థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ (టి.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో 2008 నుండి మే 25వ తేదీని ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంగా అనేక దేశాల్లో నిర్వహిస్తూ, థైరాయిడ్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల జనాభా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. చైనా, అమెరికా, భారత్, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో ఈ బాధితులు ఎక్కువగా ఉన్నారు.
సీతాకోకచిలుక ఆకారంలో గొంతులో, కాలర్ బోన్ పైన ఉండే ‘థైరాయిడ్ గ్రంథి’ మానవుని ‘జీవక్రియలు’ (మెటబాలిజం) సక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. సరైన రీతిలో హార్మోన్లను ఉత్పత్తి చేసి, మానవుని శారీరక, మానసిక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తూ కణ, నాడీ వ్యవస్థ, గుండె, లివర్, బ్రెయిన్, కిడ్నీ మొదలగు అవయవాల పనితీరులో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఈ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయక పోవడం వలన ముఖ్యంగా ‘గాయిటర్’ సమస్య (థైరాయిడ్ గ్రంథి పెరుగుదల), హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, థైరోడిటిస్, థైరో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరగటం ఆందోళన కలిగించే విషయం. దీనికి ప్రధాన కారణం ఊబకాయం. మెనోపాజ్, ఆందోళన-ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వారసత్వంగా వచ్చిన లక్షణాలు, పర్యావరణం, నీటి కాలుష్యం, కాస్మెటిక్, కెమికల్ పరిశ్రమలో పనిచేస్తున్న వారు థైరాయిడ్ సమస్యలకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
మనదేశంలో ప్రస్తుతం 42 మిలియన్ల ప్రజలు థైరాయిడ్ బాధితులు ఉండగా, ప్రతీ పదిమందిలో ఒకరు థైరాయిడ్ సమస్యని ఎదుర్కొంటున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గర్భిణీ స్త్రీలలో ఈ సమస్యల వలన ముందస్తు ప్రసవాలు, శిశు మరణాలు సంభవిస్తూ, తక్కువ బరువు ఉన్న శిశువులకు జన్మనిస్తున్నారు.
‘కాగ్నిటివ్ హైపో థైరాయిడిజమ్’ శారీరక, మానసిక లోపాలతో పిల్లలు పెరగడానికి కారణమవుతుంది. ఇన్ని సమస్యలకు ప్రధాన కారణం అయోడిన్ లోపం, అవగాహన లేకపోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయుంచుకోక పోవటం. మన దేశంలో ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలు, మహారాష్ట్ర, యుపిలలో ‘హైపో థైరాయిడ్’ బాధితులు; దక్షిణ భారతదేశంలో ‘హైపర్ థైరాయిడ్’ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రతీ ముగ్గురు స్త్రీలలో ఒకరు బరువు పెరగడం (ఊబకాయం), హార్మోన్ల అసమానతలతో బాధపడుతున్నారు. విసుగు, అజీర్తి, రక్తహీనత, గర్భస్రావాలు, బ్లీడింగ్ సమస్యలు ముఖ్యంగా పిల్లలు పుట్టక పోవడం (వంధ్యత్వం) లాంటి సమస్యలు పెరుగుతున్నాయి.
అమెరికా పెథాలజిస్టు డేవిడ్ మెరైన్ 1907లోనే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి, 1811లో బెర్నార్డ్ కోర్టిస్ కనుగొన్న ‘అయోడిన్’ పరమ ఔషధంగా పేర్కొన్నాడు. 1543లోనే శరీరగుట్టు విప్పి, థైరాయిడ్ గ్రంథి విషయం తెలుసుకున్న ‘విసేలియస్’ కాలంలోనే ‘సీవీడ్’ సముద్రపు పాచి (మెరైన్ ఆల్గే) థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి మందు అని తెలిపారు.
ప్రస్తుత కాలంలో ‘అయోడిన్’ ఉప్పు వాడకం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. 1993 సంవత్సరం నుండి ‘యూనివర్సల్ సాల్ట్ ఐయోడేషన్’ కార్యక్రమం ద్వారా థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా ‘గాయిటర్’ తగ్గుముఖం పట్టింది. ఇది ప్రస్తుతం ‘చాపకింద నీరులా’ ‘నిశ్శబ్ధ వ్యాధి’లా చాలామందిలో విస్తరిస్తూ, ముఖ్యంగా మహిళలు, పిల్లలలో తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ సమస్యలు పరిష్కారానికి ప్రజల్లో అవగాహన పెంచాలి. పరీక్షలు, సర్వేలు నిర్వహించాలి. ఆహారపు అలవాట్లు నియంత్రణ చేసుకోవాలి. సరైన వ్యాయామం చేయాలి, పొగత్రాగడం మానాలి. ‘మీటా’ ప్రోగ్రాం (మేకింగ్ ఇండియా థైరాయిడ్ అవేర్నెస్) మరింత ప్రజలలోనికి తీసుకెళ్లి, మహిళలు, గర్భిణీలకు అవగాహన కల్పించటం, వైద్య సలహాపై సరైన మందులు వాడటం ద్వారా థైరాయిడ్ సమస్యల నుండి బయటపడే విధంగా ప్రభుత్వాలు, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, మేధావులు సహకారంతో పరిష్కారానికి కషి చేయటయే ఈ థైరాయిడ్ దినోత్సవం జరుపుటలో పరమార్థం.
– ఐ.ప్రసాదరావు, 9948272919