కోటరీతోనే కారుకు కష్టాలు

The car has difficulties with the coterie– మంత్రి పదవి ఇస్తానంటేనే బీఆర్‌ఎస్‌లో చేరా..
– మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ- నల్లగొండ టౌన్‌
కొన్ని రోజులుగా గులాబీ పార్టీపై గుర్రుమంటున్న శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి పోతున్నట్టు ప్రచారం జోరందుకుంది. గతంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు.. తాజాగా బీఆర్‌ఎస్‌పై వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. రేవంత్‌ పాలన బాగుందని ప్రజలు మెచ్చుకుంటున్నారంటూ గుత్తా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి తనకు బంధువని, అసెంబ్లీ సమావేశాలు మినహా ఎక్కడా ఆయనను ఎక్కువగా కలవలేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా తన కుమారున్ని ప్రకటిస్తే బాగుండేదని ఆయన మనసులో మాట చెప్పారు. తాజాగా శనివారం ఓ మీడియాతో మాట్లాడిన ఆయన తనకు మంత్రి పదవి ఇస్తానంటేనే తాను బీఆర్‌ఎస్‌లో చేరానని, కానీ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డికి గుత్తా సుఖేందర్‌ రెడ్డికి అంతర్గతంగా పడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. నాయకత్వంపై విశ్వాసం లేకనే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయని, నాయకులు పార్టీని వీడుతున్నారని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కోటరీ వల్లే బీఆర్‌ఎస్‌కు ఈ దుస్థితి నెలకొందని, అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం వల్ల బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు సాగాయని అన్నారు. పార్టీలో పరిస్థితులపై.. ఓటమిపై అంతర్గత సమీక్షలకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి చాలామంది కోటీశ్వరులు అయ్యారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే ఉండిపోతుందన్నారు. కేసీఆర్‌ బూతులు మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
బీఆర్‌ఎస్‌లో అంతర్గత సమస్యలు, నేతల సహాయ నిరాకరణతోనే ఎంపీ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్‌ పోటీ నుంచి వెనక్కి తగ్గాడనీ స్పష్టం చేశారు. కేసీఆర్‌ సూచన మేరకు తన కుమారుడు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. స్థానిక నేతల సహకారం లేకపోవడం.. కొందరు నేతలు పార్టీ మారుతున్నారని చెప్పడంతో పోటీ నుంచి అమిత్‌ తప్పుకున్నారని చెప్పారు. అంతేకాకుండా, నేతలు అహంకారంగా వ్యవహరించడంతో ప్రజలకు దూరమవుతున్నారని, బఠానీలు అమ్ముకునే నేతలు కోట్లకు పడగలెత్తారన్నారని పేర్కొనడంతో త్వరలో బీఆర్‌ఎస్‌ పార్టీకి గుత్తా సుఖేందర్‌రెడ్డి దూరం అవుతారని ప్రచారం సాగుతోంది. గతంలో తాను కేసీఆర్‌ చెప్పిన విధంగా మంత్రి పదవి హామీతోనే బీఆర్‌ఎస్‌లో చేరానని, కానీ కేసీఆర్‌ ఆ మాట నిలబెట్టుకోలేదని.. ప్రస్తుతం తాను ఏ పార్టీతోనూ సంబంధం లేని రాజ్యాంగబద్ధ పదవి శాసనమండలి చైర్మెన్‌ హోదాలో ఉన్నానని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్సీల అనర్హతకు సంబంధించి ఫిర్యాదులను రాజ్యాంగం ప్రకారం న్యాయ నిపుణుల సలహాలతో నిష్పాక్షికంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
అగ్ర నాయకత్వం పట్ల గుత్తా అసంతృప్తి
గుత్తా సుఖేందర్‌ రెడ్డి కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీ నాయకత్వంపై గుత్తా చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన కూడా త్వరలో బీఆర్‌ఎస్‌ను వీడొచ్చన్న ప్రచారం వినిపిస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి గుత్తాకు, ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్‌కు స్పష్టమైన హామీ లభించిన నేపథ్యంలోనే ఆయన బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై విమర్శలకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి, గుత్తా సుఖేందర్‌ రెడ్డికి మొదటి నుంచీ పొసగడం లేదు. తన కుమారుడు అమిత్‌ రెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్‌ రాకుండా జగదీశ్‌ రెడ్డి అడ్డుపడ్డారని గుత్తా కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా గుత్తా జిల్లా బీఆర్‌ఎస్‌లో లిల్లీపుట్‌ నాయకులంటూ చేసిన వ్యాఖ్యలు జగదీశ్‌రెడ్డిని, ఆయన మద్దతుదారులైన కొందరు మాజీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినవేనంటున్నారు. గుత్తా తాజా వ్యాఖ్యల క్రమంలో ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో గుత్తా వర్గీయులకు.. జగదీశ్‌ రెడ్డి వర్గీయులకు మధ్య మున్ముందు మరింతగా పరస్పర ఆరోపణల పర్వం కొనసాగే అవకాశముంది. గుత్తా బీఆర్‌ఎస్‌ వీడిన పక్షంలో జిల్లా రాజకీయాల్లో ఆ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల తరుణంలో రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశముంది.
పార్టీ మార్పు అవాస్తవమే.. : గుత్తా
పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖండించారు. పార్టీ మార్పు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శనివారం సాయంత్రం తనను కలిసిన మీడియాతో వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని అన్నారు. ఇప్పటికైనా పార్టీ నిర్మాణంపైనా, నాయకత్వంపైనా దృష్టిసారించాలన్నారు.
ఆయన వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లేదు : జగదీశ్‌రెడ్డి
గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయన చాలా సీనియర్‌ నాయకుడని, పార్టీ నిర్మాణంపై ఆయన సలహాలు తీసుకుంటామని అన్నారు. ఏ పార్టీ ఎలా ఉందనే విషయాలు గుత్తాకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన అంశాలపై ఎంపీ ఎన్నికల తర్వాత చర్చిస్తామన్నారు.