– కనీస వేతనాలను జీవోలను సవరించాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం బోనస్, ఈఎస్‌ఐలపై విధించిన సీలింగ్‌ను వెంటనే ఎత్తేయాలనీ, కనీస వేతనాల జీవోలను సవరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో పెట్రోలియం, గ్యాస్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(పీజీడబ్ల్యూఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆయిల్ సెక్టార్‌లోని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్స్‌డేను నిర్వహించారు. డిప్యూటీ లేబర్ కమిషనర్(సెంట్రల్)కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బి. మధు మాట్లాడుతూ బోనస్, ఈఎస్‌ఐ చట్టాల అమలుకు అర్హతలపై కేంద్ర ప్రభుత్వం 2017లో రూ.21 వేల వేతన సీలింగ్‌ని విధించిందనీ, ఆరేండ్లుగా సీలింగ్‌ను సవరించలేదని తెలిపారు. దీని ఫలితంగా ఆయిల్ సెక్టార్‌తో సహా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనేక ప్రభుత్వరంగ సంస్థల్లోని కాంట్రాక్ట్ కార్మికులు బోనస్‌ని పొందలేకపోతున్నారనీ, ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు నెలకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు నష్టపోతున్నాడని వాపోయారు. ఈఎస్‌ఐ వర్తించకపోవడంతో వైద్యసౌకర్యాలను కూడా కోల్పోతున్న తీరును వివరించారు. బోనస్, ఈఎస్‌ఐ, పీఎఫ్‌కు సీలింగ్‌ను పెట్టడం అన్యాయమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2022లో సవరించాల్సిన జీఓలను నేటి వరకు సవరించలేదని విమర్శించారు.. ఫలితంగా ప్రభుత్వరంగ సంస్థలలోని కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో కుటుంబాలను గడపాల్సిన స్థితిలోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, నాయకులు పి.గణేష్, రామాచారి, నిమ్మ వెంకటేశ్వర్లు, సాగర్, మన్సూర్, మోహన్, సంపత్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.