకు రానుంది. సందేశ్‌ఖాలీ వద్ద ‘144 సెక్షన్’ కింద నిషేధాజ్ఞల ఉత్తర్వులను కలకత్తా హైకోర్టు మంగళవారం పక్కన పెట్టింది. ఆంక్షలను ఎత్తేయాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ ఇద్దరు స్థానికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ జరుసేన్‌గుప్తా.. నిషేధాజ్ఞలు అమలు చేసేందుకు అనుసరించిన విధానం సరైనది కాదని చెప్పారు. మరోవైపు.. ‘జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్’ సైతం ఈ ఘటనలను సుమోటోగా స్వీకరించింది. పూర్తి వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పోలీసులు, అధికారులను ఆదేశించింది.
రేషన్ కుంభకోణం కేసుకు సంబంధించి గత నెలలో టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్ ఇంటికి సోదాలకు వెళ్లిన ఇడి అధికారులపై కొందరు దాడికి పాల్పడ్డారు. అప్పటినుంచి షాజహాన్ పరారీలో ఉన్నాడు. అయితే షాజహాన్, అతడి అనుచరులు తమపై వేధింపులకు పాల్పడ్డారని, భూములను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ.. కొద్దిరోజులుగా కొంత మంది మహిళలు ఆందోళన చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ సివి ఆనందబోస్ సోమవారం ఈ ప్రాంతాన్ని సందర్శించి.. బాధితులను పరామర్శించారు.