రాజస్థాన్‌లో ముగిసిన ప్రచారం

రాజస్థాన్‌లో ముగిసిన ప్రచారం– రేపే 199 స్థానాలకు పోలింగ్‌…బరిలో 1863 మంది అభ్యర్థులు..
జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు గురువారంతో ముగిశాయి. ఇకపై ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేయనున్నారు. రాజస్థాన్‌లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు నవంబర్‌ 25న(శనివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో 5,25,38,105 మంది ఓటర్లు, 1863 మంది అభ్యర్థులు ఉన్నారు..
నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బహిరంగ సభ, ఊరేగింపు నిర్వహించరాదు. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన ఏదైనా విషయాన్ని ఓటింగ్‌కు ముందు టెలివిజన్‌ లేదా మరే ఇతర మాధ్యమం ద్వారా ప్రజలకు ప్రసారం చేయలేరు.
ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించనున్నట్టు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ గుప్తా తెలిపారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆ నియోజకవర్గంలోని ఓటరు లేదా అభ్యర్థి లేదా ఎంపీ లేదా ఎమ్మెల్యే కాని రాజకీయ వ్యక్తి ఎవరూ ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో నివసించకూడదని ఎన్నికల సంఘం ఆదేశించింది.
రాష్ట్రంలో ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ ల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ,అమలు చేసిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్‌ ప్రచారాన్ని కేంద్రీకరించింది. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఏడు గ్యారంటీలను ప్రకటించగా, రాష్ట్రంలో నేరాలు, బుజ్జగింపులు, అవినీతి , పేపర్‌ లీకేజీల వంటి అంశాలపై కాంగ్రెస్‌పై బీజేపీ ఎక్కుపెట్టింది.
కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఇతర నేతలు పలు ఎన్నికల సభల్లో ప్రసంగించారు. బీజేపీ ప్రచారమంతా ప్రధాని మోడీ మీదే వేసుకుని..అంతా తానే అన్నట్టుగా వ్యవహరించారు. అలాగే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రులు స్మృ ఇరానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా చాలా చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు.
రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అయితే కరణ్‌పూర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌ సింగ్‌ కున్నార్‌ కన్నుమూశారు, దీని కారణంగా 199 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది.